కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి10: వేద మంత్రాలు.. మంగళ వాయిద్యాలు.. మేళాతాళాలు.. భక్తుల శరణుఘోష… కరతాళ ధ్వనుల మధ్య భూసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. నగరంలోని మార్కెట్ రోడ్డులో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో పంచమ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం యాగశాలలో నిత్యపూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర-పద్మావతీఅలివేలుమంగ విగ్రహాలను అందంగా అలంకరించారు. అనంతరం శ్రీదేవి-భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి, లక్ష్మీనారాయణస్వామి కల్యాణంలో భాగంగా రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులు, ఈవో పీచర కిషన్‌రావు ఆధ్వర్యంలో స్వామి వారికి పట్టు వస్ర్తాలు, అమ్మవారికి వివాహ లాంఛనాలు అందజేశారు. అలాగే, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల తరఫున కన్యాదాతగా తిరుమల తాళ్లపాక వంశం 12వ తరం వారసుడు హరినారాయణాచార్యులు వ్యవహరించారు.
ఈ కల్యాణ కార్యక్రమానికి జిల్లా కేంద్రానికి చెందిన శృంగేరి శారదాపీఠం ఆస్థాన పౌరాణికుడు గర్రెపల్లి మహేశ్వర శర్మ ఆధ్యాత్మిక ప్రసంగం చేయగా, స్థానిక అర్చకులు చక్రవర్తుల లక్ష్మీనారాయణాచార్యులు, చెన్నోజుల నాగరాజాచార్యులు స్వామి వారి కల్యాణం జరిపించారు. అనంతరం మంత్రి గంగుల ఆధ్వర్యంలో తిరుమల నుంచి తెప్పించిన లడ్డూ ప్రసాదం, అక్షింతలు, పసుపు, కుంకుమ, కంకణాలను భక్తులకు అందజేశారు. గోగుల ప్రసాద్ ఆధ్వర్యంలో ఆలపించిన కీర్తనలు, పాటలు భక్తులను అలరించాయి. సాయంత్రం గరుడ వాహన సేవ నిర్వహించగా, స్వామి వారు మాడ వీధుల్లో విహరించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, మేయర్ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ సతీమణి, జడ్పీ సీఈవో ప్రియాంక ఆలపించిన కీర్తనలు భక్తులను మంత్ర ముగ్దులను చేశాయి. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యుడు గోగుల ప్రసాద్ ఆధ్వర్యంలో రాజరాజేశ్వర స్వామి సంగీత పాఠశాల అన్నమాచార్య కీర్తనలు, సరళ బృందం, వైష్ణవి సాయినాథ్ బృందం చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పలువురు జిల్లా అధికారులు తదితరులు హాజరయ్యారు.