ముకరంపుర, నవంబర్ 11: ‘ఢిల్లీ గద్దలు మళ్లీ వాలుతున్నయి. బొగ్గు, కరెంటు, కాళేశ్వరం జలాలు ఎత్తుకుపోదామని చూస్తున్నయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ రాష్ట్ర పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆయన సీఎంగా లేకపోతే ఈ రాష్ట్రం మళ్లీ దోపిడీకి గురవుతది. కేసీఆరే రాష్ర్టానికి రక్షకుడు. మనమంతా ఆయనను మరింత బలోపేతం చేయాలి’ అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. పచ్చగా ఉన్న తెలంగాణపై ఢిల్లీ పాలకులు విషం చిమ్ముతున్నారని, దీన్ని గట్టిగా ఎదుర్కోకపోతే భవిష్యత్తు అంధకారమవుతుందని పేర్కొన్నారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు ఏర్పాటు చేసిన ‘మధ్యాహ్న భోజనం’ పథకాన్ని శుక్రవారం ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బీ వినోద్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. హమాలీలకు గుర్తింపు కార్డులు అందజేశారు.
అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో గతంలో ఉన్న బాధలన్నీ పోయి రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. గతంలో మొగులు చూసి పంట పండించే పరిస్థితి ఉండగా ప్రస్తుతం కాళేశ్వరం జలాలతో బీళ్లు కూడా సాగులోకి వచ్చాయని గుర్తుచేశారు. రైతుకు కరెంటు, ఎరువులు, నీళ్లు, పెట్టుబడి బాధలు తప్పాయన్నారు. దరఖాస్తు లేకుండానే పెట్టుబడి సాయంగా రైతు బంధు, రైతు బీమా వస్తున్నదని, అవసరమున్న చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నామని, వెంటవెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పండిన ప్రతి గింజనూ కొంటున్నామని, దీంతో సర్కారు తమను ఆదుకుంటుందనే నమ్మకం రైతులకు పెరిగిందని చెప్పారు. మోటర్లకు మీటర్లు పెట్టకుండా ఉచిత కరెంటు ఇస్తానని చెప్పిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఇక్కడ అమలు చేస్తున్న ఇన్ని గొప్ప పథకాలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో రైతులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, పాలకవర్గాన్ని అభినందించారు. అంతకు ముందు పండ్ల మార్కెట్ వ్యాపారులు మంత్రి గంగుల, వినోద్‌కుమార్‌ను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ సునీల్‌రావు, కరీంనగర్ రూరల్ ఎంపీపీ టీ లక్ష్మయ్య, వైస్ చైర్మన్ నారాయణ, కరీంనగర్ సొసైటీ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కర్నాటి చలమయ్య, పబ్బతి రంగారెడ్డి, గుంటి రాజమల్లు, సోమిరెడ్డి లక్ష్మారెడ్డి, గోలి మల్లయ్య, గంగాధర లస్మయ్య, గుండేటి అనిత, చంద్రపల్కల అంజయ్య, బోనాల జనార్దన్, మహ్మద్ మహమూద్ పాషా, విజయ్‌కుమార్ ముందడా, శివనాథుని వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ కార్యదర్శి పురుషోత్తం, సివిల్ సైప్లె అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.