కలెక్టరేట్, అక్టోబర్ 30: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు ఈ దిశగా మరో ముందడుగు వేసింది.. పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి పోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే మహిళలు, బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నది. మెరుగైన ఫలితాలు వస్తుండడంతో రక్త హీనత, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి నిరంతరం బలవర్ధక ఆహారాన్ని పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నది.
తెలంగాణ ప్రభుత్వం పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు అంగన్వాడీ సెంటర్లలో ఎనిమిది నెలలుగా పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నది. దీంతో సెంటర్లలో పిల్లల సంఖ్య నెలనెలా పెరుగుతుండగా, రక్తహీనత, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమేపి తగ్గుతున్నట్లు ఐసీడీఎస్ అధికారులు పేర్కొంటున్నారు. ఇదే ఆహారాన్ని అనునిత్యం అందించేందుకు నిర్ణయించగా, రోజు వారీ ఆహారంలో తగ్గుతున్న పోషకాల లోపాన్ని భర్తీ చేసేందుకు ఆహార పదార్థాల పోర్టిఫికేషన్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు పోర్టిఫికేషన్ బియ్యం తయారీపై దృష్టి సారించి, ఆ బియ్యం పంపిణీ, వినియోగాన్ని ప్రో త్సహిస్తోంది. ధాన్యం మరపట్టే సమయంలో ఎక్కువ పాలిష్ చేయడంతో అందులోని బియ్యపు గింజలపై ఉండే పోషక విలువలతో కూడిన పై పొర, ఇతర న్యూట్రియెంట్లు ఊకతో బయటకు వెళ్లాయి. అయితే, తిరిగి వీటిని కలిపే క్రమంలో తీసుకునే ఆహారంలో తక్కువయ్యే పోషకాలను గుర్తించి వాటిని సమపాళ్లలో చేర్చడాన్నే పోర్టిఫైడ్ అంటారు. ఇందులో నిర్ణీత పరిమాణంలో బియ్యం పిండి, సూక్ష్మదాతు మిశ్రమాలతో బియ్యపు గింజలను పోలి ఉండే కెర్లాన్స్ను తయారు చేస్తారు. ప్రతి 100 గ్రాముల ఎఫ్ఆర్కేలో ఐరన్ 42.5 మి.గ్రా., పోలిక్ 12.50 మైక్రోగ్రాములు, విటమిన్ బీ 12 12.5 మైక్రో గ్రాములు కలిపి వీటిని బియ్యపు గింజలుగా తయారు చేసి ఆరబెడుతారు. అనంతరం ప్రతి 50 కిలోల బియ్యానికి, అర కిలో చొప్పున ఎఫ్ఆర్కే రైస్ కలిపి సంచుల్లో నింపి పౌర సరఫరాల శాఖ ద్వారా నేరుగా అంగన్వాడీ కేంద్రాలకు తరలిస్తారు.
పోషక విలువలు కలిగిన ఈ బియ్యాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో వండి మూడు నుంచి ఏడేళ్లలోపు పిల్లలకు 75 గ్రాములు, గర్భిణులు, బాలింతలకు 100 గ్రాముల చొప్పున వడ్డిస్తున్నారు. 2018లోనే కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించినా క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో విఫలమైంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం దీనిని గమనించి పటిష్టంగా అమలు చేస్తున్నది. మైక్రో న్యూట్రియెంట్లతో కలిగే హార్మోన్ల అభివృద్ధితోనే ఆరోగ్యవంతులుగా ఉంటారని వైద్యులు పేర్కొంటుండగా, పోర్టిఫైడ్ రైస్ తయారీకి అనువుగా ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండ్రెడ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2016లో నిబంధనలు కూడా రూపొందించింది. ఇందులో ప్రధానంగా బియ్యం, గోధుమలు, వంటనూనె, పాలు, ఉప్పులో అవసరమైన పోషకాల వృద్ధి చేపడుతూ అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 777 అంగన్వాడీ కేంద్రాలుండగా 10,508 మంది గర్భిణులు, బాలింతలకు, 18,528 మంది ఆరేళ్లలోపు పిల్లలకు భోజనం, బాలామృతం, పాలు అందిస్తున్నారు. ప్రతి నెల ఇండెంట్ మేరకు జిల్లా వ్యాప్తంగా 450.75 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. వీటితో పాటు బాలామృతం, పాలల్లో కూడా తగ్గిన పోషకాలను గుర్తించి అవసరం మేరకు పోర్టిఫైడ్ చేస్తున్నారు. పోర్టిఫైడ్ రైస్‌తో చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి, ఏకాగ్రత, తెలివితేటలు పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. వారిలో రక్తహీనతను నివారించడంతో కణాల ఎదుగుదలతో పాటు కొత్త కణాలు కూడా తయారవుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. చిన్నారులకు పోషకాహారం అందిస్తూ ఆరోగ్య తెలంగాణ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
పోర్టిఫైడ్ రైస్ ఆరోగ్యానికి మేలు
జిల్లాలో ఎనిమిది నెలలుగా అంగన్వాడీ కేంద్రాలకు పోర్టిఫైడ్ రైస్ సరఫరా చేస్తున్నారు. వీటితో పాటు బాలామృతం, పాలు కూడా పోర్టిఫైడ్ చేస్తూ, వాటిలో తక్కువగా ఉండే మైక్రోన్యూట్రియెంట్లు కలుపుతున్నారు. వీటిని పిల్లలకు, బాలింతలు, గర్భిణులకు క్రమం తప్పకుండా అందిస్తుండగా వారి ఆరోగ్యంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ భోజనం తినే వారిలో గతంలో కన్నా రక్తహీనత సమస్య తక్కువగా ఉన్నట్లు గుర్తించాం. అలాగే, చిన్నారులు ఎత్తుకు తగ్గ బరువు కూడా పెరుగుతున్నారు. కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్య నిలకడగా ఉంటున్నది.
-సబితాకుమారి, జిల్లా సంక్షేమాధికారి