కార్పొరేషన్, మార్చి 4 : కరీంనగర్ నగరపాలక సంస్థ సిబ్బంది ఆస్తి పన్నులను వంద శాతం వసూలు చేయాలని నగర మేయర్ వై సునీల్‌రావు సూచించారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కమిషనర్ సేవా ఇస్లావత్, డిప్యూటీ కమిషనర్ త్రయంబకేశ్వర్‌తో కలిసి పన్నుల వసూళ్లపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మా ట్లాడుతూ, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలో గా ఇచ్చిన లక్ష్యాల మేరకు ఆస్తి పన్నులను వసూలు చేయాలని ఆదేశించారు. నగరపాలక సంస్థకు రూ.30 కోట్ల మేర డిమాండ్ ఉన్నా అనుకున్న స్థాయిలో బిల్ కలెక్టర్లు, ఆర్ఐలు పన్నులను వసూలు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కేవలం 65 శాతం పన్నులు మాత్రమే వసూలు కావడం సరికాదన్నారు. రెవెన్యూ విభాగం అధికారు లు, సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. ప్రతిరోజూ నిర్ణయించిన లక్ష్యం మేరకు పన్నులు వసూలు చేయాలన్నారు.
రెసిడెన్షియల్ ఆదాయం పన్నులే కాకుండా కమర్షియల్ భవనాలపై వచ్చే పన్నులపై కూడా దృష్టి పెట్టి నగరపాలక సంస్థ ఆదాయాన్ని పెంచాలన్నారు. ఏప్రిల్ నుంచి తాను స్వయంగా భవనాల కొలతలు వేసి తనిఖీలు చేస్తానని హెచ్చరించారు. కొలతల విషయంలో ఎలాంటి మార్పులు ఉన్నా సంబంధిత రెవెన్యూ సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. నగర అభివృద్ధి విషయంలో ప్రజల నుంచి వచ్చే డిమాండ్లను నెరవేర్చాలంటే నగరపాలక సంస్థ ఆదాయం పెంచుకోవాలన్నారు. భువన్ యాప్ ద్వారా ఎంట్రీలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు తమ ఏరియాల వారీగా భవనాల కొలతలపై బిల్ కలెక్టర్, ఆర్ఐలు ప్రత్యేక దృష్టి పెట్టి తనిఖీ చేయాలన్నారు. నగరంలో 26 వేల కమర్షియల్ భవనాలకు సంబంధించిన ట్యాక్స్‌ను వసూలు చేయాలన్నారు.
మొండి బకాయిదారులు ఎవరైనా ఉంటే వారికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమర్షియల్‌కు వినియోగించే భవనాలకు కమర్షియల్ టాక్స్ విధించకపోతే సంబంధిత బిల్ కలెక్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తమ తనిఖీల్లో ఇలాంటివి బయటపడితే సంబంధింత బిల్ కలెక్టర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఏటా నగరపాలక సంస్థ డిమాండ్ రూ.30 కోట్లు మాత్రమే ఉందని, విస్తరిస్తున్న నగరంలో తక్కువగా డిమాండ్ ఉందన్నారు. నగరంలో పెద్ద సంఖ్యలోనే కమర్షియల్ భవనాలు ఉన్నాయని, ఆ మేరకు పన్నులు రావడం లేదన్నారు. శివారు డివిజన్లల్లోని ఆస్తి పన్నులను కూడా రివైజ్డ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. సంబంధిత డివిజన్ల పరిధిలో ఉన్న బిల్ కలెక్టర్లు ప్రతి ఇంటి కొలతలు తీసుకొని పన్నులను విధించాలన్నారు. దీనికి సంబంధించి పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. కమర్షియల్, గృహ వినియోగం భవనాలకు వేర్వురుగా పన్నులను విధించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి వంద శాతం పన్నులు వసూలు కావాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్వో ఆంజనేయులు, ఆర్ఐలు శ్రీకాంత్, రషీద్,బిల్ కలెక్టర్లు,సిబ్బంది పాల్గొన్నారు.