కరీంనగర్ రూరల్, నవంబర్ 11: దేశంలో విద్యాభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎంతో కృషి చేశారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో శుక్రవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రితో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ హాజరయ్యారు. అబుల్ కలామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని ఆదిశగా సాధన చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ, దేశంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. పాఠశాలలు, కళాశాలల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. దేశంలో హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండేలా ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. యువత కలాం ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్, కార్పొరేటర్ బండారి వేణు, నాయకుడు ఆకుల ప్రకాశ్, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
బల్మూరి ఆనందరావు సేవలు మరువలేనివి
దుర్శేడ్ పీఏసీఎస్ చైర్మన్ బల్మూరి ఆనందరావు పేదలకు, రైతులకు చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామంలో బల్మూరి ఆనందరావు పెద్దకర్మ నిర్వహించారు. కాగా, ఆనందరావు చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే, ఆనందరావు చిత్రపటానికి వెలమ సంఘం నాయకుడు పొలాడి రామారావు, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, మేయర్ వై సునీల్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, అఖిల భారత వెలమ సంఘం అధ్యక్షుడు కే పాపారావు, పద్మనాయక వెలమ సంఘం అధ్యక్షుడు మధన్‌మోహన్‌రావు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌రావు, ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.