కరీంనగర్ , ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సింగరేణి ప్రైవేటీకరణ, బొగ్గు బ్లాకుల వేలం, ఆదాయపన్ను పరిమితిపై కార్మికలోకం భగ్గుమన్నది. సింగరేణికి దక్కాల్సిన కోల్ బ్లాక్‌లను కేంద్ర ప్రభుత్వం వేలం వేయాలనే నిర్ణయంపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. డిసెంబర్ మాసంలో వేలం ఆపాలని సీఎం కేసీఆర్ మోదీకి లేఖ రాయగా.. మూడు రోజులు కార్మికలోకం సమ్మె చేసి సంస్థను స్తంభింపజేసింది. టీబీజీకేఎస్‌తోపాటు జాతీయకార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్, సీఐటీయూ మూకుమ్మడిగా కలిసి వచ్చాయి. అప్పుడు బొగ్గు పెల్ల కూడా కదలకపోగా.. టెండర్లు వేయడానికి కూడా ఎవరూ సాహసించలేదు. తాజాగా సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఈ నెల మొదటి వారంలో నాలుగు రోజులు గనులు, ఓసీపీలు, డిపార్ట్మెంట్లపై నిరసనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలతో శవయాత్ర, మోదీ దిష్టిబొమ్మల దహనం, సంతకాల సేకరణ, బీజేపీ కుట్రలను బట్టబయలు చేసేలా కరపత్రాల పంపిణీ చేపట్టారు. సోమవారం ఐటీ, పురపాలక శాఖ మాత్యులు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశారు. కేంద్రంలోని బీజేపీ కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని హెచ్చరించారు.
సింగరేణి జోలికొస్తే మరో ఉద్యమమే..
సింగరేణి జోలికొస్తే ఊరుకునేది లేదని, తెలంగాణ రాష్ట్ర సాధన మాదిరిగా మరో ఉద్యమానికి సిద్ధమవుతామని కార్మికలోకం ముక్తకంఠంతో నినదించింది. ప్రైవేటీకరణ కుట్రలను ఛే దిస్తామని, కార్పొరేట్ కబంధహస్తాల్లోకి సంస్థను పెట్టి కార్మికు ల మనుగడకు ముప్పు వాటిల్లే విధంగా చేస్తే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు. బొగ్గు బ్లాకులు వేలం వేస్తే సంస్థ బడా కంపెనీల చేతిల్లోకి వెళ్తుందని, కార్మికుల హక్కులు హరిస్తాయని, ఉద్యోగాలకు భద్రత ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ సర్కారు కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మిక చట్టాల సవరణ బిల్లులు ఉపసంహరించుకోవాలని నినదించారు. నాలుగు బ్లా కులను సింగరేణి సంస్థకే అప్పగిస్తే కార్మికుల బిడ్డలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అపారంగా లభిస్తాయని పేర్కొన్నారు.
అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న సింగరేణి
‘తల్లి నువ్వు నవ్వితే మాగాణి.. ఎద తలుపుతీస్తే సింగరేణి’ అన్నాడు ఓ కవి! నిజంగానే సింగరేణి ఇప్పుడు నవ్వుతున్నది. సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్.. ఆ దిశ గానే సింగరేణి కార్మికులను కష్టాల నుంచి విముక్తి చేస్తున్నారు. నేనున్నానంటూ భరోసా కల్పించడమేకాదు, సింగరేణి కాలరీస్ కంపెనీగా ఆవిర్భవించిన 101 ఏండ్ల చరిత్రలో అపరిష్కృత అనేక సమస్యలు, కార్మికుల డిమాండ్లను నెరవేరుస్తూ కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. సమైక్య రాష్ట్రంలో నల్లసూర్యుల బతుకుల్లో చీకట్లు అలుముకోగా.. ప్రస్తుతం ప్రతి కార్మికుడి ఇంట చిరునవ్వులు కనిపిస్తున్నాయి.
ఇదీ నల్లనేల చరిత్ర..
గలగలాపారే గోదావరి పాదాల చెంతన 350 కిలోమీటర్ల పొడవునా విస్తరించిన సింగరేణికి గత డిసెంబర్ 23తో 101 ఏండ్లు నిండాయి. 1889లో ఇల్లెందు వద్ద బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించి.. 1920లో సింగరేణి కాలరీస్ కంపెనీగా పేరు మార్చుకుంది. 1945లో నిజాం ప్రభువు సింగరేణి షేర్లను కొనుగోలు చేయడంతో తొలి ప్రభుత్వ రంగ సంస్థగా మారింది. ఇప్పటికే సింగరేణిలో పరిధిలో 26 భూగర్భ, 20 ఉపరితల గనులున్నాయి. 45 వేలకుపైగా ఉద్యోగులు, సుమారు 30వేల మంది ఒప్పంద ఉద్యోగులు పని చేస్తున్నారు. 2020లో సాధించిన ఉత్పత్తి 64 మిలియన్ టన్నులు కాగా.. 2025 నాటికి వంద మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకెళ్తున్నది. సమైక్య రాష్ట్రంలో చీకట్లు అలుముకున్న సింగరేణి స్వరాష్ట్రంలో పరుగులు పెడుతున్నది. యజమాని, శ్రామిక సంబంధాలను మానవ సంబంధాలుగా మారుస్తూ సింగరేణి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. లాభాల వాటా, కారుణ్య నియామకాలు, దసరా అడ్వాన్స్, కార్మికుల సొంత గృహాల కోసం రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణం, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్య సదుపాయం ఇలా ఎన్నో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో అతిపెద్ద బొగ్గు పరిశ్రమ అయిన కోలిండియా కన్నా. మెరుగైన సంక్షేమ పథకాలు, అలవెన్స్‌లు, లాభాల్లో కార్మికులకు భాగస్వామ్యం కల్పిస్తున్న సంస్థ సింగరేణి మాత్రమే. గతేడాది అత్యధికంగా లాభాల్లో 28 శాతం వాటా చెల్లించింది. గడిచిన ఐదేండ్లలో రెట్టింపు ఉత్పత్తితోపాటు 127 శాతం లాభాలను పెంచుకోగలిగింది. సౌర, సాధారణ రెండు రకాల విద్యుత్ రంగంలోకి ఇప్పటికే అడుగు పెట్టడంతోపాటు ఒడిశాలో రెండు బొగ్గుకేత్రాల ద్వారా బొగ్గును వెలికితీస్తున్నది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ర్టాల్లో మరికొన్ని బొగ్గు క్షేత్రాలను సింగరేణికి కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. గడిచిన ఐదేండ్లలో దాదాపు 17వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. ఇవేకాదు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తూ.. సింగరేణి సామర్థ్యాన్ని నలుదిశలా చాటారు. ఇంతటి చరిత్ర, సామర్థ్యమున్న సింగరేణిపై కేంద్రం నిర్ణయంతో నీలినీడలు అలుముకుంటున్నాయి.
కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర..
ఇంతటి అభివృద్ధి పథంలో దూసుకెళ్తూ తన సామర్థ్యాన్ని సత్తాను చాటుతున్న సింగరేణిపై కేంద్రం విషం కక్కుతున్నట్లుగా కనిపిస్తున్నది. దేశంలో ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ కంపెనీలకు ధారదత్తం చేసినట్లుగా సింగరేణిని సైతం అదేబాటలో తీసుకెళ్లే వ్యూహాలకు పదును పెట్టింది. అందులో భాగంగానే సింగరేణికి చెందిన మందమర్రి ఏరియాలోని కల్యాణిఖని బ్లాక్-6, శ్రావణ్‌పల్లి బ్లాక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియాలోని కోయగూడెం బ్లాక్-3, ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏరియాలోని సత్తుపల్లి బ్లాక్-3ను వేలం వేయాలని నిర్ణయించింది. ఇదే జరిగితే సింగరేణి మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్న ఆందోళన కార్మిక సంఘాలు, కార్మికుల్లో వ్యక్తమవుతున్నది. కార్మికుల బతుకులకు భరోసా లేకుండా పోతున్నదని ఆవేదన కనిపిస్తున్నది. ప్రైవేటీకరణ జరిగితే.. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు రద్దవుతాయన్న ఆందోళన నెలకొంది. సింగరేణి సంస్థ బొగ్గు గనులు తవ్వుతూనే పర్యావరణ పరిరక్షణకు తీవ్రంగా కృషి చేస్తున్నది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు హరితహారం కార్యక్రమంలో భాగస్వామి అవుతున్న సింగరేణి సంస్థ, ప్రభావిత గ్రామాలు, గనుల ఆవరణ, ఓబీ కుప్పలు, కార్మికుల కాలనీల్లో వేలాది ఎకరాల్లో కోట్లాది మొక్కలు పెంచుతున్నది. గతంలో దుమ్మూధూళితో నిండి కనిపించిన కార్మిక క్షేత్రాలు.. ప్రస్తుతం పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఒకవేళ బొగ్గు బ్లాకుల వేలం జరిగితే సదరు సంస్థ ఈ స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఉష్ణోగ్రతలు పెరిగి నానా కష్టాలు తప్పవని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఒక వైపు సింగరేణికి వివిధ రాష్ర్టాల్లో కొత్త బ్లాక్‌లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంటే.. ఇక్కడ ఉన్నవే ప్రైవేటీకరణ చేయడం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే ఇతర రాష్ర్టాల్లో సింగరేణి తన సా మర్థ్యాన్ని విజయవంతంగా చాటుతున్నది. ఈ తరుణంలో సంస్థ పరిధిలో ఉన్న బ్లాక్‌లను వేలం వేసేందుకు కేంద్రం నిర్ణయించడం వెనుక పెద్ద కుట్ర ఉన్నదన్న విమర్శలు వస్తున్నాయి.