జగిత్యాల, నవంబర్ 19: బిడ్డను అమ్ముకునే సంస్కృతి ఎంపీ అర్వింద్ కుటుంబానిదేనని జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత ధ్వజమెత్తారు. సంస్కార హీనంగా మాట్లాడితే సహించేది లేదని, ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని లేదంటే మహిళలందరూ చెప్పుతో కొడతారని హెచ్చరించారు. శనివారం ఆమె జగిత్యాల జడ్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. యాక్సిడెంటల్ ఎంపీ అర్వింద్, ఉద్యమ నేపథ్యమున్న కవితపై అసభ్యకరంగా మాట్లాడడాన్ని చూసి సభ్య సమాజం తలదించుకుంటుందన్నారు. అర్వింద్ తండ్రి డీ శ్రీనివాస్ కాంగ్రెస్లో నుంచి టీఆర్ఎస్లో చేరిన తర్వాత ఓ కొడుకుని బీజేపీకి, ఇంకో కొడుకుని కాంగ్రెస్ పార్టీకి అమ్ముకున్నాడని తీవ్రస్థాయిలో విమర్శించారు.
సంస్కార హీనుడైన అర్వింద్, తెలంగాణ కోసం అమెరికాలో ఉన్నత ఉద్యోగాలను వదిలివచ్చిన కవితపై ఇష్టానుసారంగా మాట్లాడడం బాధాకరమన్నారు. ఉద్యమంలో ఆయన పాత్ర ఏంటని ప్రశ్నించారు. ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని నిలదీశారు. మతం పేరుతో విధ్వంసాలు సృష్టించడమే బీజేపీ సిద్ధాంతమని దుయ్యబట్టారు. స్త్రీలను అవమానించడమే ఆ పార్టీ విధానమని నిప్పులు చెరిగారు. మున్నూరు కాపుల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా అర్వింద్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇకనైనా అడ్డదిడ్డంగా మాట్లాడడం మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు చెప్పారు. ఇక్కడ జడ్పీటీసీలు అశ్వినీజాదవ్, అరుణ తదితరులున్నారు.