ధర్మపురి, అక్టోబర్ 18 : జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఓ యువకుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఉదయం 10 గంటల సమయంలో కిడ్నాప్ కాగా, రాత్రి 10 గంటలకు పోలీసులు, బంధువుల చాకచక్యంతో దుండగుల చెర నుంచి బయటపడ్డాడు. 12 గంటల పాటు ఆద్యంతం సినీ ఫక్కీని తలపించిన ఘటనకు సంబంధించి కిడ్నాప్ అయిన వ్యక్తి, అతని బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ సత్తెమ్మ కొడుకైన సంగి శేఖర్‌కు జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో పెట్రోల్ బంక్ ఉండగా.. గతంలో దానిని ధర్మపురికి చెందిన పంబాల యుగంధర్‌కు లీజ్‌కు అప్పగించారు. ఆ సమయంలో సంగి శేఖర్‌కు వరుసకు సోదరుడైన సంగి నరేశ్ యుగంధర్‌తో కలిసి బంక్‌లో పనిచేశాడు. అయితే, రెండేళ్ల క్రితం యుగంధర్ ధర్మపురి మండలం రాయపట్నం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలై దాదాపు ఆరు నెలలు హైదరాబాద్ దవాఖానలో చికిత్స పొంది కోలుకున్నాడు.
ఆ సమయంలో కొడిమ్యాల బంక్ మేనేజ్మెంట్ బాధ్యతలన్నీ నరేశ్ చూసుకున్నాడు. బంక్‌లో పనులు చూసుకుంటూనే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో మరో బంక్‌ను సొంతంగా దక్కించుకున్నాడు. కాగా, యుగేంధర్ అప్పుల పాలయ్యాడు. కొంత డబ్బు ఇచ్చి ఆదుకోవాలని పలుమార్లు నరేశ్‌ను అడిగాడు. ఈ క్రమంలో కోనరావుపేట బంకులో 10 శాతం వాటా ఇద్దామని నరేశ్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కొంత మనస్పర్థలు ఏర్పడ్డాయి.
కిడ్నాప్ జరిగింది ఇలా…
సంగి నరేశ్ రెండు నెలల క్రితం కోనరావుపేట బంక్ వద్ద బాత్రూమ్లో జారి పడగా చేతి భుజం వద్ద గాయమై ధర్మపురిలోని స్వగృహంలోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతని స్నేహితుడైన ధర్మపురికే చెందిన పురోహితుడు పెండ్యాల అశ్విన్ నరేశ్‌కు ఫోన్ చేసి ‘నీకు గ్రహాలు అనుకూలంగా లేవు.
అందుకే ఇలా జారి పడ్డావు. గ్రహదోశ నివారణ పూజలు చేయాలి. ఇంటికి రా’ అని పలుమార్లు పిలిచాడు. దీంతో నరేశ్ పూజ కోసం సోమవారం ఉదయం 10 గంటలకు అశ్విన్ ఇంటికి వెళ్లాడు. అతను 40 నిమిషాల పాటు పూజ నిర్వహించాడు. ఇంతలోనే యుగంధర్ మరో ముగ్గురు కలిసి కారులో పురోహితుడి ఇంటికి వచ్చి, అతని ఇంట్లోకి చొరబడి నరేశ్‌ను తాళ్లతో కాళ్లు, చేతులు కట్టివేసి, నోటికి ప్లాస్టర్ చుట్టి, నల్లటి రంగు కలిగిన సంచిని తలపై తొడిగి, బలవంతంగా కారులోకి ఎక్కించారు.
అక్కడి నుంచి ధర్మపురిలోని నక్కలపేట రోడ్డు వైపు గల ఇందిరమ్మకాలనీకి తరలించి, ఓ గదిలో పడేసి తాళం వేశారు. తర్వాత ఎప్పటిలాగా జనంలో కలిసి తిరిగారు. అయితే, మధ్యాహ్నం 3 గంటల వరకు నరేశ్ ఇంటికి రాకపోవడంతో తల్లి లక్ష్మి అతనికి పలుమార్లు ఫోన్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తన సోదరి కొడుకులైన నర్సయ్య, మల్లేశ్, శేఖర్, శ్రీనివాస్‌కు ఫోన్ చేసి పొద్దున ఇంటి నుంచి వెళ్లిన నరేశ్ ఇప్పటి వరకు రాలేదని తెలిపింది. దీంతో వారితో పాటు నరేశ్ మిత్రులు ధర్మపురిలో వీధివీధినా వెతికారు.
ఆచూకీ దొరక్కపోవడంతో రాత్రి 10 గంటల సమయంలో బ్రాహ్మణవాడలోని పురోహితుడు అశ్విన్ ఇంటి వీధిలో ఉన్న ఇద్దరి ఇండ్లల్లో గల సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అందులో కారు నంబర్‌తో పాటు కిడ్నాప్ చేసిన వ్యక్తిని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ కోటేశ్వర్ ఆధ్వర్యంలో వెల్గటూర్, బీర్పూర్ ఎస్ఐలు నరేశ్‌కుమార్, అజయ్‌తో పాటు పోలీసులు అప్రమత్తమయ్యారు.
ధర్మపురి ఇందిరమ్మకాలనీ వైపు వచ్చి ఆరా తీస్తూ కాలనీలో విచారించగా.. అప్పటికే అక్కడి నుంచి ఓ కారు అతివేగంగా వెళ్లిందని కాలనీవాసులు చెప్పడంతో, కారు నంబర్‌తో పాటు నక్కలపేట, దోనూర్, జైనలో కొందరికి సమాచారం అందించి, నరేశ్ బంధువులు, స్నేహితులను అప్రమత్తం చేశారు.
కిడ్నాపర్లు నరేశ్‌ను ఎక్కించుకొని నక్కలపేట, దోనూర్, గాదెపల్లి, తీగలధర్మారం మీదుగా కొసునూర్పల్లి చేరారు. అప్పటికే పోలీసుల వాహనాలతోపాటు, నాలుగు కార్లు, ద్విచక్ర వాహనాల్లో కారును వెంబడించి కొసునూర్పల్లి శివారులో అడ్డగించి నరేశ్‌ను రక్షించారు. కిడ్నాప్ చేసిన యుగంధర్‌తో పాటు దమ్మన్నపేట, ధర్మపురికి చెందిన మరో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మరో ఇద్దరు తప్పించుకున్నట్లు సమాచారం.
అపస్మారక స్థితిలో ఉన్న నరేశ్‌ను దవాఖానకు తరలించి చికిత్స అందించారు. కాగా, తనను కిడ్నాప్ చేసిన వారిలో ధర్మపురికి చెందిన పంబాల యుగేంధర్‌తో పాటు, పులిశెట్టి శ్రావణ్, ఉపేందర్, షేక్ అస్లామ్ ఉన్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కిడ్నాప్ చేసి ఇందిరమ్మకాలనీలోని ఓ ఇంట్లో బంధించి, రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, తీవ్రంగా కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, ఈ వ్యవహారంలో కిడ్నాపర్లకు పురోహితుడు సహకరించాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.