తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనంతరం మొదటిసారి నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు ఉమ్మడి జిల్లాలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 34,045 మంది పరీక్ష రాయనుండగా, 89 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సారి కొత్త జిల్లా కేంద్రాల్లోనే పరీక్ష రాసే అవకాశం దక్కగా, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. నూతనంగా అమల్లోకి తెస్తున్న బయోమెట్రిక్‌తోపాటు నిబంధనలను పరిగణలోకి తీసుకొని కేంద్రాలకు రెండు గంటల ముందుగానే చేరుకోవాలని సూచిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి బయోమెట్రిక్ చేయడానికి 15 నుంచి 20 సెకన్లు పట్టే అవకాశముందని, చివరి నిమిషంలో వచ్చి ఇబ్బందులు పడవద్దని చెబుతున్నారు. కాగా, ఈసారి అమల్లోకి తెచ్చిన జంబ్లింగ్ విధానం వల్ల ఎవరైనా కాపీయింగ్‌కు పాల్పడితే అసలుకే ఎసరు వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరీక్ష రాసే సమయంలో ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ సూచిస్తున్నారు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నమిలకొండ వద్ద జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపై రైల్వే ట్రాక్పనులు జరుగుతున్న దృష్ట్యా గ్రూప్-1 అభ్యర్థులు తమ ప్రయాణాన్ని గంట ముందుగానే ప్రారంభించాలని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జగిత్యాల ఎస్పీ సింధూశర్మ సూచించారు. కరీంనగర్ నుంచి వచ్చే అభ్యర్థులు గంగాధర వయా బూరుగుపల్లి, తాటిపల్లి, మల్యాల ఎక్స్‌రోడ్డు కొండగట్టు మీదుగా జేఎన్టీయూ కళాశాలకు, జగిత్యాల జిల్లా కేంద్రానికి చేరుకోవచ్చని, జగిత్యాల నుంచి కరీంనగర్ వచ్చే అభ్యర్థులు అదే రూట్లో రావచ్చని చెప్పారు. సింగిల్ రోడ్డు ఉన్నందున ప్రయాణం ఆలస్యం అవుతుందని, 8.30 గంటల్లోగా చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
ప్రిలిమ్స్ రాసే అభ్యర్థులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురికావద్దు. నిండైన ఆత్మవిశ్వాసంతో పరీక్షను రాయాలి. సమయపాలన చాలా ముఖ్యం. ఎగ్జామ్ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. 10.15 నిమిషాల వరకే అనుమతిస్తారు. మొదటిసారి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు కావున ఒక్కొక్కరికీ బయోమెట్రిక్ చేయడానికి కనీసం 15 నుంచి 20 సెకన్ల సమయం పడుతుంది. అందుకే రెండు గంటల ముందే అంటే ఉదయం 8.30 గంటల వరకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. అప్పుడే ప్రశాంతంగా పరీక్ష రాసే అవకాశముంటుంది.
అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఆధార్, ఓటరుఐడీ, పాన్‌కార్డు, పాస్‌పోర్టు డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదైనా గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలి. ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ అనేది చాలా కీలకం. సరిగా బబ్లింగ్ చేయకపోయినా, అభ్యర్థి అలాగే ఇన్విజిలేటర్ సంతకాలు లేకపోయినా ఆ పేపర్‌ను మూల్యాంకనం చేయరు. ఈ విషయంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలున్నాయని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి ఇప్పటికే చెప్పారు. దీనిని ప్రతి అభ్యర్థీ గుర్తించాలి. దీంతోపాటు నెగెటివ్ మార్కులు లేవు కాబట్టి ప్రతి అభ్యర్థీ 150 నిమిషాల్లో 150 ప్రశ్నలకు జవాబు రాసే విషయంపై దృష్టిపెట్టాలి.
ఏ ఒక్క నిమిషాన్ని వృథా చేయొద్దు. మొదటగా తెలిసిన ప్రశ్నలకు ఆలస్యం చేయకుండా ఆన్సర్ ఇవ్వాలి. సమాధానాలు తెలియని ప్రశ్నలుంటే ఆందోళనకు గురికావద్దు. ఆలోచించి ఆన్సర్ చేయాలి. ఈ సారి ప్రశ్నాపత్రాల సిరీస్‌లు పెంచారు. జంబ్లింగ్ విధానం అమల్లో ఉన్నది. పక్కపక్కన ఉండే ఇద్దరి సమాధానాలు, ప్రశ్నలు పొంతన లేకుండా ఉంటాయి. కాపీయింగ్‌పై దృష్టి పెట్టద్దు. అలా చేస్తే అసలుకే మోసం వస్తుంది. అనవసరంగా భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. పరీక్ష హాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. సెంటర్లలో గోడ గడియారాలు కూడా ఉండవు. అయితే, ప్రతి అరగంటకోసారి అలర్ట్ చేసేలా గంట మోగిస్తారని ఇప్పటికే అధికారులు చెప్పిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
– మామిండ్ల చంద్రశేఖర్, తెలంగాణ గ్రూప్ -1 ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
కరీంనగర్, అక్టోబర్ 15, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ పరీక్షకు ఉమ్మడి జిల్లా నుంచి 34,045 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. గత చరిత్ర చూస్తే ఉమ్మడి జిల్లా నుంచి గ్రూప్ -1 పరీక్షలకు కేవలం ఆరు నుంచి ఏడు వేల మంది మాత్రమే హాజరైనట్లు తెలుస్తున్నది. ఈసారి భారీగా పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం, అందులోనూ ప్రిపేర్ ఆయ్యేందుకు కావాల్సినంత సమయం ఇవ్వడం, ప్రభుత్వ పరంగా అభ్యర్థుల ప్రిపరేషన్‌కు అనేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం, ప్రజాప్రతినిధులు చొరవ చూపి అనేక చోట్ల కోచింగ్ సెంటర్లను నిర్వహించడం, గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు కావాల్సిన మెటీరియల్, బుక్స్‌ను ప్రభుత్వం అందుబాటులో ఉంచడం మూలంగా ఉమ్మడి జిల్లా నుంచి పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య పెరిగినట్లుగా పరిశీలకులు చెపుతున్నారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఈ సారి టీఎస్పీఎస్సీ పలు కొత్త విధానాలను అమల్లోకి తెచ్చింది. అభ్యర్థుల వివరాలను పకడ్బందీగా సేకరించేందుకు తొలిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. టీఎస్పీఎస్సీ చర్రిత్రలో ఈ తరహా విధానం ఇదే మొదటి సారి. దీని వల్ల ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఉంటుంది. ఇదే సమయంలో.. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తే జీవితకాలం పాటు నిషేధం విధించేందుకు చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
అలాగే, ప్రతి పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుండడమే కాకుండా వీటిని హైదరాబాద్‌లోని టీఎస్పీఎస్సీకి అనుసంధానం చేస్తున్నారు. అక్కడి నుంచి మానిటరింగ్ జరుగుతుంది. దీంతో ఏ సెంటర్ పరిధిలో ఏం జరుగుతుందో ఇట్టే తెలుసుకోవచ్చు. దీంతోపాటు మొదటిసారి జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నది. దీనివల్ల కాపీయింగ్‌కు పూర్తిగా అడ్డుకట్ట పడుతుంది. అంతేకాదు, గతంలో ఏబీసీడీ సిరీస్‌లు మాత్రమే ఉండగా.. ఈ సారి వాటిని ఆరుకు పెంచుతున్నారు. ఏ కోణంలో చూసినా కష్టపడి చదివిన అభ్యర్థులకు పూర్తిగా న్యాయం జరిగేలా టీఎస్పీఎస్సీ చర్యలు తీసుకున్నది. దీంతోపాటు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.