పెద్దపల్లి, మే 29(నమస్తే తెలంగాణ): రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్ఎఫ్సీఎల్)కు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి బోర్డు గట్టి షాక్ ఇచ్చింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గాలి, నీరును విషతుల్యం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా వ్యర్థ రసాయనాలను గోదావరి నదిలోకి వదులుతున్న వైనం, గ్యాస్ లీకేజీలపై రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)కి ఫిర్యాదు చేయడంతో వెంటనే ఎరువుల ఉత్పత్తిని నిలిపి వేయాలని ఆ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా 12.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో, ఆరు సంస్థల భాగస్వామ్యంతో రామగుండంలో నిర్మించిన రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)ను భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రెండు దశాబ్ధాల పాటు బొగ్గు ఆధారితంగా నడిపించారు. అయితే, నష్టాలతో మూత పడగా, మళ్లీ దాని స్థానంలో గ్యాస్ ఆధారితంగా నిర్మించారు. గతేడాది నుంచి కిసాన్ బ్రాండ్ యూరియా ఎరువును తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రతీ రోజూ ఈ ప్లాంట్లో 2200ల మెట్రిక్ టన్నుల అమోనియా, 3850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేస్తున్నారు.
ఈ క్రమంలో ఈ నెల 26న అధికారికంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ అనివార్య కారణాల వల్ల దానికి నోచుకోలేదు. సాంకేతిక వైఫల్యాలతో తరచూ షట్డౌన్ చేస్తూ నడిపిస్తున్నారు. ఈ క్రమంలో నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోకుండా, కాలుష్య నియంత్రణ మండలి నుంచి కాన్సెంట్ ఆఫ్ ఆపరేషన్ తీసుకోకుండానే యాజమాన్యం వ్యర్థ జలాలు, రసాయనాలు, తదితరాలను గోదావరిలోకి, జనావాసాల్లోకి వదులుతున్నదనే విమర్శలు వెల్లువెత్తాయి. లీకేజీ అవుతున్న వాయువులతో ప్రజలు బెంబేలెత్తుతుండగా అమోనియా లీకేజీపై పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖలకు ప్రజలు ఇప్పటికే పలు ఫిర్యాదులు చేశారు. ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతున్న ఆర్ఎఫ్సీఎల్పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కోరుకంటి సైతం ఇటీవల రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఆర్ఎఫ్సీఎల్ వ్యర్థాలు గోదావరిలో నేరుగా కలుస్తుండటం, శుద్ధి చేయకపోవటం వల్ల సరస్వతీ బ్యారేజీ బ్యాక్ వాటర్ ఏరియా గోదావరిఖని గంగా బ్రిడ్జి వద్ద నీటిపై కాలుష్యపు బుడగలు రావడంపై నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. తాగునీరు సైతం కలుషితమవుతున్నదని, గ్యాస్ లీకేజీల వల్ల ప్రజలు సతమతమవుతున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఫిర్యాదుతో పీసీబీ బృందం వారం రోజుల పాటు కర్మాగారంలో తనిఖీలు నిర్వహించింది. 12 చోట్ల లోపాలున్నాయని గుర్తించింది. వీటిని సరిదిద్దేంత వరకు కర్మాగారాన్ని మూసి వేయాలని ఆదేశించింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అండర్ సెక్షన్-31ఏ ప్రకారం వాయు కాలుష్య నియంత్రణ చట్టం-1987ను అనుసరించి ఎరువుల ఉత్పత్తి ప్రక్రియ నిలుపుదల చేసి ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణ సంరక్షించాలని పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఆర్ఎఫ్సీఎల్ నుంచి రూ.12 లక్షల గ్యారెంటీ సొమ్మును జప్తు చేసింది.
ప్రమాణాలు పాటించకపోవడం వల్లే నిలిపివేత
ఆర్ఎఫ్సీఎల్ నిర్వహణలో ప్రమాణాలను పాటించటం లేదు. 12 రకాల లోపాల కారణంగా రామగుండం ప్రాంతంలో నీరు, వాయు, శబ్ధ కాలుష్యాలు జరుగుతున్నాయి. వీటి కారణంగా అనునిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఆర్ఎఫ్సీఎల్ను టాస్క్ ఫోర్స్ కమిటీ సందర్శించింది. లోపాలన్నింటినీ గుర్తించి నాలుగు నెలల క్రితమే డైరెక్షన్స్ ఇచ్చింది. తాజాగా తనిఖీలు చేసినప్పుడు సైతం ఆవే లోపాలు కనిపించాయి. ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యంలో ఎలాంటి మార్పు లేదు. దీంతో పాటు ఇండ్ల మధ్యలో ఉన్న కారణంగా కంపెనీ లోపాల వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం కలిగే ప్రమాదముంది. అంబేంట్ ఎయిర్ క్వాలిటీ మిషన్లు మూడు ఏర్పాటు చేయాలని చెప్పాం. కానీ, రెండు పెట్టారు, మరొకటి పెట్టలేదు. ఎఫ్లేట్ మానిటరింగ్ మిషన్ ఏర్పాటు చేయమని చెప్పాం. దానిని కూడా పెట్టలేదు, ఎస్టీపీ కట్టమన్నా కూడా కట్టలేదు. నాయిస్ పొల్యూషన్ వల్ల వీర్లపల్లి వాళ్లకి ఎక్కువ సమస్య ఏర్పడింది. ఒక లైన్ ప్రాబ్లం కూడా ఉంది. గాలిలో అమోనియా శాతం ఎక్కువగా కన్పిస్తుందని, గ్యాస్ మాటి మాటికీ లీక్ అవడం వంటి వాటి వల్ల స్టాప్ ప్రొడక్షన్ ఆర్డర్ ఇచ్చాం.
-రవిదాస్, ఎన్వీరాన్మెంట్ ఇంజినీర్, పీసీబీ
కేంద్రం పర్యవేక్షణ లోపం వల్లే..
రామగుండం ఎరువుల కర్మాగారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లతో అన్ని ర కాల వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసింది. కానీ, కర్మాగారం ఏర్పాటు విషయంలో కేంద్రం పర్యవేక్షణా లోపం వల్ల నాసిరకమైన మిషనరీలను బిగించారు. దీంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. లిక్విడ్ అమోనియాతో తయారు చేసే యూరియా, ఎరువుల వల్ల గాలిలో బూడిద చేరి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. రసాయన వ్యర్థాలు గోదావరిలో కలుస్తుండటం వల్ల నీరు కలుషితమవుతున్నది. ఒక్కోరోజు విష వాయువులు గాలిలో కలిసి దుర్వాసనతోపాటు చర్మంపై దద్దులు, మంటలు రేపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పలుమార్లు కర్మాగారాన్ని సందర్శించి వాయు, జల, శబ్ధ కాలుష్యాలు జరగకుం డా, ప్రజలపై ప్రభావం చూపకుండా చర్యలు చేపట్టాలని కోరినప్పటికీ యాజమాన్యం పెడచెవిన పెడుతున్నది. కర్మాగారం ఏర్పాటు సమయంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో ఒక్క కలుషిత నీటి చుక్క కూడా తమ ప్లాంట్ నుంచి బయటికి రాదని, వాయు కాలుష్యం జరగదని చెప్పింది. అయినా అవేవీ ఆచరణలో లేవు. సాంకేతిక, కార్మిక, ఉద్యోగాలు సైతం స్థానికులకే ఇస్తామని చెప్పినప్పటికీ అలా సాధ్యం కావడం లేదని హమాలీ కార్మికులను బిహార్ నుంచి తెచ్చుకుంటున్నది. ప్రభావిత గ్రామాలైన వీర్లపల్లి, లక్ష్మీపూర్ గ్రామాల నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం ఆర్ఎఫ్సీఎల్ను కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను లోబడి నడిపించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నడిపిస్తున్నది. ఇందుకు త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేస్తా. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆర్ఎఫ్సీఎల్ను కాలుష్య నియంత్రణ మండలి నియమ నిబంధనలకు లోబడి రామగుండం నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పునః ప్రారంభించాలి.
-కోరుకంటి చందర్, ఎమ్మెల్యే, రామగుండం