ఖిలావనపర్తి శివారులో ఏర్పాటు చేసిన వానర వనంతో ‘ఖిలా’ పరిసరాలు హరితశోభను సంతరించుకున్నాయి. నాలుగేండ్ల కిందట నాటిన పండ్ల మొక్కలు ఏపుగా పెరిగాయి. జామచెట్లు విరగ్గాశాయి. అల్లనేరేడు, పనస, సపోట చెట్లు ఫలాలను అందిస్తున్నాయి. ఈ హరితవనంలో కోతులు, వన్యప్రాణులు సంచరిస్తున్నాయి. పిచ్చుకలు కిలకిలారావాలతో సందడి చేస్తున్నాయి.
ధర్మారం, అక్టోబర్ 29: ‘కోతులు అడవులకు పోవాలి..వానలు వాపస్ రావాలి’ అనే సంకల్పంతో 2016లో ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఊరూరా ఉద్యమ స్ఫూర్తితో మొక్కలను నాటించింది. అలాగే కోతుల బెడదను అరికట్టే లక్ష్యంతో వానర వనాలను ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. ఇందులో భాగంగా ధర్మారం మండలం ఖిలావనపర్తి శివారులో మంత్రి కొప్పుల చొరవతో మంకీఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెవెన్యూ అధికారులు ఖిలాలోని ఎత్తైన గుట్టబోరు వద్ద సుమారు 8 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 2019 ఆగస్టులో సర్పంచ్ సాగంటి తార -కొండయ్య అధ్వర్యంలో చదును చేయించారు. ఉపాధి హామీ కూలీలతో సుమారు 1500 తీరొక్క పండ్ల మొక్కలను నాటించారు.
ఈ మంకీఫుడ్ కోర్టులో నాటిన మొక్కల పెంపకంపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపారు. గొడ్డూగోదా రాకుండా పంచాయతీ పాలకవర్గం ఈ ప్రదేశం చుట్టూ సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేసి ఇనుప కంచెను అమర్చారు. సమీపంలోని వ్యవసాయ బావి నుంచి పైపులైన్ ఏర్పాటు చేసి మొక్కలకు ప్రతిరోజూ నీరందించారు. వేసవిలో మొక్కలు ఎండి పోకుండా గ్రామ పంచాయతీ వారు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. నాలుగేండ్ల నుంచి కంటికిరెప్పలా కాపాడుతుండడంతో పండ్ల మొక్కలు ఏపుగా పెరిగాయి. జామ చెట్లు విరగకాశాయి. పనస, మామిడి, అల్లనేరేడు, సపోట, ఉసిరి, సీతాఫలం చెట్లు ఇప్పుడిప్పుడే కాతకు వచ్చాయి.
మంత్రి సూచనల మేరకు గ్రామ శివారులోని ఎనిమిదెకరాల గుట్టబోరు స్థలాన్ని మంకీఫుడ్ కోర్టు కోసం ఎంపిక చేసినం. నాలుగేండ్ల కిందట చదును చేయించి తీరొక్క పండ్ల మొక్కలు పెట్టినం. వాటిని కాపాడేందుకు చుట్టూ సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేసి కంచె వేసినం. ఇక్కడికి దగ్గరిలోని బావి నుంచి పైపులైన్ వేసి ప్రతిరోజూ నీరుపెట్టేలా ఏర్పాట్లు చేసినం. ఇందుకు ప్రత్యేకంగా వాచర్లను నియమించినం. ఇప్పుడు చెట్లు ఫలాలను ఇస్తున్నాయి. పశుపక్షాదులు ఇక్కడ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా బాగా కాసిన జామచెట్లను చూస్తే సంతోషం కలుగుతుంది.
– సాగంటి తార-కొండయ్య, సర్పంచ్ (ఖిలావనపర్తి)