ప్రాణాంతకమైన క్యాన్సర్, పెరలాసిస్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో కదల్లేని స్థితిలో ఏండ్లకేండ్లు మంచానపడ్డవారి బాధ చెప్పలేనిది. చికిత్స పొందినా నయంకాక జీవచ్చవాల్లా మారిన వారిని చూస్తూ.. సపర్యలు చేస్తూ తల్లడిల్లిపోయే కుటుంబసభ్యుల మనోవేదన అంతులేనిది. ఇలాంటి పరిస్థితుల్లో వేములవాడ ఏరియా దవాఖానలో రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేసిన పాలియేటివ్ కేర్ సెంటర్ బాధితులకు భరోసానిస్తున్నది. క్యాన్సర్, పక్షవాతం, కిడ్నీ, మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి సేవలందిస్తూ.. మామూలు మనుషులను చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటి వరకు 92 మందికి నేరుగా వైద్యం చేయగా, ‘ఆలన’ పేరిట మరో 700 మందికి ఇంటి వద్దే చికిత్స అందించింది. బాధితులకు సేవలందించడమే కాదు, కుటుంబసభ్యులకు మనో ధైర్యం కల్పిస్తున్నది.
– వేములవాడ, నవంబర్ 16
దీర్ఘకాలిక వ్యాధులతో కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమైన వారి కోసం రాష్ట్ర సర్కారు పాలియేటివ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది. 2022 మార్చిలో వేములవాడ ఏరియా దవాఖానలో ఈ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్‌బాబు ప్రారంభించారు. క్యాన్సర్, పక్షవాతం, కిడ్నీ సంబంధిత వ్యాధులతో మంచానికే పరిమితమైన వారితోపాటు మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడే 10 ఏండ్లలోపు చిన్నారులకు సేవలందిస్తున్నారు. అందులో మూడు రకాల సేవలందిస్తున్నారు. ఇన్‌పేషెంట్, ఓపీ, ఇంటి వద్ద కూడా వైద్య సదుపాయాన్ని కల్పిస్తున్నారు. వచ్చిన వారిలో కొందరు చాలా మంది కోలుకుంటున్నారు.
వేములవాడ, నవంబర్ 16 : వేములవాడ పాలియేట్ కేర్ సెంటర్లో పూర్తి ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నారు. క్యాన్సర్, పేషెంట్లకు వేర్వేరుగా వార్డులు ఏర్పాటు చేశారు. ఒక్కో వార్డులో నాలుగు బెడ్లను అందుబాటులో ఉంచారు. ఒక వైద్యుడు, ఫిజయోథెరపిస్ట్, ముగ్గురు స్టాప్‌నర్సులు కూడా ఇందులో విధులు నిర్వహిస్తున్నారు. చివరిదశలో ఉన్నవారికి వైద్యసేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. అవసరమైన వారికి మందులు కూడా ఇస్తున్నారు. క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు అత్యంత ఖరీదైన మందులను అందిస్తున్నారు. రోగితోపాటు సహాయకుడిగా ఉండే వారికి ఆహారాన్ని కూడా ఉచితంగానే ఇస్తున్నారు. ఇప్పటిదాకా ఆలన కేంద్రంలో 52మంది క్యాన్సర్ బాధితులు, 25 మంది పక్షవాతం, ఇతరత్రా సేవలు 15మందితో కలిపి మొత్తం 92మందికి వైద్యసేవలు అందించారు.
ఆలన పేరిట ఇంటి వద్దే సేవలు
పాలియేటివ్ కేంద్రానికి తీసుకురాలేని పేషెంట్లకు ‘ఆలన’ పేరిట ఇంటి వద్దే సేవలందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా వాహనాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. వారంలో నాలుగు రోజుల పాటు గ్రామాల్లోని రోగుల ఇండ్ల వద్దకు వెళ్లి అవసరమైన ఫిజియోథెరపీ, వైద్యసేవలు, మందులు అందజేస్తున్నారు. అందుకు స్థానికంగా ఉండే ఆశ, ఏఎన్ఎం సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. పేషెంట్లకు అందించాల్సిన మందులు, ఇతరత్రా సేవలపై కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అలాగే మనోధైర్యం కూడా పెంచుతున్నారు. ఇప్పటి వరకు 700 మంది రోగులకు ఇంటి వద్ద సేవలందించారు.
బాధితులకు భరోసా..
పాలియేటివ్ కేర్ సెంటర్లో ప్రత్యేకమైన గ్రీనరీతో చిన్నపాటి పార్కు ఏర్పాటు చేశారు. కేంద్రానికి ఆనుకొని ఉన్న బాల్కనీలో చుట్టూ మొక్కలను నాటి, కూర్చోవడానికి వీలుగా తగిన సదుపాయం కల్పించారు. చివరి దశలో ఉన్నవారికి సేవలను పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. పౌష్టికాహారం, మందులు కూడా ఇస్తున్నారు. మరోవైపు కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పిస్తున్నారు. ఇలాంటి సేవలతో కొందరు కోలుకుంటుండగా, బాధితులు భరోసా వ్యక్తం చేస్తున్నారు.
చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన గండిపేట బక్కయ్య, లక్ష్మి దంపతులది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడదు. బండకొడితేనే బతుకు. నాలుగు నెలల క్రితం లక్ష్మికి డొక్కలో నొప్పి రావడంతో వేములవాడలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లారు. తర్వాత కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు వెళ్తే.. వైద్యులు ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించి హైదరాబాద్‌కు పంపారు. దాంతో దాదాపు ఆమె 45రోజులపాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స కూడా పొందింది. ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స, ఇతర ఖర్చులకు దాదాపు నాలుగు లక్షల రూపాయలు కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. వేములవాడ ఏరియా దవాఖానలోని పాలిటివ్ కేర్ సెంటర్లో ఉచిత సేవలందిస్తున్నారని తెలిసి వారం క్రితం లక్ష్మిని చేర్పించారు. విలువైన మందులు, వైద్య సేవలను పూర్తి ఉచితంగా భర్త బక్కయ్య తెలిపాడు. వైద్యులు బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారని, సేవలు బాగున్నాయని చెప్పాడు.
మంచిగయిండు..
రెండేళ్ల కిందట మా సోదరుడు శంకర్ అకస్మాత్తుగా బీపీ పెరిగి కింద పడ్డడు. కాలు, చేయి, నోరు పడిపోయింది. అనేక దవాఖాన్లు తిరిగినం. కర్నూలు దాకా వెళ్లి వచ్చినం. మూడు నెలలుగా వేములవాడ దవాఖానలో సేవలు పొందుతున్నం. ఇప్పుడు మంచిగయిండు. నడుస్తూ భోజనం కూడా చేస్తుండు.
– విజయ, రోగి శంకర్ సోదరి (సిరిసిల్ల)
సేవలు మంచిగున్నయి
మూడు నెలల కింద నా భర్త కడారి మల్లేశం కరీంనగర్లో పెయింటర్ పనిచేస్తూ బీపీ పెరిగి కిందపడ్డడు. ప్రైవేటు దవాఖానలో చేరిన తర్వాత ఇక్కడ మంచిగ జూస్కుంటరని తెలిసి వేములవాడకు వచ్చినం. సేవలు మంచిగున్నయి. నా భర్త మల్లేశం ఇప్పుడు మంచిగయిండు.
– రమాదేవి, గుమ్లాపూర్ (కరీంనగర్ జిల్లా)
భరోసానిస్తున్నాం
ఆలనా కేంద్రం ద్వారా అంతిమదశలో ఉన్నవారికి బాధితులకు భరోసానిస్తున్నాం. ఇన్‌పేషెంట్, ఓపీ, ఇంటి వద్ద కూడా వైద్యసేవలు అందిస్తున్నాం. దవాఖానలో ఇప్పటివరకు 92మందికి వైద్యసేవలు అందించాం. ఇంటి వద్ద దాదాపు జిల్లాలో 700 మందికి వైద్యసేవలు అందిస్తున్నాం.
-డాక్టర్ మీనాక్షి, ఆలనా కేంద్రం ఇన్చార్జి (రాజన్న సిరిసిల్ల జిల్లా)
క్యాన్సర్ బాధితుకు ఔషధాలు
క్యాన్సర్‌తో బాధపడే రోగులకు తీవ్రమైన నొప్పులు ఉంటాయి. వారికి కావాల్సిన ప్రత్యేకమైన ఔషధాలు ఇక్కడే అందుబాటులో ఉన్నాయి. వైద్యుల పర్యవేక్షణలో వాటిని ఇస్తున్నాం. అంతిమ దశలో ఉన్నవారికి మంచి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.
– డాక్టర్ రేగులపాటి మహేశ్ రావు, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ (వేములవాడ)