చొప్పదండి, ఫిబ్రవరి 28: నియోజకవర్గకేంద్రంలోని అతి ప్రాచీనమైన శివకేశవ ఆలయం మంగళవారం నుంచి జరిగే శివరాత్రి ఉత్సవాలకు అన్ని హంగులతో ముస్తాబైంది. శనివారం బండ్ల మహోత్సవం, సోమవారం జాతర రథోత్సవం, దిష్టి కుంభం, హోమాదులు నిర్వహించనున్నారు. కీ.శ 1009 ఒక శాసనం ఈనాటి శివ కేశవ ఆలయం. కళ్యాణి చాళుక్యుల సామ్రాజ్యంలో చొప్పద్యాండిగా విలసిల్లిన ఈనాటి చొప్పదండికి విశేష ప్రాధాన్యత ఉన్నదని ఇక్కడి శాసనాలతో తెలుస్తున్నది. బేలకుంట సమీపంలో కీ.శ. 922లో చాళుక్య రాజుల్లో అహవ మల్లవ దేవ బిరుదాంకితుడైన రెండవ తైలుపుని కాలనికి చెందిన దుగ్గరాముడు అనే అధికారి కూతురైన అచబ్బె (ఆచవ్వ) పేరిట ఈ శాసనం లభించింది. ఇరువలెండిగా బిరుదున్న సత్యాశ్రమ కళ్యాణి చాళుక్య ప్రభువు కాలంలో దేవకబ్బె కీ.శ. 1009లో చేసిన శాసనమే ఈనాటి శివకేశవాలయం. విశాలమైన ప్రాకారాల మధ్య పెద్ద శిలలతో నిర్మితమై, తూర్పువైపు ముఖం ఉన్నది. దక్షిణ దిశలో జనేమేజయుని కాలం నాటి యజ్ఞగుండం, దక్షిణ దిశలో వీరభద్రస్వామి ఆలయం, మండపానికి ఎదురుగా నందీశ్వరుడు ఉన్నారు. ఇక్కడి శివలింగం ఇసుకతో చేసిందని రూర్వీకుల కథనం. శివకేశవాలయాలు ఎదురెదురుగా ఉండడం మరో ప్రత్యేకత. ఫాల్గుణ మాస శుద్ధ పంచమి రోజున శంభుస్వామి జాతర జరుగుతుంది.
గంగాధరలో..
మండలంలోని కోట్లనర్సింహులపల్లి శ్రీసోమేశ్వర ఆలయం, వెంకంపల్లి రామలింగేశ్వర ఆలయం, కొండన్నపల్లి సహస్ర లింగేశ్వర ఆలయం, గంగాధర వీరభద్రస్వామి ఆలయం, గర్శకుర్తి, గట్టుభూత్కూర్లోని మార్కండేయ స్వామి ఆలయంలో మహాశివరాత్రికి ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల కోసం చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.
ఉత్సవాలకు ఏర్పాట్లు
నగునూర్ త్రికుటాలయంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సోమవారం శివాలయంలో విద్యుత్ దీపాల అలంకరణ, పరిసరాలు శుభ్రం చేశారు. సర్పంచ్ ఉప్పు శ్రీధర్ ఆధ్వర్యంలో లడ్డూలు తయారు చేయించి, ఆలయం చుట్టూ టెంట్లు వేశారు. చామనపల్లి ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చేగుర్తి వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణం నిర్వహిస్తున్నారు. గోపాల్పూర్ మల్లికార్జున స్వామి దేవాలయం, బొమ్మకల్, మొగ్దుంపూర్ శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయా గ్రామాలు సర్పంచులు పేర్కొన్నారు.
వెలిచాల సోమేశ్వరాలయం
వెలిచాల సోమేశ్వరాలయాన్ని సర్పంచ్ వీర్ల సరోజనాప్రభాకర్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని మంగళవారం ఉదయం అభిషేకాలు, సాయంత్రం 7 గంటలకు పార్వతీపరమేశ్వరుల కల్యాణ మహోత్సవం, అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవం నిర్వహిస్తారని పేర్కొన్నారు.