కలెక్టరేట్, అక్టోబర్ 12: ఈనెల 16న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష సమయానికి రెండు గంటల ముందే కేంద్రానికి చేరుకోవాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ డా. బీ జనార్దన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్, అసిస్టెంట్ లైజన్ అధికారులతో పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, అభ్యర్థులు హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని, అందులోని సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. తొలిసారిగా బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్న నేపథ్యంలో ముందుగా కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
ఉదయం 10.15 గంటల తర్వాత పరీక్ష కేంద్రాల ప్రధాన ద్వారం మూసివేస్తారని, హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పరీక్ష రాసేందుకు బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ను మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష రోజు కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలన్నారు. పరిసరాల్లో 144 సెక్షన్ విధించాలని సూచించారు. అభ్యర్థులు కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో సజావుగా గ్రూప్-1 పరీక్ష నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు.
జిల్లాలో 16,824 మంది అభ్యర్థులు హాజరవుతుండగా, 35 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ కోసం అవసరమైన అధికారులు, సిబ్బందిని కూడా సిద్ధం చేశామన్నారు. చీఫ్ సూపరింటెండెంట్ల గదుల్లో, జిల్లా ట్రెజరీ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్‌లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. టీఎస్పీఎస్సీ చీఫ్ సెక్రటరీ అనితారాంచంద్రన్, సీపీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, ఆర్డీవో ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు.