ఎల్లారెడ్డిపేట, అక్టోబర్ 12: దుమాల ఏకలవ్య గురుకుల పాఠశాలలో ‘స్టేట్ కల్చరల్ ఫెస్ట్ 2022-23’ ఆకట్టుకున్నది. రెండురోజుల పాటు జరిగే ఈ వేడుక తోలిరోజు బుధవారం ఆద్యంతం అట్టహాసంగా సాగింది. రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్ పర్సన్ న్యాల కొండ అరుణ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని 23 గురుకులాల నుంచి సుమారు 1200 మంది విద్యార్థులు, 300 మంది ఎస్కార్ట్‌లు వచ్చారు. ఒక్కో గురుకులం నుంచి 50 మందికిపైగా విద్యార్థులు ఈ ఫెస్ట్‌లో పాల్గొన్నారు. వీరంతా గుస్సాడి, కోయ, గోండు, బంజారాల, గోదారి, లెంగీ లాంటి నృత్యాలతో కట్టిపడేశారు. బుధ, గురువారాల్లో ఉత్తమ ప్రతిభను చూపిన సోలో, గ్రూప్ డ్యాన్స్ విద్యార్థులను బెంగళూర్‌లో జరిగే జాతీయస్థాయి కల్చరల్ ఫెస్ట్‌కు ఎంపిక చేస్తామని అధికారులు తెలిపారు. గురువారం ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.
విద్యార్థులు ఉత్తమ భవిష్యత్తు మార్గాన్ని ఎంచుకోవాలని జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ సూచించారు. విద్యతోపాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు. బుధవారం దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కల్చరల్ ఫెస్ట్‌కు ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. పాఠశాలలో ఎలాంటి వసతులు, వనరుల కొరత ఉన్నా తన దృష్టికి తెస్తే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యా రంగానికి మంత్రి కేటీఆర్ ఇస్తున్న ప్రాధాన్యతను కొనియాడారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే విద్యార్థుల కలను ప్రభుత్వం నెరవేరుస్తున్నదని, అందుకు ఓవర్సీస్ స్కీం కింద 21లక్షలు ఇస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో గురుకులాల జాయింట్ సెక్రటరీ విజయలక్ష్మి, డిప్యూటీ సెక్రటరీ చంద్రశేఖర్, ఆర్సీవో వెంకన్న, ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి, ఎంపీడీవో చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
నేను మహబూబాబాద్ జిల్లాలోని సీరోల్లో బైపీసీ ఫస్ట్ఇయర్ చదువుతున్న. ఫస్ట్‌టైం కల్చరల్ స్టేట్ఫెస్ట్లో పార్టిసిపేట్ చేసిన. ఇక్కడ పాఠశాల వాతావరణం, ఉపాధ్యాయుల తీరు చాలా బాగుంది. రాష్ట్రస్థాయి సెలెక్ట్ అయినందుకు సంతోషంగా ఉన్నది. నేషనల్ లెవల్‌కు సెలక్ట్ అవుతాననే నమ్మకం ఉన్నది.
-బానోత్ మానస, విద్యార్థిని, సీరోల్
స్టడీలో, ఆటల్లో, కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనేలా మా మేడమ్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు. ముఖ్యంగా అనూష, రాజ్యలక్ష్మి మేడంలు ఇచ్చిన ట్రైనింగ్‌తో స్టేట్ లెవల్ పోటీలకు సెలక్టయ్యాం. ఇక్కడ రాష్ట్రంలోని వివిధ స్కూళ్ల నుంచి వచ్చిన విద్యార్థులతో కలిసి పోటీల్లో పాల్గొనడం హ్యాపీగా ఉన్నది. ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నయ్.
-సెరోహిత, విద్యార్థిని కొత్తగూడెం