పచ్చని అడవిలో అద్భుతమైన అర్బన్ ఫారెస్ట్ పార్కు (లంగ్ స్పేస్ పార్కు) ముస్తాబవుతున్నది. చుట్టూ అడవి..అందులో గుట్టలు, ఎత్తయిన వృక్షాలు.. పక్షుల కిలకిలా రావాలు.. కనువిందు చేసే నెమళ్లు, జింకలు.. వీటన్నింటి మధ్యన 4 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామం పరిధిలోని 50 హెక్టార్ల అటవీ స్థలంలో వేగంగా ఏర్పాటవుతున్నది. ఇప్పటికే లోటస్‌పాండ్, యోగా కేంద్రం, గజిబో, చిల్డ్రన్స్ ప్లే గార్డెన్, బటర్ ఫ్లై గార్డెన్, ఆల్ఫాబెట్ ఏరియా, వివిధ ఆకృతుల్లో బెంచీలు, ప్రవేశ ద్వారం పూర్తి కాగా, త్వరలోనే అన్ని పనులూ పూర్తయి అందుబాటులోకి వచ్చే అవకాశమున్నది. ఇప్పటికే కొలువుదీరిన ఆకృతులతో ఈ ప్రాంతం కొత్త శోభ సంతరించుకున్నది.
ఎల్లారెడ్డిపేట, అక్టోబర్ 14 : హైదరాబాద్ లాంటి నగరాల తరహాలో పెద్ద పెద్ద పార్కులను ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించగా, అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అడుగు పడింది. అమాత్యుడు కేటీఆర్ చొరవతో జిల్లాకేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో అర్బన్ ఫారెస్ట్ పార్కు (లంగ్ స్పేస్ పార్కు) రూపుదిద్దుకుంటున్నది. ఈ మేరకు సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారి ఆనుకొని ఉన్న పదిర అటవీ భూమిలో 4 కోట్ల అంచనా వ్యయంతో ఈ పార్కు ఏర్పాటుకు మంత్రి కేటీఆర్, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి 2020 జూన్ 26న శంకుస్థాపన చేశారు. ఆ వెంటనే అటవీశాఖ పర్యవేక్షణలో పనులు మొదలు పెట్టారు. ఎప్పటికప్పుడు వేగవంతం చేస్తున్నారు.
50 హెక్టార్లలో పనులు
ప్రశాంత వాతావరణంలో రోజంతా కుటుంబాలతో ఎంజాయ్ చేసే విధంగా సకల సౌకర్యాలతో అర్బన్ ఫారెస్ట్ పార్కు రూపుదిద్దుకుంటున్నది. పోతిరెడ్డిపల్లి ఫారెస్ట్ బ్లాకులో 581 హెక్టార్లు ఉండగా, అందులో పదిర పరిధిలో కేటాయించిన 50 హెక్టార్లలో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆరోగ్యాన్నిచ్చే ఔషధ మొక్కలతోపాటు మానసికోల్లాసాన్నిచ్చే మొక్కలను పెంచుతున్నారు. రాశి, నక్షత్ర, నవగ్రహ వనాలు ఏర్పాటు చేస్తున్నారు. మూడు పర్కులేషన్ ట్యాంకులు. పార్కులోకి వెళ్లేందుకు ప్రధాన రహదారులను నిర్మిస్తున్నారు. ఈ రహదారులకు ఇరుపక్కల తీరొక్క పూల మొక్కలు పెంచుతున్నారు.
పార్కులో ఆకర్షించేవి ఇవే..
పార్కులో గుట్ట కింది భాగాన సేద తీరేందుకు గజిబో, రోడ్డు నుంచి కిలోమీటరు దూరంలో పచ్చని చెట్ల మధ్యన యోగా కేంద్రాన్ని, ఇంటర్నల్ రోడ్లు నిర్మించారు. ప్రవేశ ద్వారం, లోటస్‌పాండ్, చిల్డ్రన్స్ ప్లే గార్డెన్, వివిధ ఆకృతుల్లో కూర్చొనే బెంచీలు, బాత్రూంలు, టాయ్లెట్లు, బటర్ ఫ్లై గార్డెన్, ఆల్ఫాబెట్ ఏరియాను పూర్తి చేశారు. పర్కులేషన్ ట్యాంకులు నిర్మించారు. అందులో వాటర్ ఫాల్స్, బోటు షికారు వంటివి ఏర్పాటు చేయనున్నారు. చిన్నారుల కోసం 10 హెక్టార్లలో చిల్డ్రన్స్ ప్లే ఏరియాను సిద్ధం చేస్తున్నారు. ఉయ్యాలలు, జారుడు బల్లలు, ఔట్‌డోర్ జిమ్, సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, అడ్వెంచర్ పార్కు, స్కల్ప్చర్ పార్క్, హెర్బల్ పార్కు, ట్రీహౌస్, ట్రెక్కింగ్పాత్, వాచ్‌టవర్, కార్తీకవనం, పిక్నిక్ ఏరియా, ఔట్‌డోర్ క్లాస్రూంలు నిర్మించనున్నారు. పర్కులేషన్ ట్యాంకులపై తీగల వంతెనలు, వాచ్ టవర్, క్లాస్‌రూం, ఆట మైదానాలు.. ఇలా అద్భుతమైనవెన్నో ఏర్పాటు చేస్తున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి, అర్బన్ పార్క్‌ను సైతం త్వరగా అందుబాటులోకి తేనున్నారు.
త్వరలోనే పనులు పూర్తి
పిల్లలు, పెద్దలు వారంలో ఒక రోజు సరదాగా గడిపేందుకు అర్బన్ పార్కు ఏర్పాటు చేయడం మన జిల్లాకు వరమే. చాలా వరకు పనులు పూర్తయ్యాయి. త్వరలోనే మిగతా పనులు పూర్తి చేస్తాం. పిల్లలు ఆడుకునేందుకు, పెద్దలు కూర్చునేందుకు, సంతోషంగా గడిపేందుకు రకరకాల వసతులు కల్పించాం. మంత్రి కేటీఆర్ చొరవ వల్లనే ఇంత అందమైన పార్కును దగ్గర్లో ఏర్పాటు చేసుకుంటున్నాం.