చేనేత ఉత్పత్తులపై కేంద్రం విధించిన జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో పోస్టు కార్డు పోరు ఉధృతమైంది. ప్రధాని నరేంద్ర మోదీకి నేత కార్మికులు లేఖలు రాసి పంపుతున్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు చోట్ల వందల సంఖ్యలో ఉత్తరాలు రాసి పోస్టు చేసి తమ నిరసన తెలిపారు.
– హుజూరాబాద్‌టౌన్, అక్టోబర్ 25
హుజూరాబాద్‌టౌన్, అక్టోబర్ 25: పోస్టు కార్డు ఉద్యమం ఊపందుకున్నది. నూలు, తయారీ బట్టపై ఇప్పటికే 5 శాతం టాక్స్ విధించిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా మరో 7 శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడమే కాకుండా, చేనేతపై మొత్తం జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో నేత కార్మికులు నిరసనను ఉధృతం చేశారు. మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పలుచోట్ల ప్రధాని నరేంద్ర మోదీకి ఉత్తరాలు పంపారు. జగిత్యాలలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత స్వయంగా లేఖ రాసి పోస్టు చేశారు. ధర్మపురి పట్టణ పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉత్తరాలు పోస్టు చేయడంతో పాటు, చేనేత వస్ర్తాలపై జీఎస్టీ ఎత్తివేయాలని తహసీల్దార్ వెంకటేశ్‌కు వినతిపత్రం అందజేశారు. చేనేత వస్ర్తాలపై జీఎస్టీ ఎత్తివేయాలని పెగడపల్లి మండల పద్మశాలీ సంఘం నాయకులు ప్రధాని మోదీకి పోస్టు కార్డు ద్వారా విజ్ఙప్తి చేశారు.
అనంతరం తహసీల్దార్ కృష్ణచైతన్యకు వినతి పత్రం అందజేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలకేంద్రంలో వస్త్ర వ్యాపారులు, చేనేత వ్యాపారులు, రెడీమెడ్ దుకాణ వ్యాపారులు పోస్టుకార్డు ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఈ మేరకు వారు పెద్ద సంఖ్యలో పోస్టు కార్డులు రాసి ఢిల్లీలోని ప్రధాని నివాసానికి పంపించారు. సిరిసిల్ల 9 వవార్డు కౌన్సిలర్ లింగంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో స్థానిక నేతలతో ప్రధాని మోదీకి పోస్ట్‌కార్డులు రాశారు. 4వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీపీటీడీసీ చైర్మన్ గూడూరు ప్రవీణ్, టీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ పాల్గొని స్థానికులతో కలిసి పోస్టు కార్డులు రాశారు. అనంతరం వార్డు పరిధిలో రాసిన 500ల పోస్టు కార్డులను స్థానిక కౌన్సిలర్ వెల్దండి దేవదాస్ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళకు అప్పగించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ చేనేత సహకార సంఘానికి చెందిన సుమారు 500 మంది సభ్యులు సోమ, మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఉత్తరాలు రాసి పంపారు.