కమాన్చౌరస్తా, అక్టోబర్ 23: దీపావళి అంటే ‘దీపాల వరుస’ అని అర్థం. చీకటిని పారదోలే ఈ పండుగ, కష్టాల్లోనూ సుఖం కలగాలనే సందేశాన్ని మానవాళికి అందిస్తున్నది. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తుంది. చీకటి పడగానే మహిళలు దీపాలు వెలిగించే పనిలో నిమగ్నమైతే, చిన్నారులు, యువకులు పటాకులు కాల్చి ఆనందిస్తారు. చిచ్చుబుడ్లు, భూచక్రాల వెలుగుపూల చుట్టూ చేరి కేరింతలు కొడతారు.
ఇదీ పురాణం..
నరకాసురుడనే రాక్షస రాజు యువతులను చెరబట్టి, చిత్రహింసలకు గురిచేసేవాడు. ప్రజలను హింసిస్తూ ఆనందించేవాడు. అతడి బాధల నుంచి విముక్తి కలిగించేందుకు భక్తజన బాంధవుడు శ్రీకృష్ణుడు నరకాసుర సంహారానికి బయల్దేరుతాడు. ఆ సమయంలో తోడుగా వస్తానంటుంది సత్యభామ. ఆమే స్వయంగా రాక్షస సంహారం చేస్తుంది. దీంతో నరకుడి పీడ వదిలిన ప్రజలు దీపాలు వెలిగించి పండుగ జరుపుకుంటారు. ఆనాటి నుంచి అది ఆనవాయితీగా వస్తున్నది.
లక్ష్మీ గణపతి పూజ..
ఈ రోజు సిరిసంపదలకు చిహ్నమైన లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆమెతోపాటు పూజలందుకునే మరో దేవుడు గణపతి. అంటే అమావాస్య చీకట్లు కమ్ముకునే వేళ ప్రతి ఇంటా లక్ష్మీగణపతి పూజ మొదలుపెడతారు.
26న కేదారేశ్వర వ్రతాలు
24న నరక చతుర్దశి రోజున మంగళహారతులు, లక్ష్మీపూజలు, 25న సూర్యగ్రహణం ఉన్నందున్న 26న కేదారేశ్వర నోములు జరుపుకోవచ్చని జ్యోతిష్య, వేద పండితులు పేర్కొంటున్నారు. అవకాశం లేని వారు కార్తీక పౌర్ణమిలోపు ఎప్పుడైనా కేదారేశ్వర నోములు జరుపుకోవచ్చని చెబుతున్నారు.
దీపం ప్రాముఖ్యత
దీపం పరబ్రహ్మ స్వరూపం. జ్ఞానం, శాంతికి చిహ్నం. నిర్లక్ష్యం అనే చీకటిని పారదోలే దివ్యజ్యోతి. అజ్ఞానాన్ని తొలగిస్తుంది. దీపారాధనతో సర్వ కార్యాలు సిద్ధిస్తాయని హిందువుల నమ్మకం. పంచభూతాల్లో ప్రధానమైనది అగ్ని. దీనికి ప్రతిరూపమైన దీపం సమస్త ప్రాణకోటి మనుగడకు తేజస్సును, ఆహారాన్ని ప్రసాదిస్తుంది. పండుగ పూట వెలిగించే దీపాన్ని యమదీపం అంటారు. త్రయోదశి రోజు సాయంత్రం ఇంటి ముందు దీపం వెలిగిస్తే యముడి గండం తొలిగిపోతుందంటారు.
పండుగ నేడు జరుపుకోవాలి
దీపావళి పండుగను ఈ నెల 24నే జరుపుకోవాలి. అమావాస్య, నరక చతుర్దశి కావడంతో సోమవారం నిర్వహించుకోవాలి. అదే విధంగా 25వ తేదీ మంగ ళవారం సూర్యగ్రహణం కావడంతో నోములు, వ్రతాలు చేసుకోవాల్సిన వారు బుధవారం 26న జరుపుకోవాలి.
– రాజన్న ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్
సకల సౌభాగ్యాల పండుగ
దీపావళి సకల సౌభాగ్యాల పండుగ, ఈ పండుగను జరుపుకోవడం వల్ల ఐష్టెశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ సంవత్సరం గ్రహణం ఉన్న నేపథ్యంలో 24న వ్యాపార సంస్థలలో పూజలు నిర్వహించుకోవాలి. 26వ తేదీన ఇండ్లలో కేదారేశ్వర స్వామి వ్రతాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవాలి. సూర్య గ్రహణం రోజున గర్భిణులు మధ్యాహ్నం 12 గంటలనుంచి సాయంత్రం 7 గంటల వరకు విశ్రాంతి తీసుకోవాలి.
– మంగళంపల్లి శ్రీనివాస శర్మ,నగర వైదిక పురోహితులు