మెట్పల్లి, నవంబర్ 14: ‘పసుపు పంటకు చీడపీడలు ఆశించి తెగుళ్లు వ్యాపిస్తుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. అసలే ఈ యేడాది వాన కాలంలో ఎడతెరపి లేకుండా కురిసిన వానలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పసుపు పంటపై తీవ్ర ప్రభావం కనిపిస్తున్నది. దీనికి తోడు వివిధ రకాల చీడపీడలు (తెగుళ్లు) ఆశిస్తుండడంతో పంట దిగుబడి తగ్గే ప్రమాదమున్నది. విస్తారంగా కురిసిన వానలతో ప్రధానంగా నల్లరేగడి భూముల్లో సాగవుతున్న పంట ఎదుగుదలపై ప్రభావం చూపింది. మరో వైపు ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పసుపులో దుంప వేరుకుళ్లు, మర్రి ఆకు తెగులు, ఆకుమచ్చ వంటి తెగుళ్లతో పంటకు తీవ్ర నష్టం జరుగుతుంది.’ అని ఉద్యాన శాఖ జగిత్యాల జిల్లా అధికారి ప్రతాప్సింగ్ చెబుతున్నారు. పసుపునకు ఆశించే వివిధ రకాల తెగుళ్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు.
ప్రతి వానకాలం ప్రారంభంలో పసుపునకు తోడు మక్క పంటను అంతర పంటగా వేస్తారు. ఈ యేడాది వానకాలంలోనూ సాగు చేశారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో 14,686.22 ఎకరాల్లో పసుపు సాగువుతున్నది. ఉద్యాన వన శాఖ రూపొందించిన వివరాల ప్రకారం.. గతేడాదితో పోలిస్తే ఈ సారి సాగు విస్తీర్ణం దాదాపు 7 వేల ఎకరాలకు పైగా తగ్గింది. కాగా, అంతర పంటగా వేసిన మక్క దిగుబడితో పసుపు పంటపై ఎండవేడిమి లేదా వాతావరణ పరిస్థితుల ప్రభావం నేరుగా పడుతుంది. ఫలితంగా తెగుళ్లు పసుపు పంటను ఆశిస్తాయి. ప్రాథమిక దశలోనే సాగు రైతులు తెగుళ్లను గుర్తించి అందుకు అనుగుణంగా నివారణ చర్యలు చేపడితే పంటను సంరక్షించుకునే అవకాశముంటుంది. చీడపీడల బారిన పడకుండా పంటను సంరక్షించుకోవడం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది.
తాటాకు మచ్చతెగులు
దీనినే మర్రిఆకు తెగులు అని కూడా పిలుస్తారు. సెప్టెంబర్, అక్టోబర్ మొదటి వారం నుంచి ఈ తెగులు ప్రభావం కనిపిస్తుంది. ఈ తెగులు విత్తనం, గాలి, వాన, పంట అవశేషాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈదురు గాలులతో కూడిన వానలు, గాలిలో ఎక్కువ తేమ, తక్కువ ఉష్ణోగ్రత ఉండడం, తెగులు సోకిన పంట నుంచి విత్తనం వాడడం, విత్తన శుద్ధి చేయకపోవడంతో ఈ తెగులు ఆశిస్తుంది.
లక్షణాలు: ఆకులపై అండాకారపు పెద్ద పెద్ద మచ్చలు అక్కడక్కడ ఏర్పడుతాయి. మచ్చలు ముదురు గోధుమ రంగులో ఉండి మచ్చ చుట్టూ పసుపు రంగ వలయం ఏర్పడుతుంది. తర్వాత ఈ మచ్చలు క్రమేపీ పెద్దవై కలిసిపోయి ఆకు మొత్తం వ్యాపించి ఎండిపోతాయి. ఆకు కాడపై మచ్చలు ఏర్పడి ఆకు కిందకి వాలుతుంది. తెగులు తీవ్రమైతే మొక్కల ఎదుగుదల, పంట దిగుబడితో పాటు నాణ్యత తగ్గుతుంది.
నివారణ చర్యలు : తెగులు సోకని పంట నుంచి విత్తనాన్ని ఎంచుకోవాలి. విత్తన శుద్ధి చేయాలి. తెగులుతో మచ్చలు, ఎండిన ఆకులను తొలగించి కాలబెట్టాలి. పంటపై లీటరు నీటికి గ్రా.కార్భండైజిమ్ లేదా గ్రాము దయోఫానెట్మిథైల్ లేదా 2 గ్రాముల కార్భండాజిమ్ ప్లస్ మాంకోజెట్ కలిపి ఉన్న మందు లేదా 2.5 గ్రాముల మాంకోజెట్, 0.5 మి.లీ. సబ్బునీరు కలిపి 15 రోజుల వ్యవధిలో 3-4 సార్లు పిచికారీ చేయాలి.
పొటాష్ లోపం
ఆకు కొసలు (చివరి భాగం) ముడుచుకోవడం ఆ తర్వాత తెల్లగా మారి ఎండిపోతాయి.
నివారణ: 5 గ్రాములు పెర్టిమాక్స్ లేదా పెర్టిసోల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి
నత్రజని లోపం
ముందుగా వచ్చినటువంటి ఆకులు పసుపు పచ్చగా మారి లేదా పాలిపోయి, ఎండిపోయి రాలిపోతాయి. ఎండిపోవడం ఆకు చివర మొదలై మధ్యలోకి వ్యాపిస్తుంది.
నివారణ : లీటర్ నీటికి 5 గ్రాముల మాక్రోపెర్ట్ 20.20.20 కలిపి పిచికారి చేయాలి. డ్రిప్ ద్వారా ఎకరానికి 5 కేజీల ప్లాన్టెక్స్ 20.20.20 వాడాలి.
జింకు లోపం
ఆకుల ఈనేల మధ్యలో పసుపు పచ్చ వర్ణంలో లేదా తెలుపు రంగులో మచ్చలు ఏర్పడుతాయి. ఆకులు సన్నగా మారి త్వరగా రాలిపోయి ఎదుగుదల నిలిచిపోతుంది.
నివారణ : 2 గ్రాముల చెలమిన్ ప్లస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. డ్రిప్ ద్వారా ఎకరానికి 0.5 కేజీల చెలమిన్ గోల్డ్ వాడాలి.
దుంప వేరుకుళ్లు తెగులు
దుంప వేరుకుళ్ల తెగులును కొమ్మకుళ్లు, అడుగు రోగం అని కూడా పిలుస్తారు. ఈ తెగులు సోకితే నష్టం ఎక్కువగా సంభవిస్తుంది. దిగుబడి కనీసం 50 నుంచి 60 శాతం తగ్గుతుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విత్తన శుద్ధి చేయకపోవడం, విత్తిన పసుపును లోతుగా నాటడం, మురుగు నీరు పోయే సౌకర్యం ఏర్పాటు చేసుకోకపోవడం, ఎడతెరపిలేని వానలతో మొక్కల చుట్టూ నీరు నిలిచి ఉండడం, పొటాష్, వేప పిండి ఎరువులను సక్రమంగా వాడకపోవడం లాంటి కారణాలతో ఈ తెగులు వస్తుంది.
లక్షణాలు: పంటలో అక్కడక్కడా మొక్కలు ఎదగడం లేదా ఆకులు పసుపు రంగుగా మారి వాడిపోయినట్లు ఉంటాయి. మొక్కల్లో మొదటగా ముదురు ఆకులు వాడిపోయి గోదుమ రంగుగా మారి ఎండిపోతాయి తర్వాత మొక్కపై భాగాన ఉన్న లేత ఆకులకు ఈ తెగులు వ్యాపిస్తుంది. పొలంలో తెగులు సుడులు, సుడులుగా కనిపిస్తుంది. మొక్క కాండపై నీటిలో తడిసిన మాదిరిగా మచ్చలు ఏర్పడతాయి. మచ్చలు తర్వాత గోధుమ రంగుగా మారుతాయి. వేర్లు నల్లబడి కుళ్లిపోతాయి. తెగులు సోకిన మొక్కకు వేర్లు, కొమ్మ లు మళ్లీ పుట్టవు. దుంపలు, కొమ్మలు కుళ్లి మెత్తబడిపోతా యి. వాటి నుంచి చెడువాసన వస్తుంది. లోపల పసుపు రంగుకు బదులు మట్టి రంగు ఉంటుంది. ఈ తెగులు తల్లి దుంపల నుంచి పిల్ల దుంపలకు వ్యాపిస్తుంది. పసుపు దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. తెగులు సోకిన మొక్కలను పీకితే కొమ్మలతో పాటు తేలికగా వస్తాయి.
నివారణ చర్యలు : తెగులును తట్టుకునే రకాల (సుగుణ, సుదర్శన, ప్రతిభ)ను సాగు చేసుకోవడం మంచిది. చీడపీడలు, తెగులు సోకని పంట నుంచి విత్తనాన్ని సేకరించి వినియోగించుకోవాలి. విత్తనం వేసే ముందు లీటరు నీటికి 3 గ్రా.మెటలాక్సిల్ ప్లస్ 2.మి.లీ.మోనోక్రోటోఫాస్ లేదా 3 గ్రా.మాంకోజెట్ ప్లస్ 2 మి.లీ. మోనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో పసుపు కొమ్ములను కనీసం 30 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత నీటిని మార్చి లీటరు నీటికి 10 గ్రా.ట్రైకోడర్మా విరిడి కలిపి ఆ ద్రావణంలో 30 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత బయటకు తీసి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఇలా విత్తన శుద్ధి చేసుకోవడం మంచిది. పసుపు విత్తిన తర్వాత నేలపై పచ్చి ఆకులతో లేదా ఎండు ఆకులతో మల్చింగ్ చేస్తే తెగులు ఉధృతిని కొంత వరకు తగ్గివచ్చు. వానలు కురిసినప్పుడు పంటలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పంటపై తెగులు లక్షణాలు కన్పించిన వెంటనే లీటర్ నీటికి 1 గ్రా.మెటలాక్సిల్ ప్లస్ మాంకోజెట్ లేదా 2 గ్రా. కాప్టాస్ లేదా 3 గ్రా.కాపర్ ఆక్సిక్లోరైడ్ను కలిపి తెగులు సోకిన మొక్కలు, వాటి చుట్ట్టూ ఉన్న మొక్కల మొదళ్లను తడిచేలా పోయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎకరానికి 10 కిలోల ఫారెట్10 జి గుళికలు, 1 కిలో సైమాక్సోనిల్ ప్లస్ మాంకోజెట్ పొడి, తగినంత యూరియా(10 నుంచి 20 కిలోలు) కలుపుకొని పంట అంతటా చల్లాలి.