కరీంనగర్ రూరల్, నవంబర్ 19: నాటి సమైక్య పాలనలో నేతన్నల పరిస్థితి దయనీయంగా ఉండేదని, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వారి జీవితాల్లో వెలుగులు నింపిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ మండలం చామనపల్లి గ్రామంలో పద్మశాలీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యంతో ఎంతో మంది నేతన్నలు కడుపు నిండా తిండిలేక ఆకలిచావుల బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో చామనపల్లి గ్రామానికి తాను తొలిసారి ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ఇక్కడి పరిస్థితి దయనీయంగా ఉండేదని గుర్తు చేశారు.
ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలనే సంకల్పంతో ముందుకు సాగానన్నారు. తెలంగాణ రాక ముందు, వచ్చాక పాలనలో వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని కోరారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి గొప్పగా సాగుతున్నదని గుర్తు చేశారు. పని చేసేవారి చేయిని బలోపేతం చేయాలని, తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. కొత్త కొత్త వేషాలతో వచ్చే వారు మరోసారి మన పండుగలు, మన సంస్కృతిపై విషం చిమ్ముతారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
లేకుంటే తెలంగాణ సంపదను రాజమండ్రి, పశ్చిమ గోదావరి, విజయవాడకు తరలిస్తారని, తెలంగాణను గుడ్డిదీపం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. నేడు తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరల తయారీతో నేతన్నలకు తోడ్పాటునందిస్తుంటే జీఎస్టీతో కేంద్ర ప్రభుత్వం మరోసారి వారిని దెబ్బకొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. చేనేత వస్ర్తాలపై జీఎస్టీని కేంద్రం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రిని పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, సర్పంచ్ బొగోండ లక్ష్మి, జడ్పీటీసీ పురుమల్ల లలిత, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మధు, రైతు బంధు సమితి కన్వీనర్ కాశెట్టి శ్రీనివాస్, కరీంనగర్ ప్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, మంద రాజమల్లు, జక్కం నర్సయ్య, నందయ్య, రుద్ర రాములు, గడ్డం శ్రీరాములు, తుల బాలయ్య, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు దూడం మల్లేశం, దాసరి ఆంజనేయులు, దావు రాజిరెడ్డి, గంట శంకరయ్య, కార్నాటి చెల్మయ్య, అరెల్లి శ్రీనివాస్ భూర్ల లక్ష్మీరాజం, దూడం లక్ష్మీరాజం, మెతుకు సత్యం, వలుస భద్రయ్య పాల్గొన్నారు.