గంగాధర, నవంబర్ 19: చొప్పదండి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని బూరుగుపల్లిలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత జూలై, ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్, గంగాధర ఎల్లమ్మ చెరువు కట్టలు తెగిపోవడంతో ప్రస్తుతం రెండు చెరువులు ఎడారిని తలపిస్తున్నాయని చెప్పారు.
అధికారులు యుద్ధ ప్రాతిపదికన చెరువు కట్టల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. అవి పూర్తయితేనే యాసంగికి నీరందించే అవకాశం ఉంటుందన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ కింద ముంపు బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. ఎల్లంపల్లి 1, 3 పెండింగ్ పనులు, పోతారం రిజర్వాయర్ డీఎల్ఆర్, ఎస్ఎల్ఆర్ బ్రిడ్జిలు, డీ1,డీ2 కెనాల్స్‌ను పూర్తి చేయాలని సూచించారు.
రామడుగు మండలం మోతె ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన తూములు వరదలకు కొట్టుకుపోవడంతో వాటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మల్యాల మండలంలోని వరదకాలువకు భూములు ఎత్తులో ఉండడం వల్ల అవసరం ఉన్న లిప్టుల కోసం ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. ఎస్ఈ అశోక్ కుమార్, ఈఈ సుధాకిరణ్, డీఈలు శ్రీనివాస్ గుప్త, అబ్దుల్ అలీమ్ ఉన్నారు.