హౌసింగ్‌బోర్డుకాలనీ, ఫిబ్రవరి 14: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిషరించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఆయన జిల్లా అధికారులతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దూర ప్రాంతాల ప్రజలు తమ సమస్యల పరిషారానికి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారని, సమస్యలను వెంటనే పరిషరించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్ మాట్లాడుతూ, వివిధ కార్యాలయాలకు సంబంధించి కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులకు కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని అధికారులకు సూచించారు. కౌంటర్ ఫైల్ దాఖలు చేయని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వివిధ శాఖల్లో ఖాళీల వివరాలను వెంటనే సమర్పించాలని సూచించారు. కాగా, జమ్మికుంట మండలం మడిపల్లి నుంచి వీరయ్య మాట్లాడుతూ, తన భూమి రిజిస్ట్రేషన్ కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకోగా, ధరణిలో నమోదు కాలేదని చూపుతున్నదని తెలుపగా తహసీల్దార్ పరిశీలించి నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్తపల్లి మండలం ఎలగందుల నుంచి రహీం మాట్లాడుతూ, తన వ్యవసాయ భూమి వివరాలు ధరణిలో నమోదు కాలేదని విన్నవించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. జమ్మికుంట నుంచి సదానంద చారి మాట్లాడుతూ, గ్రామంలోని గుడి వద్ద 12 గుంటల స్థలం ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేయగా ఆర్డీవోతో సర్వే చేయించి చర్యలు తీసుకుంటారని తెలిపారు.
ప్రజావాణికి 84 దరఖాస్తులు
ప్రజా సమస్యల పరిషారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో 84 మంది నుంచి వివిధ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి 37, పంచాయతీరాజ్ శాఖకు 7, కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయానికి సంబంధించి 4, మున్సిపల్‌కు సంబంధించి 12, కాగా, ఇతర శాఖలకు సంబంధించి 24 సమస్యలపై దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో వెంటనే పరిషరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ సీఈవో ప్రియాంక, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్‌కుమార్, హుజూరాబాద్ ఇన్చార్జి ఆర్డీవో మయాంక్ మిట్టల్, డీఆర్డీవో శ్రీలత, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, మత్స్యశాఖ ఏడీ రాజనర్సయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్, అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి నతానియేల్, బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజమనోహర్, డీఎంహెచ్‌వో డాక్టర్ జువేరియా, జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, డీవైఎస్వో రాజవీరు, జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, డీపీవో వీరబుచ్చయ్య, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, వయోజన విద్యాశాఖ అధికారి జయశంకర్, ల్యాండ్ సర్వే ఏడీ అశోక్, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.