ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. దిష్టిబొమ్మలకు శవయాత్ర చేసి కూడళ్లలో దహనం చేశాయి. ప్రజాసేవకు అంకితమైన కవితను దూషిస్తే సహించేది లేదంటూ హెచ్చరించాయి. రాష్ట్ర సాధనలో కీలకభూమిక పోషించిన ఆమెపై అభాండాలు వేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశాయి. బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశాయి.
కార్పొరేషన్(కరీంనగర్)/సారంగాపూర్/ రాయికల్/మల్లాపూర్/ జమ్మికుంట/ హుజూరాబాద్‌టౌన్, నవంబర్19: ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బీజేపీ ఎంపీ అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా శనివారం రెండోరోజూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగిత్యాల జిల్లా బీర్పూర్లో టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సంస్కార హీనంగా మాట్లాడితే నాలుక చీరెస్తామని హెచ్చరించారు.
రాయికల్ పట్టణంలో టీఆర్ఎస్ నాయకులు అర్వింద్ దిష్టిబొమ్మతో నిరసన ర్యాలీ తీశారు. గాంధీ విగ్రహం వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. స్వరాష్ట్ర పోరాటంలో అగ్రభాగాన నిలిచిన కవితపై నిరాధారణ ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మల్లాపూర్ మండలం కుస్తాపూర్‌లో తెలంగాణ జాగృతి యూత్ విభాగం ఆధ్వర్యంలో అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని తెలంగాణ ఉద్యమంలో ముఖ్యపాత్ర వహించిన కవితను విమర్శించే హక్కు బీజేపీ నేతలకు లేదన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ మహిళా నేతలు అర్వింద్ దిష్టిబొమ్మకు తొడిగి దహనం చేశారు.
ఆడబిడ్డను అవమానించేలా మాట్లాడిన అర్వింద్‌కు తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. జమ్మికుంటలో టీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. స్థానిక గాంధీచౌరస్తా వద్ద అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన ఆడబిడ్డను ఉద్దేశించి అడ్డదిడ్డంగా మాట్లాడితే తగిన బుద్ధిచెబుతామని హెచ్చరించారు.
దొడ్డిదారిన ఎంపీగా గెలిచిన అర్వింద్ రెచ్చగొట్టే మాటలతో పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ పట్టణ నాయకులు నిరసన ర్యాలీ తీశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజా సమస్యల కోసం పార్లమెంట్లో గళమెత్తిన కవితను విమర్శిస్తే సహించేదిలేదంటూ హెచ్చరించారు.