కార్పొరేషన్, ఫిబ్రవరి 10: ‘పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఆయన, బీజేపీ నేతలు ఇతరులకు నీతులు చెప్పడం మానుకొని ఆచరణలో చూపాలి’ అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అవగాహనా రాహిత్యంతో విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్‌కు వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడని ప్రశ్నిస్తున్న సంజయ్..ఈ విషయాన్ని ఇప్పుడు వారితో ఉన్న జితేందర్‌రెడ్డిని అడగాలని సూచించారు. బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రోజు ఏం జరిగిందో బండికి తెలుసా? అని ప్రశ్నించారు. కరీంనగర్‌లోని శ్వేతా హోటల్లో గురువారం సాయంత్రం మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ.. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తే తమకు సంబంధం లేదని, కానీ, రాష్ట్ర ఏర్పాటుపై అక్కసు వెల్లగక్కడం ఎందుకని ప్రశ్నించారు. పార్లమెంట్లో బిల్లులను ఆమోదించే సందర్భాల్లో తలుపులను మూసి ఉంచుతారని.. ఈ విషయం ప్రధానికి తెలియకపోవడం విడ్డూరమన్నారు. మోదీ తెలంగాణకు అనుకూలం అంటూ నే ఆక్రోశాన్ని వెళ్లగక్కడంలో అంతరార్థమెంటో అర్థంకావడం లేదన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఆంధ్రా నేతలు మాట్లాడినట్టుగానే ఇప్పుడు మోదీ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
బీజేపీ నాయకులు అసలు తెలంగాణకు అనుకూలమా? వ్యతిరేకమా? స్పష్టం చేయాలన్నారు. చర్చ జరిగిన తర్వాతే తెలంగాణ బిల్లు పాస్ అయిందన్నారు. బీజేపీ నుంచి సుష్మాస్వరాజ్, ఇతర పార్టీల నేతలు కూడా మాట్లాడారని గుర్తుచేశారు. దేశంలోని 28 పార్టీలు తెలంగాణకు మద్దతు ప్రకటించాయని చెప్పారు. 95 శాతం ఎంపీలు తెలంగాణకు అనుకూలంగా ఓటేశారని వెల్లడించారు. మోదీ తెలంగాణలోని ఏడు మండలాలను పార్లమెంట్లో చర్చించకుండానే ఆంధ్రాలో కలిపాడని ఆరోపించారు. తాను చర్చకు పట్టుబట్టినా ఒప్పుకోలేదని, మూడు నిమిషాల్లోనే బిల్లును పాస్ చేశారని గుర్తుచేశారు. ఇటీవల తీసుకువచ్చిన సాగు చట్టాలపై పార్లమెంట్లో ఎంతసేపు చర్చించారో చెప్పాలని నిలదీశారు. ‘మూడు నిమిషాల్లో బిల్లులను ఆమోదించుకున్న మీరు.. ఇవ్వాళ నీతులు చెప్పడం ఎంతవరకు భావ్యం’ అన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ పంట మార్పిడి చేయాలని పేర్కొంటే బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం మెడలు వంచి వరి వేయించేలా చేస్తామంటూ ప్రకటనలు చేశారన్నారు.
ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రసంగంలోనూ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పంట మార్పిడి జరగాల్సిందేనని చెప్పారని, మరి ఇప్పుడు సంజయ్ ఎవరి మెడలు వంచి తెలంగాణలో వరి వేయిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఏబీసీడీ తెలియకుండా మాట్లాడడం సరికాదన్నారు. ఎంపీగా హుందాగా నడుచుకోవాలని హితవు పలికారు. పద్ధతిలేకుండా మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేంద్రం ఓ తీరుగా.. రాష్ట్రంలో మరో తీరుగా వ్యవహరిస్తూ బీజేపీ ద్వంద్వ నీతి పాటిస్తుందని దుయ్యబట్టారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. జడ్పీ చైర్పర్సన్ విజయ, ఎమ్మెల్యే రవిశంకర్, మేయర్ సునీల్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు, గ్రంథాలయ చైర్మన్ రవీందర్‌రెడ్డి ఉన్నారు.