ఓదెల, అక్టోబర్ 30: పాఠశాల బిల్డింగ్ పైనుంచి ప్రమాదవశాత్తు పడడంతో తీవ్రంగా గాయపడిన ఓ నిరుపేద విద్యార్థిని వైద్య ఖర్చుల కోసం సాయం చేయండని అర్థిస్తున్నది. దయార్ద్ర హృదయుల ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నది. కొలనూర్‌కు చెందిన కొల్లూరి నందినిది నిరుపేద కుటుంబం. మూడేళ్ల వయసులోనే తండ్రి ఓదేలు అనారోగ్యంతో కన్నుమూశాడు. తల్లి స్వరూప రజక కుల వృత్తిని చేసుకుంటూ ఇద్దరు కూతుళ్లను సాకుతున్నది. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. నందిని ఓదెల మండలకేంద్రంలోని కసూర్బా విద్యాలయంలో పదో తరగతి చదువుతున్నది. మూడు రోజుల క్రితం పాఠశాల బిల్డింగ్ పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడడంతో వెన్నముకకు తీవ్రంగా గాయమైంది. దీంతో నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమైంది. వెంటనే కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే వెన్నముకకు ఆపరేషన్ చేయా ల్సి ఉందని, ప్రైవేట్ దవాఖానకు వెళ్లాలని వైద్యు లు సూచించారు. ఇక్కడ ఆపరేషన్‌కు దాదాపు రూ.2.50లక్షల ఖర్చు అవుతుందని తెలిపారు. ఆర్థిక స్థోమత లేక ఏం చేయాలో తెలియక ఆ తల్లి తల్లడిల్లుతున్నది. చికిత్స ఆరోగ్యశ్రీలో లేకపోవడంతో కూతురు వైద్య ఖర్చుల కోసం అపన్నహస్తం కోసం ఎదిరిచూస్తున్నది. వీరి దయనీయ పరిస్థితిని చూసి కొలనూర్ గ్రామంలోని యువకులు వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా విరాళాలను జమ చేస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి పేద విద్యార్థిని వైద్య ఖర్చులకు సహాయాన్ని అందించాలని తల్లి స్వరూప వేడుకుంటున్నది. దాతలు 9959034822 కుమార్ పేర ఫోన్‌పే, గుగూల్ పే ద్వారా పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.