సర్కారు పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర సర్కారు, మరో ముందడుగు వేసింది. విద్యార్థుల్లో మేధా సంపత్తిని పెంచేందుకు డిజిటల్ క్లాస్‌రూమ్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, కరీంనగర్ బల్దియా రంగంలోకి దిగింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 52 బడుల్లోని104 గదులను స్మార్ట్ క్లాస్ రూమ్స్‌గా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు 10.55కోట్లతో పనులు చేపట్టగా, ఇప్పటికే 20స్కూళ్లలో 40 గదులు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ తెరలపై తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో బోధన చేస్తుండగా, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది.
– కరీంనగర్ కార్పొరేషన్, అక్టోబర్ 25
కరీంనగర్ కార్పొరేషన్, అక్టోబర్ 25 : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను మెరికల్లా తయారు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. సకల వసతులు కల్పిస్తూ బడులను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతుండగా, కరీంనగర్ నగరపాలక సంస్థ మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్మార్ట్‌సిటీ పథకంలో భాగంగా నగరంలోని 52 ప్రభుత్వ పాఠశాల్లో 104 తరగతి గదులను స్మార్ట్ క్లాస్‌రూమ్స్‌గా మార్చేందుకు శ్రీకారం చుట్టింది. డిజిటల్ తరగతి గదులతోపాటు సదుపాయాల కోసం 10.55 కోట్లతో పనులు చేపట్టింది. గదుల్లో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ టీచింగ్ డివైస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్, తెలుగు మీడియంలో తరగతుల బోధనకు డిజిటల్ కంటెంట్‌ను అందజేస్తున్నారు. వీటితో పాటుగా ప్రతి స్కూల్స్‌కు 52 క్రోమోబుక్స్ చార్జింగ్ కార్డులతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు 52 యూపీఎస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి స్కూల్లో కనీసం 10 చొప్పున మొత్తం 500 స్టూడెంట్ డెస్క్‌లను ఏర్పాటు చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే ఆయా పాఠశాలల్లో వైఫై ఉండే విధంగా ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. కాగా ఇప్పటికే నగరంలోని 20 పాఠశాలల్లో 40కి పైగా డిజిటల్ తరగతి గదులు అందుబాటులోకి రాగా, మిగతావి వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కాగా, పూర్తయిన క్లాస్‌రూమ్స్‌లో డిజిటల్ బోధన కొనసాగుతుండగా, విద్యార్థులు సంబురపడుతున్నారు. మౌఖికంగా చెప్పినదానికంటే తెరపై చిత్రాలు చూపిస్తూ బోధించడంతో సులువుగా అర్థమవుతున్నదని చెబుతున్నారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం
కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్స్‌ను బల్దియాలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. ఈ సెంటర్ నుంచే ఆయా క్లాస్ రూమ్స్ ఎలా వినియోగిస్తున్నారో తెలుసుకుంటున్నారు? కాగా, ఇప్పటికే పూర్తయిన క్లాస్‌రూమ్స్‌ను గత నెలలోనే ్ల మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, మేయర్ వై సునీల్‌రావు ప్రారంభించారు. కంట్రోల్ సెంటర్ నుంచే విద్యార్థులతో ముచ్చటించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
డిజిటల్ బోధన నచ్చింది. సబ్జెక్టులు ఈజీగా అర్థమవుతున్నాయి. గతంలో ఎంతో కష్టమనిపించిన పాఠాలు ఇప్పుడు సులువుగా అనిపిస్తున్నాయి. ఇంగ్లిష్‌తోపాటు తెలుగులోనూ చెప్పడంతో తేలికగా అర్థమవుతున్నాయి. మ్యాథ్స్, సైన్స్, సోషల్‌లో ఆయా పాఠాలకు సంబంధించిన బొమ్మలు తెరపై చూపిస్తుండడంతో వెంటనే గుర్తుండిపోతున్నాయి. అన్నీ క్లాస్‌లు డిజిటల్లోనే చెప్పిస్తే బాగుంటుంది.
– ఎల్ సందీప్
ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
కార్పొరేట్ స్కూల్స్‌ల్లో చదివే విద్యార్థులకు పోటీ ఇచ్చే స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఆలోచనతోనే ఈ స్మార్ట్‌క్లాస్ రూమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. స్మార్ట్‌సిటీ కింద స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు విద్యార్థులకు ఆధునిక పద్ధతిలో విద్యను అందించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్, ఇతర అధికారుల సూచనలతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా కరీంనగరంలోని ప్రతి పాఠశాలలో రెండు గదులను డిజిటల్ క్లాస్‌రూంను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే 40 గదులు పూర్తయ్యాయి. త్వరలోనే అన్నింటినీ అందుబాటులోకి తెస్తాం.
– వై సునీల్‌రావు, కరీంనగర్ మేయర్
పాఠాలు సులువుగా అర్థమవుతున్నాయి
డిజిటల్ బోధనతో పాఠాలు సులువుగా అర్థమవుతున్నాయి. బ్లాక్ బోర్డుపై చాక్‌పీస్‌తో గీస్తూ సార్లు మౌఖికంగా చెప్పినదానికంటే డిజిటల్ బోధనతో అన్ని విషయాలు తెలుస్తున్నాయి. అన్ని విభాగాలను ప్రత్యేకంగా చూపించడం వల్ల పాఠాలన్నీ గుర్తుండిపోతున్నాయి. సాంఘిక శాస్త్రంలో చెబుతున్న పాఠాల్లోని ప్రాంతాలు ఎలా ఉంటాయో తెలియదు. కానీ, డిజిటల్ బోధనలో ఆ ప్రాంతం రూపురేఖలు, ఫొటోలు, వీడియో ఉండడం వల్ల సులువుగా గుర్తుంచుకునే వీలు కలిగింది. అన్ని పాఠాలను డిజిటల్లో బోధిస్తే బాగుంటుంది.
– గంప కీర్తన, 10వ తరగతి
ఎంతో బాగుంది
ఎప్పుడు సార్లు చెప్పే పద్ధతి కన్నా ఈ వీడియోల్లో చూపించడం ఎంతో బాగుంది. పాఠాలను వినడం కన్నా వింటూ తెరపై చూడడం వల్ల త్వరగా అర్థమవుతున్నాయి. ఎలాంటి కష్టమైన పాఠమైనా ఈజీగా గుర్తుంటున్నది. గతంలో పదే పదే ఒక్కొక్క పాఠాన్ని చదివినా మరిచిపోయేవాళ్లం. కానీ, డిజిటల్ పాఠాలతో మొత్తం మైండ్‌లో ఫీడైపోతున్నది. డిజిటల్ బోధనతో ఎక్కువ మార్కులు సాధించే అవకావముంటుంది.
– తాడి ఐశ్వర్య, 10వ తరగతి
డిజిటల్లోనే బాగుంది
డిజిటల్ పాఠాలు బాగున్నాయి. సార్లు బ్లాక్ బోర్డుపై గణితంలో సూత్రాలు, ఇతర వస్తువులు లెక్కలు వేసినప్పుడు అనేక డౌట్స్ వచ్చేవి. కానీ, ఈ విధానంలో ఈజీగా అన్నీ అర్థమైపోతున్నాయి. నాకు మ్యాథ్స్‌లో ఎక్కువగా డౌట్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు అన్నీ అర్థమైపోతున్నాయి. చాలా సంతోషంగా ఉంది.
– మ్యాకల శశాంక్, 9వ తరగతి
ఆసక్తిగా వింటున్నారు
డిజిటల్ బోధన విద్యార్థులకు చాలా నచ్చింది. తరగతులను ఎంతో ఆసక్తిగా వింటున్నారు. చూడని ప్రదేశాలు సులువుగా మ్యాపింగ్ చేసేందుకు వీలుగా ఉంటుంది. సోషల్‌లో అయితే ఏయే దేశాలు, ప్రపంచం, సముద్రాలు ఇలా అన్నింటినీ నేరుగా తెరపై చూపిస్తుండడం వల్ల పిల్లలు ఎప్పటికీ మర్చిపోయే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం ఉన్న కంటెంట్‌లో రాష్ట్ర స్థాయి సిలబస్ ఏర్పాటు చేయడంతోపాటు తరగతి గదుల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు కూర్చొనేలా తీర్చిదిద్దితే బాగుంటుంది.
– భారతి, సోషల్ టీచర్
ఈజీగా అర్థం చేసుకుంటున్నరు..
ఈ పద్ధతిలో బోధనతో పిల్లలు ఈజీగా అర్థం చేసుకుంటున్నరు. ముఖ్యంగా సైన్స్‌లో మనం బొమ్మల రూపంలో చూపించే వాటిని ఇక్కడ వీడియోలో ప్రతి విభాగాన్ని చూపించే వీలు ఉంటుంది. ఎలా పనిచేస్తుంది? ఎలా వినియోగించాలన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పవచ్చు. మేం బోధించే ప్రతి పాఠాన్నీ రికార్డు చేసే అవకాశమున్నది. దీనివల్ల ఆయా పాఠాన్ని విద్యార్థులకు మళ్లీ వివరించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
– కే వెంకటేశ్వర్లు, ఫిజిక్స్ టీచర్