కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి 10: నగరంలోని మార్కెట్ రోడ్డులో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో పంచమ బ్రహ్మోత్సవాలు మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆలయానికి రోజూ సుమారు 20 వేల మంది భక్తులు వస్తుండగా, మంత్రి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్, గోవిందపతి శ్రీవారి సేవా సమితి సభ్యులు ప్రత్యేకంగా సేవలందిస్తున్నారు. ఉత్సవాల కోసం మంత్రి గంగుల కమలాకర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సభ్యులు అన్నీ తామై ఆలయంలో నిర్వహించే కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. ప్రతి పనిలో తామై ఉంటూ భక్తులకు, హాజరయ్యే అతిథులకు ఇబ్బందులు కలుగకుండా సేవలందిస్తున్నారు. అలాగే, రోజూ అన్నదాన కార్యక్రమం కొనసాగుతున్నది. మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో ఆరు రోజులుగా జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం ఫలహారం ఇలా రోజుకు సుమారు 18 వేల మంది భక్తుల ఆకలి తీరుస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పలువురు ఇక్కడే ఉంటూ అన్నదాన సేవలో పాలుపంచుకుంటున్నారు. గోవిందపతి శ్రీవారి సేవా సమితి సభ్యులు ఆలయానికి వచ్చే భక్తులకు శానిటైజ్ చేయడం, దర్శనం, అన్నదానం, వాహన సేవ, క్యూలైన్లలో భక్తులకు సేవలందిస్తున్నారు.
ఆనందంగా ఉంది
వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవ చేయడం ఆనందంగా ఉంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ నావంతు సేవ చేస్తున్న. పది రోజుల పాటు భక్తులకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్న.
– చిట్టుమల్ల ప్రశాంత్, ఉత్సవ కమిటీ సభ్యుడు
సౌకర్యాలు కల్పిస్తున్నం
మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని రకాల సేవలందిస్తున్నం. స్వామి వారి కల్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరైనా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించినం.
– టీ సుభాశ్, ఉత్సవ కమిటీ సభ్యుడు
నిత్యం అన్నదానం
మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది. మూడు పూటలా ఇక్కడ భక్తులకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం అల్పాహారం ఏర్పాటు చేస్తున్నం. భక్తుల ఆకలి తీరుస్తున్నందుకు సంతోషంగా ఉంది.
– అశోక్ రావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడు
అదృష్టంగా భావిస్తున్నం
వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్నదానం చేయడం అదృష్టంగా భావిస్తున్నం. రోజూ ఒక పూటకు ఆరువేల మంది భక్తులకు అన్నదానం చేస్తున్నం. వివిధ రకాల వంటకాలు, అల్పాహారం, ఇలా తిరుమల దేవస్థానంలో అందించినట్లుగా పెడుతున్నం. అన్నదానం చేయడం స్వామి వారికి సేవ చేసినట్లుగా భావిస్తున్నం. మా అసోసియేషన్‌కు అవకాశం ఇచ్చిన మంత్రి గంగుల కమలాకర్‌కు కృతజ్ఞతలు.
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడు
దైవ భక్తితో..
దైవ భక్తితో ఐదేళ్లుగా వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవ చేస్తున్న. మంత్రి గంగుల కమలాకర్ తనకు ఈ అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్న. ఆలయంలో భక్తులకు ఇబ్బందులు కలుగుకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నం. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అనగానే పది రోజులు మాత్రమే ఉంటాయి. కానీ, మేం అందించే సేవలు రెండు నెలల ముందు నుంచే ప్రారంభమవుతాయి.
– గంప రమేశ్, బ్రహ్మోత్సవాల కమిటీ సభ్యుడు
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా సేవలు
బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా గోవిందపతి శ్రీవారి సేవా సమితి ఆధ్వర్యంలో సేవలందిస్తున్నం. 1600 మంది మూడు షిఫ్టుల్లో సేవలందిస్తున్నరు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినం. అన్నదానం, క్యూలైన్, శోభాయాత్ర, ఇలా ఎక్కడా ఎవరికి ఇబ్బంది కలుగకుండా సేవ చేయాలన్నదే మా ఉద్దేశం. భక్తులు సైతం సహకరిస్తూ, దైవ దర్శనం చేసుకుంటున్నరు
. – నటరాజ్ రవి, ప్రధానకార్యదర్శి,