మల్యాల, అక్టోబర్ 29: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి రైతులు మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. మల్యాల మండలంలోని ముత్యంపేట, రామన్నపేటలో, మల్యాల, నూకపల్లి, పోతారం గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే రవిశంకర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ వ్యవసాయరంగానికి పెద్దపీట వేశారన్నారు. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించి రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తూ రైతు సంక్షేమానికి పాటుపడుతోంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మాత్రం నల్ల చట్టాలను తెచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరిస్తుందన్నారు. మిల్లర్లు రైతులను, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఇబ్బందులకు గురి చేసినా, అధిక తూకం గురించి డిమాండ్ చేసినా తమ దృష్టికి తీసుకువస్తే అధికార యంత్రాంగం ద్వారా పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం రామన్నపేటలో ఎమ్మెల్యే మామిడి మొక్కలను నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా సహకార అధికారి రామాంజనేయులు, డీఆర్డీఏ అడిషినల్ పీడీ సుధీర్, మార్కెటింగ్ డీపీఎం వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ కొండ పలుకుల రామ్మోహన్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొరండ్ల నరేందర్ రెడ్డి, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.