తీరొక్క రంగులు, విభిన్నమైన చిత్రాలతో సర్కారు బడులను తీర్చిదిద్దాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చిత్రకారులకు వరంలా మారింది. డిజిటల్ కోరల్లో చిక్కి ఆగమైన ఆర్టిస్టులకు దారి చూపింది. వందలాదిమంది కళాకారులకు రాజన్నసిరిసిల్ల జిల్లాలోని పాఠశాలల్లో రైలు, డబుల్ డెక్కర్ బస్సు, హెలికాప్టర్, కాళేశ్వరం ప్రాజెక్టు, రెయిన్బో, మొసలి లాంటి చిత్రాలను వేసే ఆర్డర్లు ఇచ్చింది. అంతేకాకుండా రైతు వేదికలు, పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయ భవనాలు, దవాఖానల్లో సామాజిక నేపథ్యం, పథకాలను ప్రతిబింబించేలా పెయింటింగ్‌ను వేసే బాధ్యతలను అప్పగించింది. ఇలా చేతినిండా పని కల్పించి వారి బతుకుల్లో వెలుగులు నింపుతున్నది.
గంభీరావుపేట, అక్టోబర్ 29 : ఫ్లెక్సీ మిషన్లు, కంప్యూటరైజ్డ్ కటింగ్ లాంటి ఎలక్ట్రానిక్ యంత్రాలు అందుబాటులోకి రావడంతో చిత్రకారులకు ఉపాధి కరువైంది. గత్యంతరంలేని పరిస్థితుల్లో కూలోనాలో చేసి పొట్ట పోసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లకు రంగులు, బొమ్మలు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని సర్కారు బడులను సరికొత్తగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. మంత్రి కేటీఆర్ చొరవ, గివ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లకు తీరొక్క రంగులు, విభిన్నమైన చిత్రాలను వేయిస్తున్నది. ఈ పరిస్థితుల్లో సర్కారు బడి సరికొత్తరూపును సంతరించుకుంటుండగా చిత్రకారులకు దండిగా ఉపాధి లభిస్తున్నది. ఇప్పటికే రాజన్న సిరిసిల్లజిల్లాలోని 135 పాఠశాలలకు రంగులు, 35 పాఠశాలలు, 6 అంగన్వాడీలకు బొమ్మలు వేయిస్తుండడంతో చిత్రకారులకు చేతి నిండా పని దొరికింది. వారికి తమ ప్రతిభను వెలికితీసే అవకాశం కలిగింది.
పాఠశాలల్లోని గోడలపై వేస్తున్న రంగు రంగుల చిత్రాలు విద్యార్థుల మదిని దోచేస్తున్నాయి. ట్రెయిన్, హెలీకాఫ్టర్, డబుల్ డెక్కర్ బస్, మొసలి, రెయిన్బో, కాళేశ్వరం ప్రాజెక్టు, ఐటీ హబ్, చేనేత వస్త్ర పరిశ్రమ, శిల్పారామం, వ్యవసాయ సాగు విధానం, గోల్కొండ కోట, చెట్లు వాటి ఉపయోగాలు, అంగన్వాడీలో చిన్నారులకు ఏబీసీడీ, అఆలు, 123 లాంటి బొమ్మలను చూసి పిల్లలు వింత అనుభూతికి గురవుతున్నారు. ఉల్లాసకరమైన వాతావరణంలో చదువుకుంటూ భవిష్యత్‌కు బాటలు వేసుకుంటున్నారు. ఉపాధ్యాయులు సైతం ఉత్సాహంగా పాఠాలు బోధిస్తున్నారు.
కంప్యూటరైజ్డ్ చిత్రాలతో మా బతుకు దెరువు దెబ్బతిన్నది. దిక్కుతోచని పరిస్థితుల్లో దొరికిన పనిచేసుకుంటూ బతుకులు వెళ్లదీస్తున్నం. గివ్ తెలంగాణ ఫౌండేషన్ తమకు 20 స్కూళ్లల్లో రంగులు, విభిన్నమైన చిత్రాలను వేయాలని ఆర్డర్లిచ్చింది. ఏడాది పొడుగునా చేతినిండా పనిదొరికింది. నెలకు 20 వేల నుంచి 30 వేల దాకా సంపాదిస్తున్న. నాతో పాటు మరో 15 మంది అసిస్టెంట్లు ఉపాధి పొందుతున్నారు. బడుల్లో వేసిన చిత్రాలను చూసిన పలువురు అభినందించడం ఆనందంగా ఉన్నది.
– చందు, ఆర్టిస్ట్ (నర్మాల)
నాది ఖమ్మం జిల్లా. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని పాఠశాలల్లో రంగులు, బొమ్మలు వేసేందుకు ఇక్కడికి వచ్చిన. గంభీరావుపేటలోని కేజీ టూ పీజీ భవనంతో పాటు తంగళపల్లి మండలం చీర్లవంచ, నేరేళ్ల, జిల్లెల్ల, బద్దెనపల్లి గ్రామాల్లోని పాఠశాలల్లో చిత్రాలు వేసిన. తనతో పాటు మరో 15మంది బతుకుదెరువు దొరుకుతున్నది. దారి చూపిన సర్కారుకు రుణపడి ఉంట.
– కోరిపల్లి మహర్షి, ఆర్టిస్ట్ (ఖమ్మం)