తిమ్మాపూర్ రూరల్, నవంబర్ 8 : కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి కులస్తులకు చేసిన వాట్సాప్ మెస్సేజ్ దుమారం రేపుతున్నది. కాంగ్రెస్ రెడ్డిల పార్టీ అని చెప్పే విధంగా.. ఎంతో మందిని సీఎంలను చేసిందని, రేవంత్‌రెడ్డి పోరాటాన్ని గమనిస్తున్నారని.. రెడ్డిల సహకారం కావాలంటూ టీఆర్ఎస్లోని కీలక రెడ్డి నేతలకు, నాయకులకు మెస్సేజ్‌లు వచ్చాయి. ఈ విషయం బయటికి రావడంతో నియోజకవర్గ నేతలు భగ్గుమంటున్నారు. తిమ్మాపూర్ మండలంలోని దళిత సర్పంచులు, నాయకులు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి, కవ్వంపల్లి రెడ్డి రాజకీయంపై ఏకిపారేశారు. సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు బోయిని కొమురయ్య, మన్నెంపల్లి సర్పంచి మేడి అంజయ్య మాట్లాడుతూ.. కవ్వంపల్లి సత్యనారాయణ వారం రోజుల నుంచి రెడ్డిలకు వాట్సాప్ ద్వారా రెచ్చగొట్టే మెస్సేజ్‌లు పెడుతున్నారని, కుల రాజకీయాలు చేస్తూ రెచ్చగొట్టడం ఏంటని ప్రశ్నించారు.
సామాజిక మాధ్యమాల ద్వారా వర్గాల నడుమ చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. గతంలో తిమ్మాపూర్ మండల జడ్పీటీసీగా ఉన్న కవ్వంపల్లి మండలానికి చేసిన పనేంటో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని, ఎన్ని రాజకీయాలు చేసినా టీఆర్ఎస్ పార్టీకి.. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు తిరుగులేదని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. కార్యక్రమంలో సర్పంచులు కాటిక వినోద, వడ్లూరి శంకర్, ఉమారాణి, నాయకులు వంతడుపుల సంపత్, ఎంపీటీసీ కనుకం కొమురయ్య, కవ్వంపల్లి పద్మ, నాయకులు ఎలుక ఆంజనేయులు, మాతంగి లక్ష్మణ్, అసోద శ్రీనివాస్, ఖమ్మం కృష్ణ, పారునంది జలపతి, మురళి, తదితరులు పాల్గొన్నారు.