కార్పొరేషన్, అక్టోబర్ 23: కరీంనగర్‌ను రాష్ట్రంలోనే పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మున్సిపల్ పాలకవర్గం పని చేస్తున్నదని మేయర్ వై సునీల్‌రావు పేర్కొన్నారు. నగరంలోని 15, 24, 32, 35వ డివిజన్లలో ఆదివారం ఆయన పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ వై సునీల్‌రావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులతో నగరం రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయని అన్నారు. ప్రధానంగా శివారు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. మంచినీటి సరఫరా, డ్రైనేజీలు, సీసీ రోడ్ల పనులకు ప్రాధాన్యమిచ్చి చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నగరంలో నెలకొన్న సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా బల్దియా పాలకవర్గం పని చేస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వందల కోట్ల నిధులు తీసుకువచ్చి సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. సీఎం అస్యూరెన్స్, పట్టణ ప్రగతి, వివిధ గ్రాంట్ల నిధులతో ప్రతి డివిజన్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
రాబోయే రోజుల్లో కరీంనగర్‌ను పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన సుందర నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. నగరపాలక సంస్థకు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక ప్రశంసలు, అవార్డులు వచ్చాయన్నారు. గతేడాది సఫాయి మిత్ర సురక్షా చాలెంజ్‌లో బల్దియాకు రూ. 4 కోట్ల నగదు బహుమతి వచ్చిందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలోనూ మంచి ర్యాంక్ సాధించినట్లు తెలిపారు అలాగే, జల సర్వేక్షణ్ పోటీల్లో కూడా మెరుగైన ర్యాంక్ సాధనకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. హరితహారంలో ఇప్పటికే 11 నర్సరీలను ఏర్పాటు చేసి నగరవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. రూ. 150 కోట్లతో వరద నీటి డ్రైనేజీలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోనే రోజూ మంచినీటి సరఫరా అందిస్తున్న నగరంగా పేరు సాధించామన్నారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, కుర్ర తిరుపతి, నాగసముద్రం జయలక్ష్మి, మర్రి భావన, నాయకులు మేచినేని అశోక్‌రావు, ప్రవీణ్, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.