వేములవాడ టౌన్/మల్యాల/ధర్మపురి/ఇల్లందకుంట, అక్టోబర్ 25 : సూర్యగ్రహణం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ప్రధాన ఆలయాలైన వేములవాడ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి, ధర్మపురి లక్ష్మీనర్సింహ స్వామి, ఇల్లందకుంట సీతారామాలయాలతోపాటు అన్ని ఆలయాలను మంగళవారం మూసివేశారు. వేములవాడలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో ఉదయం 5.30గంటలకు స్వామి వారికి ప్రాతఃకాల పూజ అనంతరం ఆలయ ముఖ ద్వారానికి, ఆలయ గర్భగుడి ముఖద్వారానికి తాళాలు వేశారు.
సాయంత్రం 5.35 గంటల తర్వాత ఆలయ ముఖద్వారాన్ని తెరిచారు. 6.15 గంటలకు అర్చకుల వేదమంత్రాలమధ్య ఆలయ సంప్రోక్షణ చేసి, ప్రదోష పూజతో చేశారు. 7.45 గంటలకు స్వామివారి దర్శనం కల్పించారు. కొండగట్టులో ఉదయం పంచామృతాభిషేకంతోపాటు తమలపాకుల అర్చన అనంతరం ఆలయ ప్రధాన ద్వారాన్ని మూసివేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి టంకశాల వెంకటేశం తెలిపారు. బుధవారం ఉదయం ఆలయంలో సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆలయంలోకి భక్తులను అనుమతిస్తామని తెలిపారు. ధర్మపురిలో ఉదయం 5 గంటలకు ప్రధాన దేవాలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజల అనంతరం ఆలయాన్ని మూసివేశారు.
బుధవారం ఉదయం 6గంటలకు దేవాలయాన్ని తెరిచి సంప్రోక్షణ, అభిషేకం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఇల్లందకుంట శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయాన్ని ఉదయం 6 గంటలకు పూజల అనంతరం మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం 6 గంటలకు ఆలయాన్ని సంప్రోక్షణ చేసి, 7 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయ ఈవో కందుల సుధాకర్ తెలిపారు.