జమ్మికుంట, మార్చి 4: పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి బదిలీపై ఇతర ఠాణాలకు వెళ్లిన పోలీస్ సిబ్బంది సేవలు అభినందనీయమని, ఉద్యోగం ఎక్కడ చేసినా అంకితభావంతో విధులు నిర్వహించాలని హుజూరాబాద్ ఏసీపీ వెంకట్‌రెడ్డి సూచించారు. జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఎస్ఐలు సతీశ్, దత్తాత్రి, ఏఎస్ఐ రహమాన్, హెడ్ కానిస్టేబుల్ ప్రవళిక, మరో 22మంది కానిస్టేబుల్స్ ఇటీవల బదిలీపై వెళ్లారు. పట్టణ సీఐ రాంచందర్‌రావు ఆధ్వర్యంలో బదిలీపై వెళ్లిన అధికారులు, సిబ్బందికి శుక్రవారం స్థానిక ఎంపీఆర్ గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా ఏసీపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2019లో జమ్మికుంట స్టేషన్ దేశంలోనే అత్యుత్తమ ర్యాంకు సాధించిందని, అందుకు సిబ్బంది చేసిన కృషిని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో ప్రస్తుతం బదిలీపై వెళ్లిన పోలీస్ స్టేషన్లలో కూడా ఉత్తమ సేవలు అందించాలని, అన్ని వర్గాల మన్ననలు పొందాలని పేర్కొన్నారు. ప్రజలతో స్నేహభావాన్ని పెంపొందించుకోవాలన్నారు.
పోలీసులు ప్రజల శ్రేయోభిలాషులని, ప్రజలు సహకరిస్తేనే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయగలమని జమ్మికుంట పట్టణ సీఐ రాంచందర్‌రావు, రూరల్ సీఐ సురేశ్, హుజూరాబాద్ పట్టణ సీఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగిస్తామన్నారు. తర్వాత బదిలీపై వెళ్లిన ఎస్ఐలు, సిబ్బంది మాట్లాడుతూ.. ఇక్కడి ప్రజల ఆదరాభిమానాలు గొప్పవని, విధులకు సహకరించిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అధికారులు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక ఎస్ఐలు రామ్మోహన్, తిరుపతి, శేఖర్‌రెడ్డి, ఏఎస్ఐలు, హెచ్‌సీలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.