జగిత్యాల కలెక్టరేట్, అక్టోబర్ 22 : జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్డూడెంట్స్ స్టడీ సెంటర్లో నల్గొండ జిల్లా పోలీసులు సోదాలు నిర్వహించా రు. నకిలీ సర్టిఫికెట్లు తయారుచేస్తున్నారనే పక్కా సమాచారంతో దాడులు చేసి పది యూనివర్సిటీలకు చెందిన స్టాంపులు, రిజిస్టర్లు, సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకొని స్టడీ సెంటర్ నిర్వాహకుడు ఖలీల్‌ను అదుపులోకి తీసుకొని నల్గొండకు తీసుకెళ్లారు. నల్గొండ జిల్లాలో ఓ మహిళ నుంచి అందిన ఫిర్యాదు మేరకు నల్గొండ పోలీసులు కేసు విచారణ చేపట్టగా, నకిలీ సర్టిఫికెట్ జగిత్యాల నుంచి జారీ చేసినట్లుగా గుర్తించారు.
ఆ క్రమంలోనే నల్గొండ జిల్లా పోలీసులు శుక్రవారం జగిత్యాలకు చేరుకొని జగిత్యాల పట్టణంలోని స్టూడెంట్ స్టడీ సెంటర్లో సోదాలు నిర్వహించి అర్ధరాత్రి వరకు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పది యూనివర్సిటీలకు చెందిన పలు సర్టిఫికెట్లు, యూ నివర్సిటీలకు చెందిన స్టాంపులు, ఎంబోస్డ్ ముద్రలు, రిజిస్టర్లు, పలు రకాల పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న 14 సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు.
స్టడీ సెంటర్ నిర్వాహకుడు ఖలీల్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్టాంపులు, ముద్రలు, స్కానర్, ప్రింటర్, కంప్యూటర్లతో సహా నిర్వాహకుడు ఖలీల్‌ను నల్గొండకు తరలించారు. స్టడీ సెంటర్ పేరుతో పలు యూనివర్సిటీలకు చెందిన డిగ్రీ, ఉన్నత చదువులకు సంబందించిన సర్టిఫికెట్లు తయారుచేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నల్గొండలో లభ్యమైన నకిలీ సర్టిఫికెట్ సైతం ఖలీల్ తయారుచేసిందనే పోలీసులు అనుమానిస్తున్నారు.