వేములవాడ, నవంబర్ 16: వేములవాడ పట్టణంతో పాటు రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఆదేశించారు. బుధవారం రాజన్న ఆలయ సమావేశ మందిరంలో వీటీడీఏ పరిధిలోని మున్సిపల్, రాజన్న ఆలయ, ఇరిగేషన్, రెవెన్యూ, రోడ్లు భవనాల, మిషన్ భగీరథ ఆలయ అధికారుల సమావేశాన్ని కలెక్టర్ అనురాగ్‌జయంతి, వీటీడీఏ వైస్ చైర్మన్ ముద్దసాని పురుషోత్తంరెడ్డితో కలిసి నిర్వహించారు.
ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. గుడి చెరువు బండ్‌ను త్వరగా పూర్తి చేసి సుందరీకరించాలని, రూ.20కోట్లతో మిగిలిన భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. బండ్ వద్ద చేపట్టిన 800 మీటర్ల రిటైనింగ్‌వాల్ దాదాపుగా పూర్తయిందని, ఘాట్లను ఏర్పాటు చేయాలన్నారు. మూలవాగు వంతెన నుంచి ఆలయం మీదుగా పోలీస్ స్టేషన్ దాకా రోడ్డు విస్తరణ పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని సూచించారు. మంత్రి కేటీఆర్ అనుమతులు ఇచ్చిన అభివృద్ధి పనులను కూడా వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
వేములవాడ పట్టణానికి ఈశాన్య ప్రాంతంలో ఆధునాతన సౌకర్యాలతో బస్టాండ్ నిర్మించాలని సీఎం కేసీఆర్ సూచించిన దృష్ట్యా గుడి చెరువు సమీపంలో 20 ఎకరాల భూమిని సేకరించి సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించాలన్నారు. శివరాత్రి వరకు వేచి చూడకుండా మధ్యమానేరు నుంచి గుడిచెరువులోకి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను పూర్తిస్థాయిలో నింపాలని సూచించారు. బద్దిపోచమ్మ ఆలయం వద్ద ఎకరా స్థలంలో నిర్మాణాలను తొలగించినందున అక్కడ భక్తుల అవసరాల దృష్ట్యా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తామని, త్వరలోనే శాశ్వత నిర్మాణాలు చేపడుతామని చెప్పారు.
పెద్ద బోనాల మండపం నిర్మిస్తామని చెప్పారు. కొండగట్టు జంక్షన్ వద్ద అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. నంది కమాన్ జంక్షన్ అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి నెలాఖరులోగా పూర్తిచేయాలన్నారు. రూ.5కోట్లతో స్టేడియం, మరో రూ.5కోట్లతో చేపట్టనున్న కళాభవన్ పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలన్నారు. వేములవాడ పట్టణం నుంచి వేములవాడ కోరుట్ల బస్టాండ్ జంక్షన్ వరకు, వేములవాడ వట్టెంల వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. ఆలయంతోపాటు దేవాలయ అనుబంధ అన్ని భవనాలకు సురక్షిత తాగునీరు అందించేలా సంపు, ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని సూచించారు. సాంస్కృతిక పాఠశాలకు సంబంధించి సంస్కృ తం, వేదానికి సంబంధించిన రెండు బ్లాకుల నిర్మాణాలను త్వరగా చేపట్టాలని అధికారులను కోరారు. వచ్చే ఏడాది అక్టోబర్‌లోగా పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినందున ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి : వైస్ చైర్మన్
వేములవాడ ఆలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలో ప్రగతిలో ఉన్న, పెండింగ్ పనులను ఎమ్మెల్యే, కలెక్టర్ సహకారంతో సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని వీటీడీఏ వైస్ చైర్మన్ ముద్దసాని పురుషోత్తంరెడ్డి సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కలెక్టర్ అనురాగ్‌జయంతి మాట్లాడుతూ గుడిచెరువు వద్ద భూసేకరణకు సంబంధం లేని పెండింగ్ పనులను పూర్తిచేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మిషన్‌భగీరథ ద్వారా చేపడుతున్న పనులకు ఇసుక కొరత ఉందని ఆ శాఖ అధికారులు చెప్పడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ అధికారులతో మాట్లాడి అవసరమైన ఇసుకను సమకూర్చుకోవాలని ఆదేశించారు.
మూలవాగు వంతెన నుంచి ఆలయం దాకా రోడ్డు విస్తరణకు రోడ్లు భవనాలు, మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి విస్తరణలో తొలగించాల్సిన ఇండ్లు చెల్లించాల్సిన పరిహారంపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, ఆర్డీవో పవన్‌కుమార్, రాజన్న ఆలయ ఈవో కృష్ణప్రసాద్, వీటీడీఏ కార్యదర్శి భుజంగరావు, సీపీవో చంద్రిక, చీఫ్ అకౌంట్స్ అధికారి పర్వతాలు, ఈఈ శ్యామ్సుదర్శన్, రోడ్లు భవనాలశాఖ ఈఈ కిషన్‌రావు, ఇరిగేషన్ ఈఈ అమరేందర్‌రెడ్డి, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ విజయ్‌కుమార్, జిల్లా పట్టణ ప్రణాళిక అధికారి అన్సారీ, కమిషనర్ అన్వేశ్, రోడ్డు భవనాల శాఖ డీఈ శాంతయ్య, ఇరిగేషన్ డీఈ ప్రశాంత్‌కుమార్, ఏఈవోలు సంకెపల్లి హరికిషన్, ప్రతాప నవీన్, బ్రహ్మన్నగారి శ్రీనివాస్, జయకుమారి, డీఈ రఘునందన్, ఎస్టేట్ అధికారి గంప సత్యనారాయణ, టీపీఎస్ శ్రీధర్ తదితరులు ఉన్నారు.