ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఇంట్లో ఇద్దరు ఉద్యోగం చేస్తే గానీ ఇల్లు గడవని పరిస్థితి. సగటు ఇంటి యజమాని ఎంత కష్టపడ్డా ధరల మోత జీవితంలో కాస్త వెనుకేసుకోలేని దుస్థితి. ఇలాంటి క్రమంలో ఇంటిని చక్కబెడుతూనే భర్తకు చేదోడువాదోడుగా ఉండాలని మహిళలు ఆశ పడుతున్నా దిశానిర్దేశం లేక సాధ్యంకాని దీనస్థితి. ఇలాంటి వారికి చేయూతనిచ్చేందుకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్ ) సంకల్పించింది. సిరిసిల్ల కేంద్రంగా ఉచిత శిక్షణను అందిస్తున్నది. 30 మంది బ్యాచ్‌కు 90రోజులపాటు తర్ఫీదును ఇస్తూ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్‌తోపాటు ఫ్రీగా మిషన్ కూడా అందజేస్తున్నది. ఇప్పటికే 67 బ్యాచ్‌లకు అంటే దాదాపు 2వేల మందికి దిగ్విజయంగా ట్రైనింగ్ ఇచ్చి స్వయం ఉపాధి చూపగా, అతివల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
– సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 12
కార్మికక్షేత్రమైన సిరిసిల్ల పట్టణంలో మహిళలకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు గానూ 2017లో న్యాక్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. మొదట్లో మహిళలు పెద్దగా ఉత్సాహం చూపలేదు. ఈ క్రమంలో సెంటర్ నిర్వాహకులు కరపత్రాలు, ఆటోలో మైక్, పత్రిక ప్రకటనల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. ఉచిత శిక్షణతో పాటు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి అందిస్తున్న కుట్టు మిషన్, ధ్రువీకరణ పత్రం తదితర అంశాలపై అవగాహన కల్పించడంతో క్రమంగా ఆదరణ పెరిగింది. సెంటర్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రెండువేల మంది శిక్షణను సద్వినియోగం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
న్యాక్సెంటర్లో ప్రతి 90 రోజులకు ఒక బ్యాచ్ చొప్పున శిక్షణ ఇస్తున్నారు. అందులో 30మంది మహిళలు, యువతులు ఉంటారు. శిక్షణ పొందాలనుకునే వారు స్థానిక రాళ్లబావి-శాంతినగర్ రోడ్డులోని పాత సాహితీ స్కూల్ భవనంలోని న్యాక్ సెంటర్లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డు, ఓటరు ఐడీ, పాస్‌పోర్టు సైజు ఫొటో ఇచ్చి అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది. అందులో చేరాలనుకునే మహిళల భర్తలు తప్పనిసరిగా లేబర్ కార్డు పొంది ఉండాల్సి ఉంది. ప్రతి రోజూ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు శిక్షణ తరగతులు జరుగుతాయి. శిక్షణ కాలంలో సంబంధిత స్టేషనరీని సెంటరే అందిస్తుంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉచితంగా కుట్టు మిషన్, శిక్షణకు సంబంధించిన సర్టిఫికెట్‌ను అందిస్తున్నారు. ఈ సర్టిఫికెట్ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో సంబంధిత ఉద్యోగాలకు ఉపయోగకరంగా ఉంటుంది.
న్యాక్ సెంటర్లో కుట్టు మిషన్‌తో పాటు ఎలక్ట్రికల్, ఫ్లంబర్, తాపీమేస్త్రి, పెయింటర్ విభాగాల్లో ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. వీరికి 15రోజులు, 3నెలల పాటు రెగ్యులర్ ట్రైనింగ్ కింద రెండు విభాగాలలో శిక్షణ ఇస్తారు. కంప్లీట్ అయ్యాక లేబర్ కార్డు, సంబంధిత సర్టిఫికెట్‌ను అందజేస్తారు. ఇది సర్టిఫికెట్ ట్రేడ్‌గా పనిచేస్తుంది. శిక్షణ కాలంలో ఉదయం, సాయంత్రం టీ, మధ్యాహ్నం భోజనం, యూనిఫాం, హెల్మెట్, షూ, తదితర సౌకర్యాలను ఉచితంగా కల్పిస్తారు.
మా సిరిసిల్ల న్యాక్ సెంటర్లో ఇప్పటి వరకు 2వేల మందికి పైగా మహిళలు, యువతులు ఉచిత కుట్టు శిక్షణను పూర్తి చేసుకున్నారు. ప్రతి బ్యాచ్‌లో 30మందికి శిక్షణ అందిస్తున్నాం. ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న వారికి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కుట్టు మిషన్లు, సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఇక్కడ అందిస్తున్న సర్టిఫికెట్స్ సంబంధిత ఉద్యోగాల కోసం ట్రేడ్‌గా ఉపయోగపడుతుంది. మహిళలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– ప్రకాశ్, న్యాక్ సెంటర్ ఇన్చార్జి (సిరిసిల్ల)
న్యాక్ సెంటర్లో అందిస్తున్న ఉచిత కుట్టు శిక్షణలో ప్రారంభంలో అవగాహనలోపంతో మహిళలు ఉత్సాహం చూపించలేదు. ప్రస్తుతం విశేష స్పందన లభిస్తున్నది. ప్రతి బ్యాచ్‌లో 30మందికి శిక్షణ ఇస్తుండగా, కొత్త బ్యాచ్‌లో అడ్మిషన్ల కోసం మహిళలు పోటీపడుతున్నారు. శిక్షణ సమయంలో పంచింగ్ అటెండెన్స్ తీసుకుంటాం. మహిళలకు అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయి. ఉపాధికి ఉపయోగపడే ఈ శిక్షణను అందరూ వినియోగించుకోవాలి.
– దేవేంద్ర, న్యాక్ సెంటర్ ట్రైనర్ (సిరిసిల్ల)