జమ్మికుంట, ఫిబ్రవరి 10: జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ల ఆదాయ లక్ష్యం రూ.13 కోట్ల 61 లక్షలు అని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి పద్మావతి తెలిపారు. జమ్మికుంట కాటన్ మార్కెట్‌ను గురువారం ఆమె సందర్శించారు. కొనుగోళ్లను పరిశీలించారు. అనంతరం 2014-15 నుంచి ఇప్పటి వరకు మార్కెట్లో, మార్కెట్ ద్వారా జరిగిన కొనుగోళ్లు, మార్కెట్ ఫీజు, వసూలు, తదితర రికార్డులను పరిశీలించారు. వివరాలను ఎప్పటికప్పుడూ అప్డేట్ చేయాలని ఆదేశించారు. అనంతరం డీఎంవో మాట్లాడుతూ, మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి మార్కెట్లో జరిగిన కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను అప్డేట్ చేస్తున్నామని, అందులో భాగంగానే మార్కెట్ల రికార్డులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. జమ్మికుంట, హుజూరాబాద్, కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, గంగాధర, గోపాల్రావుపేట మార్కెట్లలో మార్కెట్ ఫీజు జనవరి వరకు రూ.6 కోట్ల 71 లక్షల 76 వేలు వసూలు చేశామని, ఈ ఆర్థిక సంవత్సరం చివరి వారంలో లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. ఈ సీజన్లో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వరంగ సంస్థల ద్వారానే జరిగాయని, 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఫీజు రూ.12కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. మార్కెట్లలో కొనుగోళ్లు సాఫీగా సాగుతున్నాయని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. కాటన్ దిగుబడి తగ్గినా రైతులకు మద్దతు ధరను మించి పత్తికి అధిక ధర పలికిందని పేర్కొన్నారు. జమ్మికుంట అధికారులు, సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మార్కెట్ కార్యదర్శి రెడ్డినాయక్, యాకయ్య, బాబా, ప్రదీప్, సిబ్బంది ఉన్నారు.