గంభీరావుపేట, ఫిబ్రవరి 7: మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యాలయాలను దాతల సహకారంతో కార్పొరేట్‌కు దీటుగా నిర్మించుకుంటున్నామని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఉద్ఘాటించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సముదాయంలో రహేజా కార్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3కోట్లతో చేపట్టనున్న నిర్మాణాలకు కలెక్టర్ అనురాగ్ జయంతి, ఫౌండేషన్ సీఈఓ గోనె శ్రావణ్‌తో కలసి భూమి పూజ చేసి మాట్లాడారు. స్వరాష్ట్రంలో సిరిసిల్ల ని యోజకవర్గంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తో వివిధ సంస్థలు, దాతల సహకారంతో పాఠశాలలో వసతులు పెంచుకుంటున్నామని చెప్పా రు. గతంలో గివ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యం లో పాఠశాలల ఆధునీకరణ, ఫర్నీచర్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. కాగా, మండల కేంద్రంలో ఒకే ప్రాంగణంలో కేజీ నుంచి పీజీ విద్య అందించాలన్న మంత్రి కేటీఆర్ ఆశయం మేరకు దాతల సహకారంతో అడుగులు వేస్తున్నామని, అందు లో భాగంగా మొదటగా రహేజా కార్ప్ ఫౌండేషన్, మైండ్ స్పేస్ సంస్థ ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో అదనపు తరగతి గదులు, గ్రంథాలయం, భోజన శాల, క్రీడా మైదానాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. మంత్రి కేటీఆర్ చొరవతో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా ప్రాంగణాన్ని ఏర్పా టు చేసుకోవడం సంతోషంగా ఉందని, ఇది విద్యార్థుల తల్లిదండ్రులకు వరమని చెప్పారు.
విద్యను మించిన సంపద లేదు
ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్‌కు దీటుగా సకల వసతులతో విద్యా బోధన అందించాలన్న సంకల్పంతో ప్రభు త్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రా రంభించిందని చెప్పారు. రహేజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధునిక హంగులతో వివిధ భవనాలతో పాటు క్రీడా మైదానం ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన సంస్థ సీఈఓ శ్రావణ్‌ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కేజీ నుంచి పీజీ విద్యలో భాగంగా మంత్రి కేటీఆర్ సూచన మేరకు తమ వంతుగా క్రీడా మైదానం, భోజనశాల, గ్రంథాలయ, తరగతి గదులను వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి తెస్తామని రహేజా సంస్థ సీఈఓ శ్రావణ్ పేర్కొన్నారు. ఇక్కడ ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, సర్పంచ్ కటకం శ్రీధర్, వైస్ ఎంపీపీ దోసల లత, డీఈఓ రాధాకిషన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, సీడీపీఓ అలేఖ్య, ఉపసర్పంచ్ నాగరాజు, వార్డు సభ్యులు రాజనర్సు, పిట్ల బాబు, ను సురత్, విద్యా కమిటీ చైర్మన్లు గౌసియా బేగం, గంద్యాడపు రాజు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు ఉన్నారు.