వెల్గటూర్, నవంబర్ 16 : బీజేపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ యువకుల్లో గందరగోళాన్ని సృష్టిస్తూ తప్పు దోవ పట్టిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత యువకులపై ఉందని పిలుపునిచ్చారు. వెల్గటూర్ మండలంలోని ముక్కట్రావుపేటకు చెందిన కొప్పుల అనువిక్షయ్ ఆధ్వర్యంలో 350 మంది యువకులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. రాజారాంపల్లి ఎస్ఆర్ గార్డెన్లో బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి యువకులు పాషిగామా నుంచి బైక్‌లపై ర్యాలీగా వచ్చి మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీలో చేరారు.
ముందుగా పార్టీ జెండావిష్కరణ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తుండడంతో పుష్కలంగా పంట పండుతున్నదన్నారు. మొన్నటి వరకు దేశంలో ముందు వరుసలో ఉన్న హర్యానాను వెనక్కి నెట్టి దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. కేటీఆర్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి అయ్యాక రాష్ర్టానికి 14 లక్షల కోట్ల పెట్టుబడి సాధించి లక్షల ఉద్యోగాలు కల్పించారన్నారు.
ఇప్పటి వరకు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. వీటన్నింటిని యువత గుర్తించాలని కోరారు. ఎనిమిదేండ్ల కాలంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, పెద్ద నోట్లను రద్దు చేసి నల్లదనాన్ని దేశానికి తీసుకువచ్చి పేదల ఖాతాల్లో 15 లక్షలు జమ చేస్తామని చెప్పి ఏ ఒక్కటన్న చేసిండ్రా అని మండిపడ్డారు. వీటన్నింటినీ యువకులు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కునమల్ల లక్ష్మి, జడ్పీటీసీ సుధారాణి, ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేశ్, పార్టీ మండలాధ్యక్షుడు సింహాచలం జగన్, ఉపాధ్యక్షుడు గుండా జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి జుపాక కుమార్, ప్యాక్స్ చైర్మన్ గూడ రాంరెడ్డి, యువత అధ్యక్షుడు బిడారి తిరుపతి, బీసీ సెల అద్యక్షుడు కుమ్మరి వెంకటేశ్, మహిళ అధ్యక్షురాలు సింధూజరెడ్డి, రైతు అధ్యక్షుడు మారం జగన్మోహన్రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏలేటి కృష్ణారెడ్డి, ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.
బీజేపీ కుట్ర బయటపడింది
ధర్మారం, నవంబర్ 16: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎరవేసి కొనుగోలుకు ప్రయత్నించిన వ్యవహారంలో బీజేపీ కుట్ర బుద్ధి బయట పడిందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఆ వ్యవహారంలో ఓ స్వామీజీకి విమానం టికెట్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమకూర్చడని నిర్ధారణ అయిందని, దీనిపై బండి ఏం సమాధానం చెప్పాలని నిలదీశారు. ధర్మారంలో మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్సీ కవితను పార్టీలో చేరాలని తాము ప్రలోభ పెట్టలేదని ఆ పార్టీ నేత డీకే అరుణ వ్యాఖ్యలను మంత్రి ఈశ్వర్ ఖండించారు. ఆ పార్టీ నాయకుల మాటలన్నీ అబద్ధాలేనని, వారిని ప్రజలు నమ్మే ప్రసక్తే లేదని ధ్వజమెత్తారు. స్వామీజీలు ఫాం హౌస్‌లో మాట్లాడిన ఆడియో టేపులు బహిర్గతమయ్యాయని, స్వామీజీలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే కుట్ర, అసలు రంగు బయటపడిందని నిప్పులు చెరిగారు. ఓ స్వామీజీకి బండి సంజయ్ అనుచరుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేశారనే విషయం ఆధారాలతో సిట్ విచారణలో బయటపడిందన్నారు. దీంతో ఆ పార్టీలో అలజడి మొదలైందన్నారు.
ఈ వ్యవహారంలో తమ పార్టీకి ఏం సంబంధం లేదని హడావిడి చేసి ఆగమేఘాల మీద యాదాద్రికి వెళ్లి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో తడి బట్టలతో స్నానం చేసిన ఆయన ఇప్పుడేం సమాధానం చెప్తారని తూర్పారపట్టారు. బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలమంతా సమష్టిగా పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సీఎం నిరుద్యోగ నిర్మూలనకు ఎంతో కృషి చేస్తున్నారని, ఈ క్రమంలోనే 91వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చారని వెల్లడించారు.
ఉపాధి కల్పనకు ప్రభుత్వం చూపుతున్న చొరవతో యువత టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని, వెల్గటూరు మండలం రాజారాంపల్లిలో పెద్ద సంఖ్యలో పార్టీలో చేరడమే ఇందుకు ఉదాహరణ అని మంత్రి ఈశ్వర్ స్పష్టం చేశారు. ఆయన వెంట స్థానిక జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యులు పూస్కూరు రామారావు, ఎగ్గెల స్వామి, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, ఉప సర్పంచ్ ఆవుల లత, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ నార బ్రహ్మయ్య, మాజీ సర్పంచ్ నార నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.