రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : వస్త్ర ఉత్పత్తులు, ముడిసరుకులపై 12 శాతం పెంచాలన్న కేంద్రం నిర్ణయాన్ని కార్మికులు మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చేనేతను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ముడిసరుకులపై 50 శాతం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తుంటే కేంద్రం వేస్తున్న పన్నుపోటుపై ఆగ్రహిస్తున్నారు. పన్నుల నుంచి చేనేతను మినహాయించాలంటూ ప్రధాని మోదీకి చేనేత జౌళీశాఖ మంత్రి కేటీఆర్ పలు మార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. దీంతో చేనేత పరిశ్రమ సంక్షోభంలోకి కూరుకు పోయి, కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడినందున మంత్రి కేటీఆర్ కార్మికుల పక్షాన నిలిచారు. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని ఎత్తివేయాలంటూ ప్రధానికి లేఖ రాయడంతో పాటు లక్ష ఉత్తరాలు పంపించాలని పిలుపునిచ్చారు. వస్త్ర ఉత్పత్తులపై 5 శాతం ఉన్న జీఎస్టీని 12 శాతానికి పెంచడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కరోనా వ్యాప్తితో రెండేళ్లుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిశ్రమపై జీఎస్టీ ఏకంగా 7 శాతం పెంచడం దుర్మార్గమని పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత లక్షలాది మందికి ఉపాధి కల్పించే టెక్స్టైల్స్ రంగానికి చేయూతనివ్వాల్సింది పోయి, పన్నులు విధంచడం సరికాదన్నారు.
జీఎస్టీ నుంచి టెక్స్టైల్స్ రంగాన్ని మినహాయించాలని మంత్రి పదేపదే విజ్ఞప్తులు చేశారు. అయినప్పటికీ కేంద్రం కనికరం చూపలేదు. మళ్లీ జీఎస్టీ అంశం తెరమీదికి రావడంతో అమాత్యుడు ప్రధానికి పోస్టు కార్డులు రాయాలంటూ నేతన్నలకు పిలుపునివ్వడంతో పాటు మొదటి లేఖ తానే రాసి పంపించారు. మంత్రి పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష పోస్టు కార్డులు లక్ష్యంగా మొదలైన ఉద్యమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఆదివారం 500 మంది నేతన్నలు ప్రధానికి ఉత్తరాలు రాసి పంపించారు. జిల్లాలో 20వేల కార్డులు రాసి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వయంగా ప్రధానికి లేఖ రాశారు. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేయాలని ప్రధానికి ఉత్తరాలు రాయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వీణవంక మండలం రెడ్డిపల్లిలో నేత కార్మికులకు పోస్టు కార్డులు అందజేశారు.
5 శాతం నుంచి 12కి జీఎస్టీ పెంపు
రాష్ట్రంలో దాదాపు 40 వేల మరమగ్గాలు, 5 వేల వరకు చేనేత మగ్గాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఒక్క సిరిసిల్ల జిల్లాలోనే 30 వేల మరమగ్గాలుంటే 20 వేల పైచిలుకు కార్మికులకు పరిశ్రమ ఉపాధి నిస్తున్నది. రాష్ట్ర సర్కారు అందిస్తున్న చేయూతతో ఒక్కో కార్మికుడు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదిస్తున్నారు. రోజుకు 20 లక్షల మీటర్ల వస్ర్తాలు ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్ర సర్కారు ఇస్తున్న ఆర్డర్లతోనే పరిశ్రమ నిరంతరంగా నడుస్తున్నది. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరుతో వస్త్ర పరిశ్రమపై పన్ను పోటు వేసింది. ప్రస్తుతం వస్ర్తాల తయారీపై 5 శాతం ఉన్న జీఎస్టీని 12 శాతానికి పెంచింది. దీని వల్ల మీటరు బట్టకు రూ.4 నుంచి రూ.5 వరకు పెరిగే అవకాశం ఉంది. విధించిన 12 శాతం పన్నుతో కేంద్ర సర్కారుకు రూ.కోట్లలో ఆదాయం సమకూరనుండగా, కార్మికులు, ప్రజలపైనే పెనుభారం పడనున్నది.
రంగులపై 18 శాతం
కేంద్రం వస్త్ర పరిశ్రమపై మూడు రకాల పన్నులు విధించింది. రంగులు, రసాయనాలపై 18 శాతం, నూలు, తయారైన వస్ర్తాలపై 5 శాతం వేయగా, దీనిని 12 శాతానికి పెంచాలని నిర్ణయించింది. అయితే, అసలే కుంటుతూ గెంటుతూ నడుస్తున్న టెక్స్టైల్స్ రంగంపై కేంద్రం విధించిన పన్నులు భారంగా మారాయి. వ్యాపారాలు మందకొడిగా నడుస్తున్న క్రమంలో బట్ట తయారీపై 5 శాతం ఉన్న పన్ను 12 శాతానికి పెంచడం మరింత భారంగా మారింది. కరోనా కష్టకాలంలో పరిశ్రమ నడవక, లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. రాష్ట్ర సర్కారు ప్రోత్సాహంతో ఇప్పడిప్పుడే కోలుకుంటున్న పరిశ్రమపై కేంద్ర సర్కారు పన్నుల పేరిట భారం మోపుతుండడంతో పరిశ్రమలు మూత పడి కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. ప్రస్తుతం కాటన్ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒకప్పుడు పెటీకోట్స్ తయారీలో దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న సిరిసిల్ల నేడు జీరో స్థాయికి పడిపోయింది. 350 డయ్యింగ్లుండి 3 వేల మందికి పని కల్పించిన అద్దకం పరిశ్రమ నేడు 27కి తగ్గి రెండు వందల మందికి మాత్రమే పనికల్పిస్తున్నది. నూలు, రంగులు, రసాయనాల ధరలపై పన్నుల మోత కారణంగా వాటి రేట్లు మూడింతలు పెరిగాయి. కిలో రూ.140 ఉన్న రంగు ప్రస్తుతం రూ.300 దాటింది. ఇలా పన్నులు విధించడం వల్ల మార్కెట్లో వస్ర్తాలకు గిట్టుబాటు ధర రాక పరిశ్రమలు మూసి వేయడం మినహా మరో గత్యంతరం లేదంటూ ఉత్పత్తిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు మూసి వేస్తే జిల్లాలో 20 వేలకు పైగా కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉంది.
కార్మికులకు అండగా రాష్ట్ర సర్కారు
వ్యవసాయం తర్వాత లక్షల మందికి ఉపాధి కల్పించే అతిపెద్ద పరిశ్రమను ఆదుకునేందుకు రాష్ట్ర సర్కారు ముందుకొచ్చింది. రాష్ట్రం ఏర్పడకముందే కార్మికుల సంక్షేమం కోసం అప్పటికప్పుడు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చిన అప్పటి ఉద్యమ నాయకుడు, ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ వివిధ రకాల వస్త్ర ఉత్పత్తికి రూ.3 వేల కోట్ల ఆర్డర్లు ఇచ్చి వారికి చేతినిండా పని కల్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆర్డర్లు ఇచ్చి వారి జీవితాలకు భరోసా కల్పిస్తే, కేంద్ర సర్కారు 12 శాతం జీఎస్టీ విధించి పరిశ్రమ మూసి వేసే దిశకు కారణమవుతున్నది. జీఎస్టీని తగ్గించాలంటూ మున్సిపల్, చేనేత, జౌళిశాఖల మంత్రి కేటీఆర్ పలు మార్లు లేఖ రాసినా కేంద్రం స్పందించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వస్త్ర ఉత్పత్తిదారులు, కార్మికులు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. కొంత కాలం పాటు వాయిదా వేసి నమ్మబలికింది. తిరిగి కార్మికులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నందున రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. కేంద్ర విధానాలపై నేతన్నలను చైతన్యం చేసింది. 5 శాతం ఉన్న జీఎస్టీని 12 శాతానికి పెంచడం కాదు కదా.. మొత్తానికే తొలగించాలని డిమాండ్ చేయాలంటూ దేశ ప్రధాని మోదీకి లేఖ రాస్తూ పోస్టు కార్డు ఉద్యమానికి మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
అంధకారంలోకి కార్మికుల జీవితాలు:ప్రధానికి రాసిన లేఖలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చేనేతపై 5 శాతం పన్ను వేసి కార్మికుల జీవితాలను అంధాకారంలోకి నెట్టారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో ఆయన తన స్వహస్తాలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ప్రజాప్రతినిధిగా, చేనేత కార్మికుల సంక్షేమాన్ని కోరే వ్యక్తిగా వారికి మద్దతుగా నిలుస్తున్నట్లు తెలిపారు. ఒకవైపు స్వదేశీ మంత్రం, ఆత్మనిర్భర్ భారత్ వంటివి వల్లెవేసే కేంద్ర ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతుందన్నారు. చేనేత వస్ర్తాలపై పన్ను వేసిన ఏకైక ప్రధాని మీరేనంటూ లేఖలో దుయ్యబట్టారు. టెక్స్టైల్ రంగంలో కీలకమైన చేనేత రంగాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీపావళి పండుగ సందర్భంగా చేనేతపై వేసిన 5 శాతం జీఎస్టీని సంపూర్ణంగా రద్దు చేసి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు.
జీఎస్టీ మొత్తానికే రద్దు చేయాలి
దేశ చరిత్రలో చేనేతపై జీఎస్టీని విధించిన దాఖలాలు లేవు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే చేనేత పరిశ్రమపై జీఎస్టీ పన్నుపోటు పడింది. ఇది చాలా సిగ్గుచేటు. నేతన్నలకు చేతి నిండా పనికల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్ల వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ఇచ్చి ఆదుకుంటున్నది. దీంతో ఆకలిచావులు, ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయి, కార్మికులు సంతోషంగా జీవిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహానికి కేంద్రం సహకరించాల్సింది పోయి పన్నుల మీద పన్నులు విధించడం దుర్మార్గం. 12 శాతం జీఎస్టీ విధించాలన్న నిర్ణయం వెనక్కి తీసుకుని, ఉన్న 5 శాతం కూడా తొలగించాలి. ముడిసరుకులపైనా రద్దు చేయాలి. పోస్టు కార్డుల ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం.
– వెంగళ శ్రీనివాస్, టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు, రాజన్న సిరిసిల్ల
పన్నుల భారం మోయలేం
ఇప్పటికే మార్కెట్లో వస్తున్న పోటీని తట్టుకోలేక పోతున్నాం. వస్ర్తాల తయారీలో ముడి సరకుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల పరిశ్రమను మూసివేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం వల్ల ఇటు కార్మికులకు చేతి నిండా పని లభించింది. తయారైన వస్ర్తాలను రాష్ట్ర ప్రభుత్వమే కొంటున్నందున పరిశ్రమ బతుకుతున్నది. 50 శాతం సబ్సిడీలు ఇస్తున్నది. అయితే, కేంద్రం విధించిన జీఎస్టీ వల్ల ముడిసరుకులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడి కూడా ఎల్లడం లేదు. తయారైన బట్టకు గిట్టుబాటు రాక పరిశ్రమలు మూసి వేసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. విధించిన జీఎస్టీని వెంటనే రద్దు చేసి పరిశ్రమకు చేయూతనివ్వాలి.
– మండల సత్యం, పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు, సిరిసిల్ల
రోడ్డున పడేది కార్మికులే
ప్రస్తుతం వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉన్నది. తయారైన వస్ర్తాలకు గిట్టుబాటు ధరలేక తీవ్రంగా నష్టపోతున్నాం. వ్యవసాయం తర్వాత వేలాది మందికి ఉపాధి కల్పించేది వస్త్ర పరిశ్రమనే. దీనిపై ఆధారపడ్డ కార్మికులకు రాష్ట్ర సర్కారు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదుకుంటున్నది. బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్, విద్యార్థుల యూనిఫాం తయారీ ఇలా రూ.వేల కోట్ల ఆర్డర్లు ఇచ్చి యజమానులు, ఆసాములు, కార్మికులను ఉపాధి కల్పించి ఆదుకుంటున్నది. యారన్, విద్యుత్ సబ్సిడీలు ఇస్తున్నది. పరిశ్రమలు బాగా నడిచి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రాయితీలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నది. కేంద్రం మాత్రం జీఎస్టీ పేరిట పన్నులు విధించడం సరికాదు. జీఎస్టీ రద్దు చేయకపోతే లక్షల మంది రోడ్డున పడే ప్రమాదం ఉన్నది.
– యెల్దండి దేవదాస్, పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి
శ్రీయుత గౌరవనీయులైన భారతదేశ ప్రధాన మంత్రి గారికి, ఈ పేద చేనేత కళాకారుడి నమస్కారాలు
అయ్యా!
చేనేత వృత్తి వ్యాపారం కాదు.. దేశ వారసత్వ కళాసంపద. ఇది తమరికి తెలిసిన విషయమే.
చేనేత కళాకారులందరూ పేద, బలహీన వర్గాల వారు. గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు.
చేనేత కళాకారుడి నైపుణ్యత, సృజనాత్మకతపై ఆధారపడి నేత పరిశ్రమ మనుగడ సాగిస్తున్నది. చేనేత కళాకారుడిలో వ్యాపార దృక్పథం ఏకోశానలేదు.
దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో చేనేత వృత్తి ప్రాముఖ్యత తమరికి తెలిసిన విషయమే.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చేనేత ముడి సరుకులపై, చేనేత వస్ర్తాలపై ఎలాంటి పన్నూ విధించలేదు.
కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేనేతకు వాడే ముడి సరుకులపై, చేనేత వస్ర్తాలపై 5 శాతం జీఎస్టీ విధించి దానిని 12 శాతానికి పెంచాలనుకోవడం చేనేత కార్మికుల పాలిట ఉరితాడు అని చెప్పడానికి ఎలాంటి సంశయం లేదు.
కావున, తమరికి విన్నవించడం ఏమనగా, దయచేసి చేనేత ముడిసరుకులు, చేనేత వస్ర్తాలపై జీఎస్టీనీ వెంటనే రద్దు చేయాలి.
చాప్టర్ 62, 63లో ఉన్న చేనేత సంబంధిత వస్తువులపై జీఎస్టీని వెంటనే తొలగించాలని మా డిమాండ్.
చేనేతపై జీఎస్టీ 5 శాతం కాదు, 12 శాతం కాదు, జీరో ఉంచాలి.
ఇట్లు
తమ విధేయుడు
నేత కార్మికుడు,రాజన్న సిరిసిల్ల