గంగాధర, నవంబర్ 19: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో సర్కారు బడుల్లో సమూల మార్పులు వచ్చాయని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యదర్శి వాకాటి కరుణ పేర్కొన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని కురిక్యాల ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. ముందుగా ఆమెకు స్థానిక సర్పంచ్ మేచినేని నవీన్‌రావు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించిన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు, జడ్పీ సీఈవో ప్రియాంక, ఎంపీడీవో భాస్కర్‌రావు, ఎంపీవో జనార్దన్‌రెడ్డి, ఎంఈవో శ్రీనివాస్, డీఈ లచ్చయ్య, ఏఈ రమేశ్, ప్రధానోపాధ్యాయులు పట్టు పురుషోత్తం, రాజిరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కమాన్‌చౌరస్తా, నవంబర్ 19 : జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఖ్యలో గణనీయంగా పెరిగిందన్నారు. డిగ్రీ విద్యలో ఎస్సారార్ కళాశాల రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ సంపాదకత్వంలో ప్రచురించిన ‘హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా’ పుస్తకాన్ని ఆమె అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో కే రామకృష్ణతో కలిసి ఆవిష్కరించారు. ఈ క్రమంలో అధ్యాపకులు కే సురేందర్ రెడ్డి, హిమబిందు, భిక్షపతి, సతీశ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.