అంతర్గాం, మార్చి 4: కుందనపల్లి భూనిర్వాసితుల సమస్యలు పరిష్కారమయ్యేదాకా వారి వెంట ఉంటానని పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్‌నేత ప్రకటించారు. నిర్వాసితుల పోరాటానికి మద్దతునిస్తానని చెప్పారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అంతర్గాం మండలంలోని కుందనపల్లి లో భూ నిర్వాసితులు చేస్తున్న రిలేదీక్షా శిబిరానికి చేరుకున్నారు. సంఘీభావం తెలిపి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా దీక్ష శిబిరంలో కూర్చున్న వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కలెక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ, ఎన్టీపీసీ ఈడీతో ఫోన్లో మాట్లాడారు. ఎన్టీపీసీకి 1700 ఎకరాల భూమి ఇచ్చిన కుందనపల్లివాసుల సమస్యలపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. బూడిద చెరువు కారణంగా గాలి, నీరు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గ్రామం నుంచి పెద్దపల్లి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టి సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారని, తాము సైతం ఢిల్లీలో ఎన్టీపీసీ సీఎండీ కులుదిప్సింగ్ ను కలిసి సమస్యలను ఏకరువు పెట్టామని పేర్కొన్నారు. పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. పరిష్కారమయ్యేదాకా నిర్వాసితుల పోరాటానికి మద్దతిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కన్నూరి సతీశ్‌కుమార్, నాయకులు ఆలేటి గణేశ్ పాల్గొన్నారు.