నాడు చిన్న జ్వరమొస్తే మందు బిల్ల కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించిన పెద్దపల్లి జిల్లావాసులకు నేడు చెంతనే ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. ప్రజారోగ్యంపై దృష్టి సారించిన సర్కారు, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎక్కడికక్కడ దవాఖానలను బలోపేతం చేసింది. తల్లీబిడ్డల ఆరోగ్యానికి పెద్దపీట వేసి జిల్లాకో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. మే 4న పెద్దపల్లిలో ప్రారంభించిన ఎంసీహెచ్, మెరుగైన వైద్య సేవలతో ఆడబిడ్డలకు భరోసానిస్తున్నది. పైసా ఖర్చు లేకుండా గర్భిణులకు పురుడు పోస్తున్నది. ఈ ఒక్క అక్టోబర్ నెలలోనే (28 రోజులు) 221 డెలివరీలు చేయగా, ఎంతో మంది పేదలపై ఆర్థిక భారం తగ్గింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి స్పెషల్ రూమ్స్ సైతం ఏర్పాటు చేయబోతుండగా, తాకిడి మరింత పెరిగే అవకాశమున్నది.
పెద్దపల్లి, అక్టోబర్ 29: పెద్దపల్లి జిల్లా దవాఖాన ఆవరణలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సకల వసతులతో నిర్మించారు. గత మే4న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. మొత్తం వంద పడకలకు ప్రతిపాదనలు పంపగా, ప్రస్తుతం 50 పడకలను అందుబాటులోకి తెచ్చారు. ముగ్గురు గైనకాలజిస్టులు, ముగ్గురు పిల్లల వైద్య నిపుణులు, ముగ్గురు అనస్తీయన్లు నిత్యం సేవలందిస్తున్నారు. ఈ తొమ్మిది మందితోపాటు స్టాఫ్ నర్స్, నర్స్ కలిపి 17 మంది ఉన్నారు. పెషేంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ గార్డులు కలిసి 40 మంది ఉన్నారు. ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన సేవలందిస్తున్నారు. పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులకు నెల నెలా ఓపీ చూస్తున్నారు. పరీక్షలన్నీ ఉచితంగానే చేస్తున్నారు. ప్రైవేట్ దవాఖానల్లో లేని వైద్య పరికరికరాలు ఇక్కడ ఉన్నాయి. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు ప్రైవేట్ దవాఖానల్లో 50వేల నుంచి లక్షకుపైనే ఖర్చు వస్తున్నది.
కానీ, పైసా ఖర్చు లేకుండా సర్కారు దవాఖానల్లో గర్భిణులకు సేవలందిస్తున్నారు. నవజాత శిశువులకు సైతం మెరుగైన వైద్యం అందిస్తున్నారు. టీకాలు, ఇతర వైద్య ఖర్చులకు ప్రైవేట్ దవాఖానల్లో వెయ్యి నుంచి 2వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. నెలలు నిండక జన్మించినా, తక్కువ బరువుతో పుట్టినా, శ్వాస ఆడకపోయినా, నంజు వచ్చినా, నెలలు నిండి సరిగ్గా పెరగకుండా జన్మించిన పిల్లలకు లక్షల్లో ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ లోపాలతో పుట్టిన శిశువులకు వైద్యం చేసేందుకు రోజుకు 10 వేల నుంచి 15 వేల వరకు వసూలు చేసే ప్రైవేట్ దవాఖానలు ఉన్నాయి.
ఇలాంటి సేవలన్నీ ఇప్పుడు మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో నయా పైసా ఖర్చు లేకుండా అందుతున్నాయి. మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలిచిన దవాఖానలు.. స్వరాష్ట్రంలో పుట్టింటిని మరిపించే రీతిలో తల్లీబిడ్డలకు భరోసానిస్తున్నాయి. అందుకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మతాశిశు సంరక్షణ కేంద్రమే నిదర్శనంగా నిలుస్తున్నది. జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్ కృషితో అధునాతన వసతులు సమకూర్చుకొని ప్రసూతి సేవల్లో దూసుకెళ్తున్నది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీ – సెక్షన్ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటి సంఖ్య తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో సాధారణ ప్రసవాలను పెంచేందుకు ఇక్కడి వైద్యులు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మొదటి కాన్పు నార్మల్ డెలివరీ అయ్యేందుకు గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం అయ్యే దాకా తగిన జాగ్రత్తలు, సూచనలు చేస్తున్నారు. ఆహారపు అలవాట్లు, వ్యాయామం, యోగాపై అవగాహన కల్పించేందుకు ఎంసీహెచ్‌లో ఒక మిడ్వైపర్, మరో ముగ్గురు ట్రైనీ మిడ్ వైపర్లు ఉన్నారు.
ఎంసీహెచ్‌లో సాధారణ ప్రసవాల పెంపునకు కృషి చేస్తున్నాం. ఈ మేరకు గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవమయ్యే దాకా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గర్భిణులకు వైద్య సిబ్బంది వివరిస్తున్నారు. దవాఖాన వెలుపల, లోపల పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అక్టోబర్ 28వ తేదీ వరకు 221 ప్రసవాలు జరిగాయి. కార్పొరేట్ దవాఖానలకు తీసిపోకుండా మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించడం, దానికి తోడు వైద్య సిబ్బంది కృషి, సత్వర వైద్య సేవలు అందించడం వల్ల నెల నెలా ప్రసవాల సంఖ్య పెరుగుతుంది. బాలింతలకు నవంబర్ ఒకటి నుంచి పే రూమ్స్ అందుబాటులో వస్తాయి. రోజుకు 500 చొప్పున కట్టాలి. స్పెషల్ రూమ్‌లో రెండు బెడ్లు, అటాచ్ బాత్రూం, తాగునీటి సౌకర్యం ఉంటుంది.
– డాక్టర్ కొండా శ్రీధర్, డీసీహెచ్ఎస్ (పెద్దపల్లి)
ఎంసీహెచ్‌లో బాలింతల సౌకర్యార్థం 15 స్పెషల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవి నవంబర్ ఒకటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. రోజుకు 500 చొప్పున చెల్లించి రూమ్ తీసుకోవచ్చు. ఇలా వచ్చిన డబ్బులను దవాఖాన అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు వినియోగిస్తామని వైద్యాధికారులు చెబుతున్నారు.
‘అమ్మకు ఆత్మీయతతో.. బిడ్డకు ప్రేమతో.. ప్రసవం.. సురక్షితం.. సుఖప్రదం..’ అనే నినాదంతో మాతా, శిశు సంరక్షణకు చర్యలు తీసుకున్నారు. ఎంసీహెచ్ ప్రారంభమైన నాటి నుంచి నెలనెలా ప్రసవాలు పెంచుతూ, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వైద్యులు, సిబ్బంది పని చేస్తున్నారు. ప్రసవమైన వెంటనే కేసీఆర్ కిట్‌తోపాటు నగదు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇంకా దవాఖానలో బాలింతకు రోజుకు మూడు గుడ్లు, రెండు అరటి పండ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. డిశ్చార్జి అయిన తర్వాత బాలింతలను సైతం 104 వాహనం ద్వారా వారి వారి ఇండ్లలోకి సురక్షితంగా చేర్చుతున్నారు. ఫలితంగా ఎంసీహెచ్‌కు నెలా నెలా గర్భిణుల తాకిడి పెరుగుతున్నది. ప్రతి రోజూ 200 నుంచి 250 దాకా ఓపీ ఉంటున్నది. ఇటు ప్రసవాల సంఖ్య కూడా పెరుగుతున్నది. గత ఆగస్టులో 113 వరకు డెలివరీలు కాగా, సెప్టెంబర్‌లో 180, అక్టోబర్ 28వ తేదీ వరకు 221 ప్రసవాలు చేశారు.
నాకు ఇది మొదటి కాన్పు. మా అత్తగారిది మంచిర్యాల జిల్లా. డెలివరీ కోసం ఓదెలలోని పుట్టింటికి వచ్చిన. నెల నెలా ఎంసీహెచ్‌ల చూపెట్టుకున్న. డాక్టర్లు చాలా బాగా చూసిన్రు. మొన్న గురువారం నాకు డెలివరీ చేయగా, కొడుకు పుట్టిండు. వెంటనే కేసీఆర్ కిట్ ఇచ్చిన్రు. సిబ్బంది మంచిగా చూసుకుంటున్నరు. ఇప్పటి వరకు ఒక్క రూపాయీ ఖర్చు కాలె. దవాఖానలో వసతులు కూడా బాగున్నయి. డాక్టర్లు బాలింతలు, శిశువుల ఆరోగ్యంపై వైద్యులు కేర్ తీసుకుంటున్నరు. బాలింతల వార్డును ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నరు. ఇంత కంటే ఏం కావాలె చెప్పండి. అదే ప్రైవేట్ల అయితే ఏ లక్ష రూపాయలు ఖర్చయితుండెనో. ఇక్కడైతే పైసా ఖర్చు కాలె. ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్.