తిమ్మాపూర్ రూరల్, అక్టోబర్15: విద్యార్థులు ఆరోగ్యంపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతీబా ఫూలే గురుకుల బాలికల పాఠశాలలో శనివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్, గ్లోబల్ హ్యాండ్ వాష్ డే కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ప్రతి ఆరు నెలలకొకసారి హిమోగ్లోబిన్ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ప్రతి రోజూ కూరగాయలు, గుడ్లు, పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. చదువుతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే భవిష్యత్ బాగుంటుందని హితవు పలికారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనాను.. చేతుల శుభ్రతతోనే జయించినట్లు గుర్తు చేశారు.
ప్రతి ఒక్కరూ మల, మూత్ర విసర్జన తర్వాత, భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. యూనిసెఫ్ అధికారి వెంకటేశ్ మాట్లాడుతూ.. చేతుల శుభ్రత దినోత్సవాన్ని పండుగలా జరుపుకోవాలన్నారు. చేతులను తరచూ శుభ్రం చేసుకుంటే వ్యాధులు ప్రబలవని సూచించారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో డీ వార్మింగ్ డే నిర్వహించి రక్తహీనత గల పిల్లలను గుర్తించి మాత్రలు అందించినట్లు పేర్కొన్నారు. అనంతరం క్రీడల్లో రాణించిన జట్లకు ట్రోఫీలు అందజేశారు. అలాగే, చేతుల శుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జక్కని శ్రీవాణి, డీఆర్డీవో శ్రీలతరెడ్డి, జిల్లా వైద్యాధికారి జువేరియా, యూనిసెఫ్ కో-ఆర్డినేటర్ కిషన్ స్వామి, సంక్షేమాధికారి సబిత, వివిధ శాఖల అధికారులు, ప్రిన్సిపాళ్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.