గతంలో ఎన్నడూ లేని విధంగా పచ్చివడ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. వ్యాపారులు గ్రామాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకొని కొనుగోలు చేస్తుండగా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు సైతం ధాన్యం విక్రయానికే మొగ్గు చూపుతున్నారు. పంటకు మంచి ధర కూడా వస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
-హుజూరాబాద్, అక్టోబర్ 15
డివిజన్లో లక్షా 20,650 ఎకరాల సాగు భూమి విస్తీర్ణం ఉండగా, ఈ వానకాలంలో 74,336 ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో హుజూరాబాద్ మండలంలో అత్యధికంగా 23,857 ఎకరాలు, అత్యల్పంగా ఇల్లందకుంటలో 9,322 ఎకరాలు, వీణవంకలో 15,489 ఎకరాలు, సైదాపూర్‌లో 13,553, జమ్మికుంటలో 12,115 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందులో 35వేల ఎకరాల్లో బీపీటీ, జైశ్రీరాం, తెలంగాణ సోనా తదితర సన్న రకాలు పండించారు.
డివిజన్లో నీళ్లు పుష్కలంగా ఉండడంతో చాలా చోట్ల ముందస్తుగా జూన్ రెండో వారంలోనే రైతులు వరి సాగు చేశారు. ప్రస్తుతం పంటలు కోతకు రాగా, ఈ తరుణంలో వర్షాలు పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ చైన్ మిషన్‌తో కోసిన కూడా వరుస వానలతో వడ్లు ఆరబోసే పరిస్థితి కనబడడం లేదు. ఈ సమయంలో పచ్చివడ్లకు గిరాకీ ఏర్పడటంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. అంతేకాకుండా రెండుమూడు రోజుల వాయిదాతో వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో రైతులు ధాన్యం విక్రయిస్తున్నారు.
పచ్చి వడ్లకు విపరీతంగా డిమాండ్ ఏర్పడటంతో గ్రామాల్లో వ్యాపారులు తిష్టవేశారు. ఏజెంట్లను నియమించుకుని పచ్చి వడ్లను కొనుగోలు చేస్తున్నారు. సన్న వడ్లు క్వింటాల్ రూ.1850, దొడ్డు ధాన్యానికి రూ.1700 ధర చెల్లిస్తున్నారు. వడ్లు నాణ్యంగా ఉంటే క్వింటాల్‌కు మరో రూ.20నుంచి 30వరకు అదనంగా ఇస్తున్నారు. పచ్చి వడ్లను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దాపురం, మండపేటకు, ఇక్కడ సూర్యాపేట, నల్గొండకు ఎగుమతి చేస్తున్నారు. సన్నవడ్లకు డిమాండ్ పెరిగే అవకాశాలు ఉండడంతో ఇక్కడి రైస్‌మిల్లర్లు కొందరు కొనుగోలు ఆసక్తి చూపుతున్నారు.