గంగాధర, నవంబర్ 11: విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎంపీడీవో భాస్కర్‌రావు, ఎస్ఐ రాజు సూచించారు. తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని మధురానగర్ చౌరస్తాలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం జాతీయ అక్షరాస్యత దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీడీవో, ఎస్ఐ, సర్పంచులు హాజరై అబుల్‌కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాల ప్రిన్సిపాల్ వారుణిని అతిథులు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో భాస్కర్‌రావు, ఎస్ఐ రాజు మాట్లాడుతూ, పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని శ్రద్ధగా చదవాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు శుక్రొద్దీన్, సర్పంచులు మేచినేని నవీన్‌రావు, వేముల దామోదర్, శ్రీమల్ల మేఘరాజు, ఎండీ నజీర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.