హుజూరాబాద్ రూర ల్, అక్టోబర్ 29 : కాలేజీ నుంచి తిరిగొస్తున్న విద్యార్థి అనంతలోకాలకు చేరాడు. మరికొద్దిసేపట్లో ఇంటికి చేరేలోగా అనుకోని ప్రమాదంలో దుర్మరణం చెందా డు. హుజూరాబాద్ మండలం మందాడిపల్లి శివారులో ఆగిఉన్న లారీని బైక్ ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. విగతజీవిగా కనిపించిన ఒక్కాగొనొక్క కొడుకు మృతితో కన్నవారు బోరుమన్న తీరు ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దపాపయ్యపల్లికి చెందిన పోసు శ్రీనివాస్-రమాదేవి కుమారుడు మణిదీప్(20) సింగాపూర్ కిట్స్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. శనివారం కళాశాలకు వెళ్లిన మణిదీప్ ఇప్పల నర్సింగాపూర్‌కు చెందిన వరుణ్‌తో కలిసి తిరిగి బైక్‌పై హుజూరాబాద్ వైపు వస్తున్నారు. మందాడిపల్లి గ్రామ సమీపంలోని ఎస్సీకాలనీ వద్ద రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో మణిదీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. వరుణ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న హుజూరాబాద్ టౌన్ సీఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుజూరాబాద్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. కాగా ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు హృదయవిదారకంగా రోదించారు.
జగిత్యాల రూరల్, అక్టోబర్ 29: బైక్‌ను డీసీఎం వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామ శివారులో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన దొమ్మాటి సందీప్ (28), సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన విష్ణువర్ధన్, వైష్ణవి ద్విచక్ర వాహనంపై మేడిపల్లి నుంచి జగిత్యాలకు వస్తున్నారు. చల్గల్ గ్రామ శివారులో డీసీఎం వ్యాన్ వీరి బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సందీప్, విష్ణువర్ధన్, వైష్ణవి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం జగిత్యాల దవాఖానకు తరలించారు. కాగా వైద్యుల సూచన మేరకు దొమ్మాటి సందీప్‌ను కరీంనగర్ దవాఖానకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.