కోనరావుపేట, అక్టోబర్ 23: గతంలో వరి సాగు చేసి నష్టపోయిన రైతులు సీఎం కేసీఆర్ సూచన మేరకు ఇతర పంటలపై దృష్టి సారించారు. దీంతో పలువురు రైతులు బంతిపూలు, కూరగాయలను సాగు చేసి లాభాలు గడిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కవ ఆదాయం రావడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రంగురంగుల పూల సాగు చేసి పలువురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
సంప్రదాయ పంటలు సాగు చేస్తూ. నష్టాల ఊబిలో చిక్కుకున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. రైతులు అప్పులపాలు కాకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ పంట మార్పిడిపై దృష్టిసారించాలని సూచించారు. దీంతో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు ఆదాయాన్నిచ్చే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలో కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన పలువురు రైతులు మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న బంతి సాగు చేశారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధిస్తూ లాభాలు గడిస్తున్నారు.
పని తక్కువ.. లాభం ఎక్కువ..
వరి, పత్తి పంట పండించి నష్టపోయిన రైతులు బంతి సాగు చేసి ఎక్కువ లాభాలు పొందారు. మం డల కేంద్రానికి చెందిన నేరెళ్ల లింబయ్య, ముదాం రవి, బంతి పూలను సాగుచేశారు. లింబయ్య 30 గుంటల భూమిలో బంతి పూలను సాగుచేసి లక్షా 50వేల లాభం పొందాడు. ముదాం రవి తనకున్న ఎకరంలో 2.20లక్షలకు పైగా, పిట్టల శేఖర్ కూడా 10 గుంటల్లో 20వేలకు పైగా లాభం పొందారు. పంట మార్పిడి చేసి లాభాలు ఆర్జిస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రాలను అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించి వారిని సత్కరించారు. పనిభారం తక్కువ కావడడం, స్వల్ప వ్యవధిలోనే మంచి లాభాలు వస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్లో భలే డిమాండ్..
పూలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. వినాయక చవితి, బతుకమ్మ సంబురాలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు, దసరా పండుగతోపాటు దీపావళి, కార్తీకమాసం, మహా శివరాత్రి, అయ్యప్ప దీక్ష లు, శుభకార్యాల్లో బంతిపూల వాడకం ఎక్కువగా ఉండడంతో మంచి గిరాకీ ఉన్నది. బంతి పూలు మాములు సమయంలో కిలో 50 నుంచి 60 వరకు ఉంటే పండుగపూట 120-150 వరకు ధర పలుకడంతో రైతుల ఇంట సిరులు కురుస్తున్నాయి.
రైతులకు మంచి ఉపాధి..
బంతి సాగు చేస్తున్న రైతులతోపాటు కూలీలు, వ్యాపారులు, చిరు వ్యాపారులకు ఉపాధి లభిస్తున్నది. రైతులు తెల్లవారుజామున పూలను కోసి సిరిసిల్ల, వేములవాడ పట్టణాలకు తరలిస్తున్నారు. మరి కొంత మంది వ్యాపారులు పంట చేను వద్దకే వచ్చి పూలను కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా మహిళలు ఇంటి వద్దనే బంతి పూలను దండలుగా మార్చి మార్కెట్లో విక్రయిస్తున్నారు.
గిరాకీ బాగున్నది
సీఎం కేసీఆర్ సూచించిన మేరకు వరి, పత్తి కాకుండా కూరగాయలు, బంతి పూలు సాగు చేస్తున్న. 30గుంటల్లో రంగుల బంతి సాగుచేసి లక్షా50వేల వరకు ఆదాయం పొందిన. పంట మార్పిడితో లాభాలు పొందుతున్న. అధికారులు ప్రోత్సహించడంతోపాటు పంటల సాగులో సూచనలు ఇస్తున్నారు. పండుగల పూట పూలకు గిరాకీ బాగా ఉంటున్నది. ప్రభుత్వం కొన్ని రాయితీలను అందించి రైతులను ప్రోత్సహించాలి.
– నేరెళ్ల లింబయ్య, రైతు, కోనరావుపేట
డిమాండ్ ఉన్న పంటలు వేయాలి
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు సాగు చేయాలి. ప్రభుత్వం సూచించి న విధంగా అధికారుల సూచనలతో సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చు. పంటల మార్పిడితో ఎక్కువ లాభాలుంటాయి. బంతి రైతులను మిగతావారు ఆదర్శంగా తీసుకోవాలి. ప్రభుత్వం రాయితీలో అందిస్తున్న పనిముట్లు, విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి.
– పోకల రేఖ, సర్పంచ్, కోనరావుపేట
లాభసాటి పంటలు సాగు చేయండి
రైతులు పంట మార్పిడితోపాటు లాభసాటి పంటలు సాగు చేయాలి. క్లస్టర్ల వారీగా ఏఈవోల సేవలను వినియోగించుకోవాలి. పప్పు దినుసులు, కూరగాయలు, పూల సాగు చేస్తే ఎక్కువగా లాభాలు ఇస్తాయి. కొంతమంది రైతులు మండలంలో ఇప్పటికే పంటలను మార్పిడి చేశారు. చెరుకు, ఆవాలు పంటలను తొలిసారిగా పండిస్తున్నారు. కోనరావుపేటలో రైతులు బంతి పూల సాగు చేసి లాభాలు పొందడం హర్షణీయం.
– వెంకట్రావమ్మ, ఏవో, కోనరావుపేట