మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఆస్తుల కోసం అయినవారే ప్రాణాలు తీస్తున్నారు. మరికొందరు నమ్మకంగా ఉండి నగదుకోసం కర్కశంగా చంపేస్తున్నారు. ఆస్తి, డబ్బు కోసం ఇటీవల తిమ్మాపూర్‌లో జరిగిన మర్డర్లు సంచలనం సృష్టించగా.. వీరిని కడతేర్చింది రక్త సంబంధీకులు.. నమ్మినవారే కావడం ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నది. ఇటీవల మండలంలో చోటు చేసుకున్న హత్యలపై ప్రత్యేక కథనం..
-తిమ్మాపూర్ రూరల్, అక్టోబర్ 14
ఇటీవల తిమ్మాపూర్ మండలంలో చోటు చేసుకున్న సులోచన హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును ఏసీపీ కరుణాకర్‌రావు సారథ్యంలో సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్ఐ ప్రమోద్‌రెడ్డి బృందాలు ముమ్మర దర్యాప్తు చేసి నాలుగైదు గంటల్లోనే నిందితులను గుర్తించారు. వారు చెప్పిన విషయాలు విన్న పోలీసులు, ప్రజలు విస్మయానికి గురయ్యారు. సులోచనను హత్యచేసే పథకంలో సొంత కూతురు తేజశ్రీ పాత్ర కీలకంగా ఉండడం హాట్ టాపిక్‌గా మారింది. తన తల్లి.. మేమమామ కూతురుని పెంచుతున్నదని, ఆస్తి తనకు ఇవ్వదేమోనన్న భయంతోనే భర్త, మామతో కలిసి ప్లాన్ చేసినట్లు విచారణలో ఒప్పుకున్నది. ఆస్తి కోసం హత్య చేయించిన బిడ్డతోపాటు భర్త, మామ, మరిది, మరో ఇద్దరు నిందితులు కటకటాలపాలయ్యారు.
ఆస్తి కోసం బామ్మర్దినే ..
ఇది మరో విషాదకర ఆస్తి హత్య. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రవి అనే యువకుడు తల్లిదండ్రుల నుంచి కొంత భూమి అమ్ముకుని ఇల్లు కట్టుకుంటుండగా ఓర్వలేని సొంత బావనే స్నేహితులతో కలిసి కర్కశంగా హత్య చేశారు. హత్య చేసి ఏమీ ఎరగనట్టు కెనాల్లో పడేసి ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పోలీసులు విచారణ జరిపి రెండు రోజుల్లోనే నిందితులను గుర్తించారు. తనకు ఉన్న ఒక్క బామ్మర్దిని చంపితే తన అత్తామామలకు ఉన్న కోట్ల ఆస్తి మొత్తానికి తన భార్యనే వారసురాలు అవుతుందన్న అత్యాశతోనే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ప్రస్తుతం బావతో పాటు అతనికి సహకరించిన వారందరూ జైలు ఊచలు లెక్కిస్తున్నారు.
భక్తులుగా నమ్మించి.. బాబాను హతమార్చి..
డబ్బుల కోసం ఇది మరో రకమైన హత్య. తిమ్మాపూర్ గ్రామంలోని జోగయ్యపల్లిలో పేరుగాంచిన పెద్దన్న స్వామిని భక్తుల రూపంలో వచ్చిన దుండుగలు కాసుల కోసం కక్కుర్తి పడి హత్య చేశారు. కొంతకాలం పాటూ స్వామిజీ వద్ద నమ్మకంగా ఉన్న ఇద్దరు వరంగల్‌కు చెందిన వ్యక్తులు.. ఆయనను హతమార్చి డబ్బులు చోరీ చేసి పారిపోయారు. కొద్ది రోజుల పాటూ కనిపించకుండా ఉన్నవారు.. వేరే చోరీల్లో హైదరాబాద్‌లో పట్టుబడి ఊచలు లెక్కిస్తున్నారు.
అయినవారే హత్యలు చేస్తున్నారు..
ఇటీవల చోటు చేసుకున్న హత్యలు దగ్గరి సంబంధీకులో, నమ్మకస్తులే చేస్తున్నారు. సొంత వాళ్లే హత్యలు చేయిస్తుండడం చాలా మందిని భయాందోళనలకు గురి చేస్తున్నది. ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మవద్దో నమ్మలేని పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో హత్యలు జరిగితే.. పక్కనున్నవారిపై, శత్రువులపై విచారణ ప్రారంభించే పోలీసులు.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో పోలీసులు సైతం సొంతవారిని అనుమానించే పరిస్థితులు తలెత్తాయి.
తిమ్మాపూర్ మండలానికే మచ్చ..
చిన్న చిన్న ఘటనలు, రాజీవ్ రహదారిపై మరణాలు తప్పితే.. హత్యలు లేని తిమ్మాపూర్ మండలానికి ఇటీవల చోటు చేసుకున్న హత్యలు మాయని మచ్చగానే నిలిచిపోతాయి. ప్రశాంతమైన వాతావరణంలో భయాందోళనలకు గురవుతున్నారు. తిమ్మాపూర్ మండలం కరీంనగర్‌కు కూత వేటు దూరంలో ఉండడంతో కొన్నేళ్లుగా రియల్ భూం భారీగా పెరిగింది. దీంతో భూమిపై కన్నేసిన దగ్గరి వారే రెండు హత్యలు చేశారు. తిమ్మాపూర్‌లో రవిని భూమి వస్తుందనే సొంత బావనే చంపాడు. ఇటీవల సులోచన హత్యకు సొంత కూతురే ప్లాన్‌లో పాలుపంచుకుని స్కెచ్ వేశారు. ఈ రెండు హత్యలు సైతం మండలానికి మాయని మచ్చగానే మిగిలిపోతాయి. అలాగే తిమ్మాపూర్‌లోని స్వామిజీ వద్దకు ఎక్కడెక్కడి వారో వచ్చి జాతకాలు చెప్పించుకునేవారు. ఆయన్ను డబ్బుల కోసమే భక్తుల రూపంలో వచ్చిన దుండుగలు హతమార్చారు.
చట్టం చూస్తూ..ఊరుకోదు.
అయితే, ఇటీవల జరిగిన హత్యలు అన్ని కూడా హత్య జరిగిన తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకుని నిందితులను గుర్తించినవే. హత్య చేసి తప్పించుకోవడానికి ఎవరో చేసినట్లు నమ్మబలికినా.. పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. హత్య చేసి చట్టం చేతిలో తప్పించుకోవచ్చనుకొని జైలుపాలవుతున్నారు. హత్య చేసిన వారిపై, సహకరించిన వారిపై ఐపీసీ సెక్షన్ 302తో పాటూ 120బీ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. విచారణ అనంతరం హత్య రుజువైతే జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది.
జీవితాలు నాశనమవుతాయి
క్షణికావేశంలో అడ్డుతొలిగిస్తే.. ఆస్తి తమకే సొంతమవుతుందనే ఉద్దేశంతో ఇటీవల జరిగిన ఉదంతాలు కనిపిస్తున్నాయి. నేరం చేసి దొరకకుండా ఉంటామని ధీమాతో ప్రాణాలు తీస్తున్నారు. కానీ, గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకుంటున్నాం. ఆస్తి కోసం హత్యలు చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఇలాంటి దుర్ఘటనలు నిందితులను జీవితాంతం వెంటాడుతాయి. ఆస్తి కాజేసి, హాయిగా ఉండాలని ఆశపడ్డవారు.. జైలు ఊచలు లెక్కిస్తున్నారు. తప్పు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు. సమాజంలో జీవితాంతం దోషిగా ముద్రపడే పరిస్థితులు తెచ్చుకోవద్దు.
-ప్రమోద్‌రెడ్డి, ఎస్ఐ(ఎల్ఎండీ)