కోల్‌సిటీ, అక్టోబర్ 17: రాష్ట్ర వ్యాప్తంగా లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించడంపై రామగుండం లారీ యజమానుల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో సోమవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలుగు రాష్ర్టాల్లో సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని, పాత లారీలకు గ్రీన్ ట్యాక్స్ తగ్గించాలని, ఓవర్ లోడుతో నడిపే డ్రైవర్ల లైసెన్సు సస్పెన్షన్ రద్దు చేయాలని, మున్సిపల్ పరిధిలో రవాణా రుసుము లేకుండా చూడాలని రాష్ట్ర సంఘం నాయకులు సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కలిసి విన్నవించారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర లారీ యజమానుల సంఘం నాయకులు మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేశ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కే సుధాకర్ గౌడ్ , దామోదర్ రెడ్డి, పింగిళి భాస్కర్ రెడ్డి, తోట శ్రీనివాస్, కంది శ్రీనివాస్, బాబూరావు, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.